మూడేళ్లలో హోండాకు నంబర్-1 మార్కెట్‌గా భారత్ | Honda to the Indian market for three years, the number -1 | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో హోండాకు నంబర్-1 మార్కెట్‌గా భారత్

Published Wed, Jun 24 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

మూడేళ్లలో హోండాకు  నంబర్-1 మార్కెట్‌గా భారత్

మూడేళ్లలో హోండాకు నంబర్-1 మార్కెట్‌గా భారత్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన రంగంలో రెండు మూడేళ్లలో సంస్థకు టాప్-1 మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని హోండా భావిస్తోంది. ప్రస్తుతం హోండాకు 25 శాతం అమ్మకాలతో భారత్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానాన్ని ఇండోనేసియా కైవసం చేసుకుంది. కంపెనీ చేసిన పెట్టుబడులు, వృద్ధి రేటు కారణంగా 2017-18 నాటికి భారత్ అగ్ర స్థానానికి ఎగబాకుతుందని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ కీట మురమత్సు తెలిపారు. కంపెనీ స్కూటర్ల అమ్మకాలు దేశీయంగా గణనీయంగా పెరగడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని చెప్పారు. 2015 ఎడిషన్ ఏవియేటర్, యాక్టివా-ఐ స్కూటర్ల ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2015లో 8 మోడళ్లను తీసుకొచ్చామని, మరో 7 మోడళ్లు రానున్నాయని తెలిపారు.


 ఏడు సెకన్లకో కస్టమర్..: భారత్‌లో హోండా ఇప్పటి వరకు 2 కోట్ల టూ వీలర్లను విక్రయించింది. 7 సెకన్లకు ఒక కొత్త కస్టమర్ వచ్చి చేరుతున్నారు. ఏప్రిల్, మే గణాంకాల ఆధారంగా ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా 26 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2014-15లో దేశీయంగా 44.5 లక్షల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది 46.7 లక్షల వాహన అమ్మకాలు లక్ష్యం. ప్రస్తుత 3 ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 46 లక్షల యూనిట్లు. గుజరాత్ ప్లాంటు 2016 ఆరంభంలో అందుబాటులోకి రానుంది.

 పెరుగుతున్న మహిళా కస్టమర్లు..
 గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల వాటా 28 శాతం. 2015-16లో ఇది 30 శాతానికి చేరుతుందని కంపెనీ సేల్స్ ఆపరేటింగ్ హెడ్ యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. ‘మహిళా కస్టమర్లు గణనీయంగా పెరుగుతున్నారు. హోండా స్కూటర్ కస్టమర్లలో ముగ్గురిలో ఒకరు మహిళ ఉంటున్నారు. నెలకు 75,000 మంది కస్టమర్ల జాబితాలో చేరుతున్నారు’ అని వివరించారు. హైదరాబాద్ విపణిలో హోండా తొలి స్థానంలో ఉంది. బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తాప్సీని హైదరాబాద్ వేదికగా హోండా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement