Two years completed
-
నాడు అవినీతి... నేడు అభివృద్ధి
యూపీఏ.. ఎన్డీయే పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహరాన్పూర్: యూపీఏ పరిపాలన కింద దేశంలో ఆవరించిన ఉన్న నిరాశానిస్పృహలను తమ ప్రభుత్వ రెండేళ్ల పాలన తొలగించిందని.. ఇప్పుడు దేశంలో ఆశ, అభివృద్ధి విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. తన ప్రభుత్వం పేదలకు, రైతులకు అంకితమైన ప్రభుత్వమని.. ప్రజా ధనం దోపిడీని నిరోధించిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో మోదీ నాలుగు సభల్లో పాల్గొననుండగా అందులో మొదటి సభ ఇది. రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే లక్ష్యంతో.. తాను రైతుల కోసం ఆలోచించే యూపీ వాలానేనని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని గత ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందంటూ.. తమ ప్రభుత్వం అటువంటి ఆరోపణలేవీ లేకుండా నిజాయితీగా పనిచేస్తోందని చెప్పారు. దాదాపు గంటన్నర సేపు ప్రసంగించిన మోదీ.. అవినీతి అంశాలతో పాటు తన పేదల అనుకూల, రైతుల అనుకూల పథకాల నుంచి పదే పదే ఉటంకించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఒక్క రూపాయైనా లూటీ జరిగిందా? ‘‘రెండేళ్ల కిందట దేశం మునిగిపోయిందని చాలా మంది అనుకున్నారు. భారత్ మునిగిపోయిందని, పరిస్థితులు మారబోవని వాళ్లు అనేవారు. అప్పుడు అంతా నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆశ, ఉత్సాహం నెలకొన్నాయి. రెండేళ్ల కిందట వార్తా పత్రికలు, టీవీ చానళ్లను చూడండి. అత్యున్నత స్థాయిలో అవినీతి అన్నది సాధారణంగా ఉండేది. నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను. గత ప్రభుత్వాలు దేశాన్ని ఎలా దోచుకున్నాయనేది చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది దోచుకోవటానికా? ఆ సంస్కృతికి ముగింపు పలకటానికి నేను ఇక్కడ ఉన్నా. మా ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి అయినా దోచుకున్నట్లు చెప్పే వార్త ఏదైనా మీరు విన్నారా? లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతగా నేను ఎన్నికైనపుడు.. నా ప్రభుత్వం పేదలకు అంకితమవుతమవుతందని నేను హామీ ఇచ్చాను. అప్పటి నుంచీ నేను తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఆ దిశగానే తీసుకున్నాను. రెండేళ్ల నా కృషిని మీరు చూసినట్లయితే.. ప్రతి నిర్ణయమూ పేదలు పేదరికంపై పోరాడేలా వారిని సాధికారం చేసేందుకు తీసుకున్నవే. అన్ని సమస్యలకూ అభివృద్ధే పరిష్కారం. ఇతర మాటలన్నీ ఎన్నికల్లో గెలవటం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం కోస మే. నా రికార్డును చాలా మంది భూతద్దంలో పరిశీలిస్తున్నారు. దీనిని నేను ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం ప్రతి క్షణానికీ లెక్క చెప్పాల్సిందే.’’ ప్రధాన సేవకుడిగా లెక్క చెప్తున్నా... ‘‘ఒక ‘ప్రధాన సేవకుడి’గా నేను చేసిన పని గురించి ప్రజలకు లెక్క చెప్తున్నాను. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీ గతంలో 65:35 దామాషాలో ఉండేది. దానిని మా ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు 65 శాతం రాష్ట్రాలకు వెళుతోంది. పంచాయతీలకు రెండు లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం. గత ప్రభుత్వ పాలన వరకూ విద్యుత్ లేకుండా ఉన్న 18,000 గ్రామాల్లో 7,000 గ్రామాలను మా ప్రభుత్వం కేవలం 300 రోజుల్లో విద్యుదీకరించింది. నేను అధికారంలోకి వచ్చేటప్పటికి చెరకు రైతుల బకాయిలు రూ. 14,000 వరకూ పెరిగాయి. నా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అవి ఇప్పుడు రూ. 700-880 కోట్లకు తగ్గాయి. రైతుల పట్ల చెరకు మిల్లుల యజమానులు గతంలో హీనంగా వ్యవహరించినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు. 2022లో దేశం 75వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకునే సరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మేం ఒట్టు పెట్టుకున్నాం. నా ప్రభుత్వం వికాస్ పర్వ్ నిర్వహిస్తోంది. నా మంత్రులందరూ దేశం మొత్తం తిరిగి తాము చేసిన పని గురించి వివరిస్తారు. నేను యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని కాబట్టి నేను ‘యూపీ వాలా’ని. నాకు మీ ఆశీస్సులు కావాలి.’’ 125 కోట్ల మందీ నా కుటుంబం: మోదీ ఈ సభలో.. అన్ని వర్గాల వారితో సంఘీభావంపై కీలకమైన సందేశం ఇస్తూ.. ‘గత ప్రభు త్వ హయాంలో పథకాలకు మత, కులపరమైన పేర్లు పెట్టడం అలవాటుగా ఉండేది. కానీ నా ప్రభుత్వ పథకాలు నా కుటుంబమైన 125 కోట్ల మంది భారతీయులందరి కోసం ఉద్దేశించినవి. కులం, జాతి, మతం వంటివి మమ్మల్ని నడిపించవు’ అని అన్నారు. ఎంతో చేశాం.. చేయాల్సింది చాలా.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మోదీ వాషింగ్టన్: తమ రెండేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని.. అయితే మున్ముందు చేయాల్సింది చాలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు వచ్చే నెలలో ఆ దేశంలో మోదీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధి కోసం తాను బాటలు వేశానని.. ఆ మార్గంలో పయనించడానికి రాష్ట్రాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నానని, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు సరిదిద్దానని మోదీ చెప్పుకొచ్చారు. కీలకమైన వస్తువులు, సేవలపై పన్ను (జీఎస్టీ) బిల్లు ఈ ఏడాది పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను సవరించామని.