హైదరాబాద్‌కే హీరో ప్లాంట్? | hero plant to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కే హీరో ప్లాంట్?

Published Wed, Jul 2 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

హైదరాబాద్‌కే హీరో ప్లాంట్?

హైదరాబాద్‌కే హీరో ప్లాంట్?

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలో తొలి ప్లాంటును చేజిక్కించుకోవడానికి రెండు రాష్ట్రాలూ పోటీపడ్డ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పైచేయిగా ఉన్నట్టు తెలుస్తోంది. వాహన దిగ్గజం హీరో మోటో కార్ప్ దక్షిణాదిన ప్లాంటు పెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతోందని ప్రచారం జరిగినా చివరికి హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్‌లో ప్లాంటు స్థాపించడానికి హీరో కంపెనీ మొగ్గు చూపుతున్నట్టు అధికార వర్గాల సమాచారం.

ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్లాంటుకు అనువైన స్థలాలను ఈ బృందం పరిశీలిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ బృందం ఎంపిక చేసిన స్థలాలను మరో బృందం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కంపెనీకి కావాల్సినంత స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హీరో బృందం రావడాన్నిబట్టి చూస్తే ప్లాంటు జహీరాబాద్‌లో ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  

 ఏటా 15-20 లక్షల బైక్‌లు..
 హీరో మోటో కార్ప్‌కు హర్యానాలో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒక ప్లాంటు ఉంది. వీటి తయారీ సామర్థ్యం ఏడాదికి 69 లక్షల ద్విచక్ర వాహనాలు. రూ.400 కోట్లతో 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో 4వ ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తోంది. రాజస్థాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని సంస్థ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ ఇటీవలే తెలిపారు. 18 లక్షల యూనిట్ల సామర్థ్యం గల 5వ ప్లాంటు గుజరాత్‌లో నిర్మాణంలో ఉంది. కంపెనీ రూ.1,100 కోట్లు వెచ్చిస్తోంది.

2015-16లో ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉత్తరాది నుంచే దక్షిణాదికి హీరో వాహనాలు సరఫరా అవుతున్నాయి. కోట్లాది రూపాయలు రవాణాకే వ్యయం అవుతోంది. దక్షిణాదిన ప్లాంటు వస్తే కంపెనీకి ఒక్కో వాహనానికి రూ.2 వేలు ఆదా అవుతుందని ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆరవ ప్లాంటుకై కంపెనీ రూ.1,200-1,500 కోట్లు వెచ్చించనుందని చెప్పారు. ఏటా 15-20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో ప్లాంటు రానుందన్నారు.

 జహీరాబాద్ అడ్వాంటేజ్...
 తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల కేటాయింపులు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ దక్షిణాదిన ఇతర రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద హీరో ప్లాంటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడే మహీంద్రా ట్రాక్టర్ల తయారీ ప్లాంటు ఉంది. అలాగే వాహన విడిభాగాల పార్కును మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. విడిభాగాల లభ్యత సులభతరం అవుతుంది కాబట్టి హీరో మోటో కార్ప్‌కు ఈ ప్రాంతం కలిసి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement