Two-wheeler sector
-
మూడేళ్లలో హోండాకు నంబర్-1 మార్కెట్‌గా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన రంగంలో రెండు మూడేళ్లలో సంస్థకు టాప్-1 మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని హోండా భావిస్తోంది. ప్రస్తుతం హోండాకు 25 శాతం అమ్మకాలతో భారత్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానాన్ని ఇండోనేసియా కైవసం చేసుకుంది. కంపెనీ చేసిన పెట్టుబడులు, వృద్ధి రేటు కారణంగా 2017-18 నాటికి భారత్ అగ్ర స్థానానికి ఎగబాకుతుందని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ కీట మురమత్సు తెలిపారు. కంపెనీ స్కూటర్ల అమ్మకాలు దేశీయంగా గణనీయంగా పెరగడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని చెప్పారు. 2015 ఎడిషన్ ఏవియేటర్, యాక్టివా-ఐ స్కూటర్ల ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2015లో 8 మోడళ్లను తీసుకొచ్చామని, మరో 7 మోడళ్లు రానున్నాయని తెలిపారు. ఏడు సెకన్లకో కస్టమర్..: భారత్‌లో హోండా ఇప్పటి వరకు 2 కోట్ల టూ వీలర్లను విక్రయించింది. 7 సెకన్లకు ఒక కొత్త కస్టమర్ వచ్చి చేరుతున్నారు. ఏప్రిల్, మే గణాంకాల ఆధారంగా ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా 26 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2014-15లో దేశీయంగా 44.5 లక్షల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది 46.7 లక్షల వాహన అమ్మకాలు లక్ష్యం. ప్రస్తుత 3 ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 46 లక్షల యూనిట్లు. గుజరాత్ ప్లాంటు 2016 ఆరంభంలో అందుబాటులోకి రానుంది. పెరుగుతున్న మహిళా కస్టమర్లు.. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల వాటా 28 శాతం. 2015-16లో ఇది 30 శాతానికి చేరుతుందని కంపెనీ సేల్స్ ఆపరేటింగ్ హెడ్ యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. ‘మహిళా కస్టమర్లు గణనీయంగా పెరుగుతున్నారు. హోండా స్కూటర్ కస్టమర్లలో ముగ్గురిలో ఒకరు మహిళ ఉంటున్నారు. నెలకు 75,000 మంది కస్టమర్ల జాబితాలో చేరుతున్నారు’ అని వివరించారు. హైదరాబాద్ విపణిలో హోండా తొలి స్థానంలో ఉంది. బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తాప్సీని హైదరాబాద్ వేదికగా హోండా ప్రకటించింది. -
హైదరాబాద్‌కే హీరో ప్లాంట్?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలో తొలి ప్లాంటును చేజిక్కించుకోవడానికి రెండు రాష్ట్రాలూ పోటీపడ్డ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పైచేయిగా ఉన్నట్టు తెలుస్తోంది. వాహన దిగ్గజం హీరో మోటో కార్ప్ దక్షిణాదిన ప్లాంటు పెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతోందని ప్రచారం జరిగినా చివరికి హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్‌లో ప్లాంటు స్థాపించడానికి హీరో కంపెనీ మొగ్గు చూపుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్లాంటుకు అనువైన స్థలాలను ఈ బృందం పరిశీలిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ బృందం ఎంపిక చేసిన స్థలాలను మరో బృందం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కంపెనీకి కావాల్సినంత స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హీరో బృందం రావడాన్నిబట్టి చూస్తే ప్లాంటు జహీరాబాద్‌లో ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏటా 15-20 లక్షల బైక్‌లు.. హీరో మోటో కార్ప్‌కు హర్యానాలో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒక ప్లాంటు ఉంది. వీటి తయారీ సామర్థ్యం ఏడాదికి 69 లక్షల ద్విచక్ర వాహనాలు. రూ.400 కోట్లతో 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో 4వ ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తోంది. రాజస్థాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని సంస్థ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ ఇటీవలే తెలిపారు. 18 లక్షల యూనిట్ల సామర్థ్యం గల 5వ ప్లాంటు గుజరాత్లో నిర్మాణంలో ఉంది. కంపెనీ రూ.1,100 కోట్లు వెచ్చిస్తోంది. 2015-16లో ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉత్తరాది నుంచే దక్షిణాదికి హీరో వాహనాలు సరఫరా అవుతున్నాయి. కోట్లాది రూపాయలు రవాణాకే వ్యయం అవుతోంది. దక్షిణాదిన ప్లాంటు వస్తే కంపెనీకి ఒక్కో వాహనానికి రూ.2 వేలు ఆదా అవుతుందని ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆరవ ప్లాంటుకై కంపెనీ రూ.1,200-1,500 కోట్లు వెచ్చించనుందని చెప్పారు. ఏటా 15-20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో ప్లాంటు రానుందన్నారు. జహీరాబాద్ అడ్వాంటేజ్... తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల కేటాయింపులు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ దక్షిణాదిన ఇతర రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద హీరో ప్లాంటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడే మహీంద్రా ట్రాక్టర్ల తయారీ ప్లాంటు ఉంది. అలాగే వాహన విడిభాగాల పార్కును మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. విడిభాగాల లభ్యత సులభతరం అవుతుంది కాబట్టి హీరో మోటో కార్ప్‌కు ఈ ప్రాంతం కలిసి వస్తుంది.