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం సరికాదు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను విక్రయించడం సరికాదని మోదీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగం నుంచి అకస్మాత్తుగా బయటపడటం సాధ్యం కాదని, అలా వదిలించుకోకూడదని అన్నారు. మోదీ సర్కారు చేసిందేంటి? చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ న్యూఢిల్లీ: కేంద్రంలో సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ సంబరాలు జరుపుకోవటంపై కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు మండిపడ్డాయి. ఈ రెండేళ్లలో ఎన్డీఏ సర్కారు సాధించిందేంటని ప్రశ్నించాయి. ఎన్నికల హమీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా.. గిమ్మిక్కులతో ప్రజలు మోసం చేశారని కాంగ్రెస్ విమర్శించింది. కేవలం పత్రికలు, చానెళ్ల ద్వారానే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. అచ్ఛేదిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు ఆధ్వర్యంలోని ఈ రెండేళ్లు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం ఎదుర్కొన్న అత్యంత దురదృష్టకరమైన కాలమని పవర్‌పాయిట్ ప్రజెంటేషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధాని కార్యాలయం అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీగా మారిందని ఆప్ విమర్శించింది. రెండేళ్ల పాలనపై ప్రచారానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. సరిహద్దు భద్రత, ద్రవ్యోల్బణం, పథకాలు ప్రజలకు చేరటం వంటి అంశాల్లో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని ఎన్డీఏ భాగస్వామి శివసేన ఆరోపించింది. వైద్యుల పదవీ విరమణ వయసు 65కు! * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులందరికీ వర్తిస్తుంది: మోదీ * ప్రతి నెలా గర్భిణీలకు ఉచిత వైద్యం చేయాలని పిలుపు సహరాన్పూర్: దేశంలో వైద్యుల కొరత కారణంగా ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహరాన్ఫూర్ సభలో ప్రకటించారు. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఈ వారంలో ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం కింద పనిచేసే వైద్యులకైనా ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ మంది వైద్యుల అవసరం ఉంది. కానీ ఆ వ్యత్యాసాన్ని గత రెండేళ్ల నా ప్రభుత్వ కాలంలో పూరించటం సాధ్యం కాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలుగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో 62 సంవత్సరాలుగా ఉంది. తగినన్ని సంఖ్యలో వైద్య కళాశాలలు ఉన్నట్లయితే మనకు మరింత మంది వైద్యులు ఉండేవారు. కొరత కనిపించేది కాదు. రెండేళ్లలో వైద్యులను తయారు చేయటం కష్టం. కానీ పేద కుటుంబాలను వైద్యులు లేకుండా జీవించే పరిస్థితిలోకి నెట్టివేయజాలం. కాబట్టి.. మన వైద్యుల పదవీ విరమణ వయసును రాష్ట్రాల్లో అయినా, కేంద్ర ప్రభుత్వంలో అయినా 65 ఏళ్లకు పెంచేలా కేంద్ర మంత్రివర్గం ఈ వారంలో నిర్ణయం తీసుకుంటుందని నేను దేశ ప్రజలందరికీ ప్రకటిస్తున్నా’’ అని పేర్కొన్నారు. అలాగే.. క్షేత్రస్థాయిలోకి మరింత మంది వైద్యులు అందుబాటులో ఉండేలా చేసేందుకు మరిన్ని వైద్య కళాశాలలను స్థాపించేందుకు తన ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందని చెప్పారు. అంతకుముందు.. ప్రతి నెలా తొమ్మిదో రోజున గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్యులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. అలా చేయటం.. పేదల్లో రోగాలను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడవుతుందన్నారు. -
సోషల్ మీడియా సూపర్‌స్టార్
ప్రసార - ప్రచార మాధ్యమాలు (చానళ్లు - పేపర్లు) రాజకీయ నాయకుల ప్రచారాలకు బాగానే ఉపయోగపడుతున్నా అలాంటి ప్రచారంతో పాటు ఆయా నాయకుల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) అద్భుతమైన సాధనం. అందులోనూ ట్విట్టర్ వంటివి నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ సోషల్ మీడియాను ఆయన ఉపయోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేదనడం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించబట్టే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటించాలన్నా ఆయన దాన్నే సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు. స్వీయ ప్రచారానికి, విధానపరమైన నిర్ణయాల ప్రచారానికి మాత్రమే కాదు... దేశాలతో దౌత్య సంబంధాలకు కూడా ఆయన ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా సాధనాల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆయన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయ్యారు. ఈ ఏడాది కూడా టైమ్ మ్యాగజీన్ ‘30 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులు’ జాబితాలో మోదీకి స్థానం లభించింది. ట్విట్టర్లో ఆయనను 2.