రెండేళ్ల పాలన అద్భుతం
♦ పల్లెపల్లెన బీజేపీని బలోపేతం చేస్తాం..
♦ కేంద్రం నిధులతోనే జిల్లా అభివృద్ధి
♦ కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు, బుగ్గపాడులో ఫుడ్‌పార్కు
♦ కేంద్ర మంత్రి ప్రకాశ్‌నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అద్భుత ఫలితాలు సాధించిందని, మున్ముందు కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తూ.. పల్లెపల్లెన బీజేపీని బలోపేతం చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్‌నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నగరంలోని ఎస్ఆర్ గార్డెన్లో బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వికాస్ పర్వ్ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌నడ్డా మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణ కోసం కేంద్రం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రెండేళ్ల మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ అసోం, హర్యానా మాదిరిగానే తెలంగాణలో ఇప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. 2019 నాటికి మరింత మంది అవుతారని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులను తన కుడి భుజం, ఎడమ భుజంగా కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏనాడూ తెలంగాణ కోసం ఉద్యమం చేయకుండా.. తెలంగాణను అడ్డుకున్న జిల్లాకు చెందిన వారిని తన కుడి భుజమని ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్‌ను, ఒవైసీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకే ఉందన్నారు.
శ్రీరాముడి ఆశీస్సులతో ఖమ్మం మెట్టు నుంచే కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు నాంది పలకాలని, కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి రామచంద్రస్వామి క్షేత్రం పవిత్రమైందని, ఇక్కడి నుంచే ఈ సంకల్పానికి బీజేపీ శ్రేణులు పూనుకోవాలన్నారు. తెలంగాణలో ప్రజలకు మద్దతుగా బీజేపీ కీలకపాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో, బయట నిరసిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలోనే జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి, రాంపూర్, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, కోదాడ జాతీయ రహదారులు ఖమ్మం మీదుగా వెళ్తాయని, వీటిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంజూరు చేశారని, అలాగే జిల్లాలోని రైతులకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం బుగ్గపాడులో ఫుడ్‌పార్కు మంజూరు చేసిందని చెప్పారు. కొత్తగూడెంలో విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ ఖమ్మం.. కమ్యూనిస్టు ముక్త్ ఖమ్మం’ను చేయాలన్నారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, రాష్ట్ర నాయకులు ఉప్పల శారద, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, గెంటాల విద్యాసాగర్, ముసుగు శ్రీనివాసరెడ్డి, రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గల్లా సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మార్తి వీరభద్రప్రసాద్, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంగల సత్యనారాయణ, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి యర్రంరాజు బెహరా, రాష్ట్ర నాయకులు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నగర నాయకులు రుద్ర ప్రదీప్, గోవర్ధన్, నంద్యాల శ్రీను, శ్రీదేవి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.