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో 3.4 కోట్ల మంది మోదీని లైక్ చేశారు. ఇంటర్నెట్, చానళ్ల విస్తృత వినియోగంతో మరుగున పడిపోతున్న ఆకాశవాణి (రేడియో)కు కూడా సోషల్‌మీడియాలో చోటు కల్పించిన ఘనత మోదీదే. రేడియోలో ‘మన్ కీ బాత్’ పేరుతో మోదీ ప్రసంగాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. కీలకమైన విధాననిర్ణయాలను ప్రకటించడానికి ‘మన్ కీ బాత్’ను ఉపయోగిస్తుండడంతో అందరూ దానిపై కేంద్రీకరించాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఖాతాలను తానే స్వయం గా నిర్వహిస్తున్నారా అన్నట్లుగా ఉంటాయి మోది పోస్టింగ్‌లు, మెస్సేజ్‌లు. ‘ఈ ఫొటో నేనే తీశాను...’ ‘ఈ సంఘటన నన్నెంతగానో కదిలించింది..’ అంటూ ఆయన స్వయంగా చేస్తున్న ట్వీట్ల వల్లే నెటిజన్లు ఆయనకు బాగా చేరువవుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే మోదీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నంతగా బీజేపీ ఉపయోగించుకోలేకపోతోంది. ముఖ్యంగా ఆ పార్టీకున్న 282 మంది ఎంపీలలో మెజారిటీ భాగం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని కార్యాలయం ఇటీవలే ఈ గణాంకాలన్నీ తీసింది. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మోదీ వెంటనే ఎంపీలందరికీ ఓ లేఖరాశారు. ఒక్కో ఎంపీ కనీసం లక్ష మంది ఫాలోవర్లు, లక్ష లైక్‌లు సంపాదించేలా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో యాక్టివ్ కావాలని ఆయన ఆ లేఖలో కోరారు. తీరు మార్చిన నిర్ణయాలు *ఈ ఎన్డీయే కేబినెట్లో గత యూపీఏ ప్రభుత్వంలో కన్నా 35% తక్కువగా మంత్రివర్గ సభ్యులున్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన దిశగా మంత్రివర్గ కూర్పులో కీలక మార్పులు చేపట్టారు. తద్వారా ఆమేరకు ఖజానాపై భారం తగ్గించారు. *జనాభాలో 65% ఉన్న యువత శ్రమ శక్తిని ఉపయోగించుకోవడానికి.. నైపుణ్యాభివృద్ధి పెంపు కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. *పాక్‌తో సత్సంబంధాలను కోరుకుంటునే.. ఉగ్రవాదంపై పాక్ రెండు నాల్కల ధోరణిని ప్రతీ సందర్భంలో ఎత్తి చూపుతూనే ఉన్నారు. *ప్రణాళిక సంఘం ప్రస్తుత అవసరాలకు సరిపోదని భావించి, ‘నీతి ఆయోగ్’ను తెరపైకి తెచ్చారు. *యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలకు.. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చారు. రెండేళ్ల పాలనలో నీతిమంత పాలన అందించేందుకు కృషి చేశారు. మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రులు 1. సుష్మాస్వరాజ్ (విదేశాంగ శాఖ) 2. రాజ్‌నాథ్ సింగ్ (హోం శాఖ) 3. అరుణ్ జైట్లీ (ఆర్థిక శాఖ) 4. వెంకయ్యనాయుడు (పట్టణాభివృద్ధి శాఖ) 5. మనోహర్ పరీకర్ (రక్షణ శాఖ) 6. సురేశ్ ప్రభు (రైల్వే శాఖ) 7. నితిన్ గడ్కరీ (రోడ్డురవాణా, నౌకాయాన శాఖ) వ్యవసాయం గుడ్డిలో మెల్ల మన దేశం ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ వ్యవసాయ రంగం. స్థూల దేశీయోత్పత్తికి 14 శాతం అందిస్తున్న ప్రాధాన్య రంగం ఇది. దేశ జనాభాలో 55 శాతం మంది (సుమారు 60 కోట్ల మంది) వ్యవసాయం, అనుబంధ వ్యాపకాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అన్నదాతా సుఖీభవా అన్న భావన అనాదిగా ఉన్నప్పటికీ ఆరుగాలం చమటోర్చి పంటలు పండిస్తూ సమాజానికి అన్నం పెడుతున్న రైతుకు మాత్రం సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం అంతకంతకూ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ పాలన గుడ్డిలో మెల్ల అని చెప్పాలి. వ్యవసాయ రంగ సంక్షోభం పరిష్కారానికి ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు చేస్తామని రెండేళ్ల క్రితం బీజేపీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే, అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. అయితే, వ్యవసాయ సంక్షోభాన్ని ఉపశమింపజేసే దిశగా గత రెండేళ్లుగా ఆచితూచి అడుగులు వేస్తున్నది. స్వామినాథన్ సిఫారసు చేసిన విధంగా ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించడం కాదు గానీ.. 2022 నాటికి రైతులకు ఆదాయ భద్రత కల్పిస్తామని నమ్మబలుకుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్లలో ఈ- వేలం సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నది. ఈ చర్య వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి దోహదపడుతుందని మోదీ చెబుతున్నారు. అయితే, ఈ-వేలం సదుపాయాన్ని ఉపయోగించుకునేలా రైతులకు సాంకేతిక సహాయం అందించాల్సి ఉంది. అకాల వర్షాలు, కరువు కాటకాల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం మెరుగైన పంటల బీమా పథకాన్ని (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియం, ఎక్కువ మంది రైతులకు బీమా సదుపాయం కల్పించడం, కోత అనంతర నష్టాలకూ బీమాను వర్తింపజేయడం, అన్నిటికీ మించి.. మండలాన్ని, గ్రామాన్ని కాకుండా రైతు పొలాన్ని యూనిట్‌గా పరిగణించి నష్టాన్ని అంచనావేసే వెసులుబాటు కల్పించారు. సాగు నీటి వనరుల అభివృద్ధికి ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన ద్వారా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి.. బిందు, తుంపర సేద్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నారు. నీమ్ కోటెడ్ యూరియాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నది. వాతావరణం, వ్యవసాయ, మార్కెట్ సమాచారాన్ని అందించేందుకు కిసాన్ ఛానల్‌ను ప్రారంభించింది. -
జన్‌ధన్‌కు జై..
సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. దేశంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందిస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదమిదీ! ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ నినాదాన్ని నిజం చేసేందుకు ఆయన అనేక ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టారు. స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలతో పాటు బాలికల కోసం భేటీ బచావ్, భేటీ పడావ్, మహిళల సాధికారత కోసం ముద్ర యోజన, ఎస్సీ/ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియా.. ఇలా దాదాపు 40 పథకాలు ప్రవేశపెట్టారు. అయితే ఇందులో స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన పథకాలే ప్రజాదరణ పొందాయి. ఇటీవల సీఎంఎస్ సర్వేలో కూడా ఇదే తేలింది. ఇబ్బడిముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిలో(40 పథకాల్లో) 25 పథకాల గురించి తెలిసినవారు కేవలం 3 శాతమే ఉన్నారు. 25 శాతం మందికి ఏడు పథకాలు మాత్రమే తెలుసు. మోదీ ఇప్పటిదాకా ప్రవేశపెట్టిన పథకాలు, వాటి తీరుతెన్నులను ఓసారి చూద్దాం..- సెంట్రల్‌డెస్క్ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఒకటి. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడడం ఈ పథకం లక్ష్యం. జీరో బ్యాలెన్స్‌తో ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించే ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న మోదీ ప్రారంభించారు. పథకం ప్రారంభించిన ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 15.59 కోట్ల ఖాతాలు తెరుచుకున్నాయి. ఇది గిన్నిస్ రికార్డు. ఇప్పటివరకు ఈ పథకం కింద 21.81 కోట్ల ఖాతాలున్నాయి. వాటిలో ఖాతాదారులు రూ.37,445 కోట్లు జమ చేసుకున్నారు. రూపాయి కార్డు ద్వారా 17 కోట్ల ఖాతాలిచ్చారు. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 61 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. వారిలో 52 శాతం మహిళలే ఉండడం విశేషం. స్వచ్ఛ భారత్ అభియాన్ పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ 2014 అక్టోబర్ 2న(గాంధీ జయంతి) రోజున ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో పారిశుధ్యంపై ప్రజల్లో గతంలో కంటే అవగాహన కాస్త పెరిగింది. 1986లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కేంద్ర గ్రామీణ పారిశుధ్య పథకాన్ని ప్రారంభించారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇవేవీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్(ఎస్బీఏ) పథకం మాత్రం గణనీయమైన పురోగతి కనబరిచింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం, రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్ల చెత్తాచెదారం తొలగించడం, ప్రజాక్షేత్రాల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ఉద్దేశం. 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మరుగుదొడ్లు(9 కోట్ల టాయిలెట్లు) నిర్మించడం పథకం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాం చివర్లో (2013-14లో) 49,76,294 టాయిలెట్లను నిర్మిస్తే.. మోదీ ప్రభుత్వం 2014-15లో 58,55,666 టాయిలెట్లను నిర్మించింది. మొత్తంమీద ఇప్పటిదాకా ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే కొత్తగా 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ఎస్బీఏ కింద 2.61 లక్షల ప్రభుత్వ బడుల్లో 4.17 లక్షల మరుగుదొడ్లు నిర్మించారు. ఇదీ ప్రగతి గ్రామీణ ప్రాంతాల్లో.. *నిర్మించిన మరుగుదొడ్ల్లు - 2.07 కోట్లు *బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలికినవి - 14 జిల్లాలు, 190 బ్లాకులు, 23 వేల గ్రామ పంచాయతీలు, 56 వేల గ్రామాలు. పట్టణ ప్రాంతాల్లో.. *నివాసాల్లో మరుగుదొడ్ల నిర్మాణం -15.10 లక్షలు *ఈ ఏడాది డిసెంబర్‌కల్లా బహిరంగ విసర్జన రహిత నగరాలు(లక్ష్యం)- 400 నగరాలు ఆధార్, డీబీటీతో అక్రమాలకు చెక్ ఆధార్‌కు చట్టబద్ధత... మోదీ సర్కారు తీసుకున్న మరో కీలక నిర్ణయం! దీనిద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే అందడమే కాకుండా నగదు పక్కదారి పట్టడం చాలావరకు తగ్గిపోయింది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్ చట్టబద్ధత ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్), ఎల్పీజీ, ఉపాధి హామీ పథకాల్లో అక్రమాలకు చెక్ పడింది. ఆధార్, డీబీటీ ద్వారా ఎల్పీజీలో 3.5 కోట్ల బోగస్ కనెక్షన్లను గుర్తించి తొలగించారు. దీంతో 2014-15లో రూ.14 వేల కోట్ల సొమ్ము ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది. మేకిన్ ఇండియా పరిశ్రమలు భారత్‌లోనే తమ ఉత్పత్తులను తయారుచేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబర్ 25న ప్రధాని దీన్ని ప్రారంభించారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిచోటా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం కింద ఆటోమొబైల్స్, కెమికల్స్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, పోర్టులు, రైల్వేలు, విమానయానం, పర్యాటకం, డిజైన్, మైనింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి 25 ప్రధాన రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదీ ప్రగతి.. *దేశంలో 2013-14లో -0.1 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి 2014-15 నాటికి 2.8 శాతం మేర పెరిగింది. *ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గిపోతున్నా భారత్‌లో మాత్రం పెరిగాయి. *భారత్‌లో పెరిగిన ఎఫ్‌డీఐల శాతం-48 *పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశాల జాబితాలో భారత్ కిందటేడాది మొదటి స్థానంలో నిలిచింది. స్కిల్ ఇండియా ప్రపంచానికి భారత్ ‘మానవ వనరుల’ రాజధానిగా అవతరించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, తద్వారా పేదరికాన్ని తరిమివేయడం ఈ పథకం ఉద్దేశం. 2022నాటికి దేశంలో 40 కోట్ల మందికి వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించాలన్నది పథకం లక్ష్యం. ఇదీ ప్రగతి.. *ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటివరకు 19.55 లక్షల మంది యువతకు శిక్షణ అందించారు. *దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా 21 నగరాల్లో 1100 శిక్షణ కేంద్రాల ద్వారా 3.56 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో 1.88 లక్షల మందికి ఉపాధి లభించింది. *దేశంలో కొత్తగా 1,141 ఐటీఐలను నెలకొల్పి 1.73 లక్షల సీట్లను అందుబాటులోకి తెచ్చారు. *స్కిల్ లోన్ పథకం పేరిట బ్యాంకుల ద్వారా రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల రుణం అందిస్తున్నారు. ‘బీమా’ రక్షణ జనాన్ని బీమా ఛత్రం కిందకు తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2015 మే 9న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తెచ్చింది. సంవత్సరానికి కేవలం రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ఈ బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదవశాత్తూ మరణించినవారికి రూ.2 లక్షలు, ప్రమాదంలో అవయవాలు కోల్పోయినవారికి రూ.1 లక్ష అందిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పెన్షన్ సదుపాయాన్ని కల్పిచేందుకు అటల్ పెన్షన్ యోజన స్కీంను కూడా తెచ్చారు. ఇదీ ప్రగతి.. * సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 9.4 కోట్లు * జీవన్‌జ్యోతి పథకంలో చేరిన వారి సంఖ్య 3 కోట్లు * అటల్ పెన్షన్ యోజనలో చేరినవారు 20 లక్షలు -
మోదీ దూకుడు కొనసాగుతుందా..?
మోదీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలనకు నేటితో రెండు సంవత్సరాలు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? పొందిన వైఫల్యాలేమిటి? అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. ఆర్థిక రంగంలో మాత్రం ఆ వడి లేదు. అడుగులు ఇంకా తడబడుతున్నాయ్. ‘అచ్చేదిన్’ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ► పెరిగిన వృద్ధి నిలబడుతుందా? రెండేళ్లలో పలు సంస్కరణల్ని తెచ్చిన మోదీ ► స్థూల దేశీయోత్పత్తిలో భారతదేశ వేగం... చైనాను కూడా మించిపోయింది. ► కాకపోతే!! ఇదంతా వృద్ధిని లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్న ► సంవత్సరాన్ని మార్చటం వల్లే సాధ్యమైందనే విమర్శలొచ్చాయి. ► చైనా సహా ఎవ్వరితో పోటీ పడాలన్నా తయారీ రంగమే కీలకం కనక ► మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని అందుకున్నారు. ► దీనికోసం ఏకంగా 400 బిలియన్ డాలర్లు... అంటే రూ.27.2 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలొచ్చాయి. ఇవి సాకారమైతే తయారీ రంగ వేగానికి హద్దులుండవనేది కాదనలేని వాస్తవం. (సాక్షి, బిజినెస్ విభాగం) ఇక బ్యాంకులన్నీ మొండి బకాయిల్ని క్లీన్ చేసుకోవాల్సిందేనంటూ వాటి ప్రక్షాళనకు రిజర్వు బ్యాంకు నడుం బిగించింది. మోదీ సర్కారు వాటికి తన మద్దతుగా కొంత నగదునిచ్చింది. కాకపోతే బ్యాంకులన్నీ తమ ఎన్పీఏలను బయటపెట్టడం మొదలెట్టాక వాటి లోతెంతో తెలిసింది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా తమ వ్యాపారంలో 15-16 శాతాన్ని మొండి బకాయిలుగా చూపించాయి. ఇది ఒకరకంగా ఆయా బ్యాంకులు మునిగిపోయే పరిస్థితే!! ఇవి కొన్ని నిర్ణయాలు మాత్రమే. కాకపోతే అన్నింటా సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర బాగా తగ్గటం మోదీ సర్కారుకు కలిసొచ్చింది. కీలక రంగాలకు నిధులు మిగిలాయి. దేశ వృద్ధిని లెక్కగట్టేందుకు అనుసరిస్తున్న ప్రామాణిక సంవత్సరాన్ని మార్చడం వల్ల కావొచ్చు.. మరో కారణం కావొచ్చు.. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7 శాతానికి పైగా నమోదవుతోంది. ఈ క్రమంలో పలు ప్రపంచవ్యాప్త పరిణామాలు కూడా మోదీకి బాగానే కలిసొచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనంతో దేశీయంగాను ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పుంజుకున్నాయి. కరెంటు అకౌంటు, ద్రవ్య పరిస్థితులు మెరుగయ్యాయి. రైల్వే, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడంతో... ఆయా రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. వీటి ఊతంతో 2014 మార్చి ఆఖరుతో పోలిస్తే విదేశీ మారక నిల్వలు ఏకంగా 47 బిలియన్ డాలర్ల మేర పెరిగి గతేడాది డిసెంబర్ నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఇవి దాదాపు ఎనిమిది నెలల దిగుమతుల బిల్లులకు సరిపోతాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్దేశించిన దానికన్నా ఇవి దాదాపు మూడు రెట్లు అధికం. మేకిన్ ఇండియా.. స్టార్టప్ ఇండియా.. రెడ్ టేపిజాన్ని త గ్గించడంపై దృష్టి పెట్టడం ద్వారా.. సులభంగా వ్యాపారాలు చేయగలిగే దేశాల జాబితాలో మన ర్యాంకింగ్‌ను మోదీ మెరుగుపర్చే ప్రయత్నం చేశారు. దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేలా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దీనికింద దాదాపు 400 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కూడా సాకారమైతే.. గడిచిన 14 ఏళ్లుగా దేశంలోకి వచ్చిన పెట్టుబడులను మించుతాయి. అలాగే చిన్న సంస్థలకు తోడ్పాటునిచ్చేలా స్టార్టప్ ఇండియాను సైతం ప్రధాని ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్‌కు మొండిబకాయిల భారం.. అందరినీ బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తెచ్చే దిశగా జనధన యోజన, పెన్షన్ ప్రయోజనాలు దక్కేలా అటల్ పెన్షన్ యోజన వంటివి మోదీ ఆవిష్కరించారు. జనధన యోజన కింద దాదాపు 22 కోట్ల పైగా ఖాతాలు తెరవగా.. వాటిల్లో సుమారు రూ.37 వేల కోట్ల పైచిలుకు బ్యాలెన్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లాభాలు చూపించేందుకు ఏళ్ల తరబడి మొండి బకాయిల్ని దాస్తూ వస్తున్న బ్యాంకుల్ని ప్రక్షాళన చేసేందుకు ఆర్బీఐ నడుం బిగించింది. ఈ దెబ్బకు బ్యాంకులు ప్రకటించిన స్థూల మొండి బకాయీలు ఏకంగా రూ.4 లక్షల కోట్లు దాటిపోయాయి. ప్రభుత్వం బ్యాంకులకు ఆర్థికంగా కొంత మద్దతిస్తున్నా... కొన్నిటి పరిస్థితి మాత్రం దారుణంగా తయారయింది. వ్యాపారం సెంటిమెంటు డౌన్..! కొన్ని విజయాలున్నప్పటికీ... మోదీ ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసేలా మోదీ చేతుల్లో మంత్రదండం లాంటిదేమీ లేదన్న సంగతి మెల్లగా వ్యాపారవర్గాలకు కూడా అవగతమవుతోంది. వివిధ కారణాల వల్ల జీఎస్టీ బిల్లు నిలిచిపోయింది. ఇక విదేశీ ఇన్వెస్టర్లకు తలనొప్పిగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌ని ఎత్తివేస్తామన్నా... గతంలో ఇచ్చిన నోటీసులు ఇప్పటికీ వాళ్లను వెంటాడుతున్నాయి. ఎగుమతులు బలహీనంగానే ఉన్నాయి. బ్యాంకుల మొండి బకాయీలు 14 ఏళ్ల గరిష్టానికి ఎగిశాయి. గడిచిన రెండేళ్లుగా చూస్తే వ్యాపారస్తుల సెంటిమెంటు క్రమంగా తగ్గింది. సేవలు, నిర్మాణం, వ్యవసాయం, ఇతరత్రా రంగాల పనితీరును సూచించే ఎంఎన్‌ఐ బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ సూచీ క్షీణతే దీనికి నిదర్శనం. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు.. అంటే 2014 మేలో సుమారు 80.3 పాయింట్లుగా ఉన్న ఈ సూచీ సెప్టెంబర్ నాటికి మరింత పెరిగింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 69.6కి తగ్గిపోయింది. ఇక ఆర్బీఐ 2016-17కి గాను రూపొందించిన పారిశ్రామిక అంచనాల సర్వేలో... పరిశ్రమ వర్గాల ఆశలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. ఉత్పత్తి సామర్ధ్య వినియోగం కూడా 2013-14 మూడో త్రైమాసికంలో 73 శాతం పైగా ఉంటే.. ఇటీవలి క్యూ3లో 72 శాతానికి తగ్గింది. తరచి చూస్తే పారిశ్రామికోత్పత్తి సింగిల్ డిజిట్ స్థాయిలోను, ఎగుమతులు రెండంకెల శాతం స్థాయిలోనూ క్షీణించగా, కంపెనీల ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో భారత జీడీపీ 7 శాతం పైగా ఎలా వృద్ధి చెందుతుందో తమకు బోధపడటం లేదంటూ డాయిష్ బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు కూడా. అచ్చే దిన్ మార్కెట్లకు రాలేదు! నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలతో 2014 మే నుంచి స్టాక్ మార్కెట్ దూసుకెళ్లటం మొదలైంది. కాకపోతే ఆ మెరుపులన్నీ మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యాయి. రెండేళ్లు గడిచినా పరిస్థితి మారలేదు. ఒక్క దివాలా బిల్లు మినహా కీలక బిల్లులేవీ చట్టాలుగా మారలేదు. అందరికీ ఏమో కానీ స్టాక్ మార్కెట్‌కు మాత్రం అచ్చే దిన్(మంచి రోజులు) రాలేదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఇపుడు స్టాక్ మార్కెట్ కొంతైనా పుంజుకుందంటే అది అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కుదుటపడటం, ముడి చమురు ధరలు పుంజుకోవడం, సంస్థాగత రికవరీ... ఇత్యాది అంశాల వల్లనేనన్నది మార్కెట్ విశ్లేషకుల మాట. కమోడిటీ ధరలు క్షీణించడంతో ఈ రెండేళ్లలో లోహ షేర్లు దారుణంగా పడిపోయాయి. మొండి బకాయిల భారంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఇక మోదీకి సన్నిహితులనదగ్గ వారిలో అదానీ, అంబానీలు ముఖ్యులు. చిత్రంగా మోదీ రెండో ఏడాది పాలనలో వీరి కంపెనీల షేర్లు కుదేలై మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా తగ్గింది. ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ కూడా బాగానే క్షీణించింది. ఆ వివరాల సమాహారమే ఇది... మోదీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చూస్తే, అంబానీ, అదానీ, జిందాల్,అనిల్ అగర్వాల్ వేదాంత... ఈ దిగ్గజ గ్రూప్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 51 శాతం వరకూ క్షీణించింది. కమోడిటీ ధరలు తగ్గడం, కీలక సంస్కరణలు లేకపోవడం, కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండడం దీనికి కారణాలని చెప్పొచ్చు. 2014, మే 26న రూ.1,17,388 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపుగా సగం పడిపోయి రూ.60 వేల కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ దాదాపు 25 శాతం పడిపోయింది. కమోడిటీ కంపెనీల విషయానికొస్తే, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 14 శాతం, జిందాల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 30 శాతం, అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ మార్కెట్ క్యాప్ 40 శాతం చొప్పున పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పటికీ, ఆ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. ఈ రెండేళ్లలో లోహ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం షేర్లు బాగా నష్టపోయాయి. అంబానీ సోదరుల షేర్లు కుదేలయ్యాయి. విదేశాంగం.. విజయవంతం! మోదీ విదేశీ విధానం.. దాని ఫలితాలు, పరిణామాలు రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అత్యంత ఆశావహ దృక్పథంతో మొదలైన భార త విదేశీ విధానం తనదైన విశిష్ట విజయాన్ని ఇటీవలే నమోదు చేసుకుంది. దశాబ్ద కాలంపైగా ఊరిస్తూ వచ్చిన భారత్-ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం ఈ సోమవారమే సఫలీకృతమైంది. ఈ ఒప్పందంతో భారత్ ఇంధన అవసరాలకు అత్యంత సురక్షితమైన మార్గాన్ని కనుగొనడంతో పాటు పాకిస్తాన్, చైనా వ్యూహాత్మక సంబంధాలకు చెక్ పెట్టగలిగారు. ఇరాన్‌లోని చబహర్ నౌకాశ్రయ తొలి దశ అభివృద్ధికి సంబంధించి ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో దీర్ఘకాలంగా వాయిదాలో ఉన్న చమురులైన్ని సుసాధ్యం చేయడమే కాదు అటు తూర్పు యూరప్, ఇటు అఫ్ఘానిస్తాన్‌తో సంబంధాలను కొత్తపుంతలు తొక్కించారు. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్ఘాన్, మధ్యాసియా దేశాలకు నేరుగా రవాణాపై భారత్ కంటున్న చిరకాల స్వప్నం ఈ ఒప్పందంతో సాకారమైంది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో మోదీ తీసుకువచ్చిన మార్పులను పరిశీలిద్దాం. సానుకూల అంశాలు పొరుగు వారిని ముందుగా పలకరించడం అనేది నరేంద్రమోదీ ప్రధానిగా తీసుకున్న ప్రారంభ చొరవల్లో ఒకటి. దీంట్లో భాగంగా భారత్ సాధించిన పెద్ద విజయం బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న భూ సరిహద్దు ఒడంబడిక. ఇరు దేశాల మధ్య గత 40 ఏళ్లుగా వాయిదాలో ఉన్న ఈ వివాదం పరిష్కారమవడంతో భారత్-బంగ్లా సంబంధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అలాగే శ్రీలంకతో దశాబ్దాలుగా దెబ్బతింటూ వచ్చిన సంబంధాలు 2015 ప్రారంభంలో మెరుగుపడ్డాయి. మహీంద రాజపక్సే స్థానంలో మైత్రిపాల సిరిసేన శ్రీలంక అధ్యక్షుడైన వెంటనే 2015 మార్చిలో మోదీ ఆ దే శంలో పర్యటించారు. గత 30 ఏళ్లలో భారత ప్రధాని శ్రీలంకలో అడుగుపెట్టడం అదే తొలిసారి. ► మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, క్లీన్ గంగా, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు విదేశాల్లో ప్రచారం కల్పించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాత్మకంగా వ్యవహరించారు. ► 2015లో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం... ఒబామా, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వంటి ప్రపంచ నేతలతో మోదీ కుదుర్చుకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం భారత ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయాయి. జపాన్‌తో కుదిరిన పౌర అణు సహకార ఒప్పందం, 15 బిలియన్ డాలర్ల వ్యయంతో జపాన్ సహాయంతో దేశంలో నిర్మించనున్న హైస్పీడ్ రైల్వే లైన్ అనేవి ఆర్థికపరమైన సంబంధాన్ని కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. భారత ప్రయోజనాలను ఇన్నాళ్లూ అడ్డుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియాతో పౌర అణు ఒప్పందం కుదరటం కూడా విశేషమనే చెప్పాలి. ► ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ పేరిట ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో విస్తరించిన సంబంధాలు భారత్‌కు భారీ ప్రయోజనాలనే తెచ్చిపెట్టాయి. ఈ ఒక్క పరిణామంతో ప్రపంచ ఆర్థిక గమ్యం ఆసియావైపు అడుగేసింది. కౌలాలంపూర్, సింగపూర్ లలో మోదీ జరిపిన ఫలప్రదమైన పర్యటనలు ఈ విషయంలో విశేషంగా భారత్‌కు తోడ్పడ్డాయి. ► ఇక చైనా విషయానికి వస్తే భారత ప్రయోజనాలతో ముడిపడిన వ్యవహారాల్లో చైనా రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా చొచ్చుకురావడం ఇప్పటికీ సవాలుగానే ఉంటోంది. భారత్ తన భూభాగమని చెప్పుకుంటున్న ప్రాంతంలో 64 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మాణమవుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ చైనా-భారత్ సంబంధాలను మరింతగా పలచబారుస్తోంది. అయితే భారత ప్రాధమ్యాలను గురించి మోదీ చైనా నేతలతో నిష్కర్షగా చర్చించారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడితో తనదైన సాన్నిహిత్యాన్ని నెలకొల్పుకోవడంలో మోదీ చొరవ ప్రదర్శించారు. ► ప్రవాస భారతీయుల సంస్థాగత పటిమను, నిర్మాణ కౌశలాలను ప్రపంచానికీ చాటిచెప్పిన తొలి ప్రధాని మోదీయే. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రవాస భారతీయులు అత్యంత సంపన్నశ్రేణి గా గుర్తింపు పొందారు. ఆ దేశాల రాజకీయాలను కూడా వీరు ప్రభావితం చేస్తూ వస్తున్నారు. మోదీ పర్యటనలతో తొలిసారిగా ప్రవాస భారతీయుల ప్రభావం ప్రపంచం ముందు ప్రదర్శితమైంది. ఆ దేశాల్లో మోదీ పర్యటన, చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. ► యూపీఏ ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోని దేశాల్లోనూ మోదీ పర్యటించారు. యూపీఏనే కాదు.. భారత ప్రధానమంత్రులు గత 20 లేదా 30 సంవత్సరాలుగా పర్యటించని దేశాలనూ మోదీ చుట్టేశారు. ప్రధానిగా రెండేళ్ల పాలనలో మోదీ విదేశీ విధానం అత్యంత సానుకూల అంశాలను నమోదు చేసింది. ప్రతికూలతలు ఇన్ని విజయాల మధ్యనే మోదీ విదేశీ విధానం కొన్ని దేశాలకు సంబంధించి స్తంభనకు గురయిందనే చెప్పాలి, ముఖ్యంగా నేపాల్ విషయంలో మోదీ ప్రభుత్వం కూడా యూపీఏ విదేశీ విధానాన్ని దాటి అణుమాత్రం ముందుకు సాగలేకపోయింది. నేపాల్ నూతన రాజ్యాంగ ఆవిష్కరణ నేపథ్యంలో జరిగిన పరిణామాలు భారత్-నేపాల్ మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. ► అదేవిధంగా పాకిస్తాన్ కు మోదీ అందించిన అరుదైన స్నేహహస్తాన్ని కూడా ఆ దేశం అందుకోలేకపోయింది. పాక్‌తో చర్చల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన భారత్ దౌత్యపరంగా పొందిన వైఫల్యంగానే దీన్ని భావించాలి. దౌత్యపరమైన విజయాలు ► ఒకే సంవత్సరం అంటే 2015లో మోదీ పర్యటించిన దేశాల సంఖ్య 28. ఏ భారత ప్రధానీ ఈ ఘనత సాధించలేదు. ► ఒకే ఏడాది 12 దేశాల అధినేతలకు స్వదేశంలో స్వాగతం పలకడం కూడా మోదీకే చెల్లింది. వారిలో - అమెరికా, జర్మనీ వంటి అతి శక్తివంతమైన దేశాధినేతలతో పాటు శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, భూటాన్ వంటి పొరుగు దేశాల అధినేతలూ ఉన్నారు. ► జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలతో పౌర అణు సహకారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ► అమెరికా మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకున్నారు. ► ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో భారత్ సంబంధాల విస్తరణ ప్రపంచ ఆర్థిక రంగాన్నే ఆసియా వైపుకు మళ్లించింది. ► ఆఫ్రికా సదస్సుకు భారత్ వేదికై నిలిచింది. దాదాపు 41మంది ఆఫ్రికన్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ► ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా ఐక్యరాజ్యసమితి గుర్తించడం మోదీ వ్యక్తిగత విజయాల్లో ఒకటి. ► అయిదు మధ్య ఆసియాదేశాలలో ప్రధాని వరుస పర్యటనలు భారత్ పట్ల ఆ దేశాల దృ క్పథంలో గణనీయ మార్పును తీసుకొచ్చాయి. ► ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వంపై భారత్ డిమాండ్‌కు అత్యధిక స్థాయిలో గుర్తింపు లభించింది. ► చిరకాల మిత్రదేశం రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలకు మోదీ వ్యక్తిగతంగా కృషి చేశారు. ► భారత్‌కు ఇంధన వనరుల శాశ్వత సరఫరా విషయంలో ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంచెం తీపి.. కొంచెం చేదు ఎన్డీఏ రెండేళ్ల పాలనలో హామీల అమలు తీరు 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీలు సామాన్యుడితో పాటు మధ్య తరగతి వర్గాన్ని ఆకట్టుకున్నాయి. అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతానికి పట్టం కడతామంటూ ఓటర్లను ఆకట్టుకున్నారు. యువతకు కోట్లాది ఉద్యోగాలతో పాటు, పాలన లో సాంకేతికతకు పెద్దపీట వేసిప్రజల్ని భాగస్వాముల్ని చేస్తామని, అవినీతి అంతు చూస్తామంటూ హామీలు గుప్పించారు. పూర్తిగా మోదీ మార్కుతో సాగిన ఈ మేనిఫెస్టో ఎంత వరకు అమలైందో ఒకసారి పరిశీలిస్తే.. ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం కట్టడి ధరలకు ముకుతాడు వేసి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొస్తామన్న హామీ మేనిఫెస్టోలో ప్రధానమైంది. నల్లబజారు, అక్రమ నిల్వల అంతు చూసేందుకు ప్రత్యేక కోర్టులు, ధరల స్థిరీకరణ నిధితో దేశమంతా ఒకే జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు. వ్యవసాయ, మార్కెట్ సమాచారం క్షణాల్లో అందరికీ చేరేలా సాంకేతికతను వినియోగించుకోవడం. అమలు: హామీకి విరుద్ధంగా ఏడాది కాలంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పప్పుదినుసులు కిలో రూ.200కు చేరడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి. అక్రమ నిల్వలకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు లేవు. పారిశ్రామికవేత్తలకు చేయూత యువతకు భారీగా ఉద్యోగాలతో పాటు జౌత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాకారం అందిస్తామంటూ యువ ఓటర్లను ఆకట్టుకున్నారు.ఉత్పత్తి రంగంలో కార్మికుల ప్రాధాన్యం పెరిగేలా చర్యలు. సంప్రదాయ రంగాలైన వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి, గృహనిర్మాణంలో ఉద్యోగ అవకాశాల పెంపు. స్వయం ఉపాధికి చేయూత. అమలు: ‘మేకిన్ ఇండియా’లో ఉద్యోగాల కల్పనతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చేయూత. ప్రోత్సాహకాలతో కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆహ్వానం. ‘స్కిల్ ఇండియా’లో యువత నైపుణ్యాల్ని పెంచేందుకు చర్యలు. అసంఘటిత రంగ కార్మికులకు అటల్ పెన్షన్ యోజన. అవినీతి అంతం అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ-గవర్నెన్స్ పాలన. అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన, లక్ష్యాల మేరకు పనిచేసేలా దిశానిర్దేశం. అమలు: రెండేళ్ల మోదీ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి నిర్మూలన కోసం ఈ- పాలనకు అధిక ప్రాధాన్యం. అవినీతి కేసులపై విచారణ వేగవంతం. నల్లధనం వెనక్కితేవడం విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కితేవడం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. అమలు: నల్లధనంపై ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినా... ఇప్పటి వరకూ చర్యలు నామమాత్రమే. నల్లధనం జాబితా ప్రకటనకు వెన కడుగు ఈ గవర్నెన్స్ ఈ -పాలన, సమాచార సాంకేతికతతో సాధికారత సాధించడం. దేశమంతా బ్రాండ్‌బ్యాండ్ సేవలు. సాంకేతికత సాయంతో గ్రామీణ, చిన్నస్థాయి పట్టణాల్లో ఈ-గవర్నెన్స్, ఐటీ ఆధారిత ఉద్యోగాల కల్పన. అమలు: 1, జులై 2015న ‘డిజిటల్ ఇండియా’కు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాలనపై అవగాహనకు చర్యలు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం. గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులైన రోడ్లు, రక్షిత మంచినీరు, విద్య, వైద్యం, పౌర సరఫరా, విద్యుత్ సదుపాయాలతో పాటు ఉద్యోగ కల్పన. పట్టణాభివృద్ధి కూడా ప్రాధాన్యం. వంద కొత్త నగరాల నిర్మాణానికి చర్యలు. రవాణా, గృణ నిర్మాణ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టడం. అమలు: 2016 బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలకు అధిక కేటాయింపులు. జన్‌ధన్‌యోజనలో 21.74 కోట్ల బ్యాంకు ఖాతాలు. 100 స్మార్ట్ సిటీల ప్రకటన. తొలి జాబితాలో 32 నగరాల ఎంపిక. స్మార్ట్ సిటీల కోసం బడ్జెట్లో రూ.7,060 కోట్లు కేటాయింపు. -
రాజకీయ విజేత
సోషల్ మీడియా సూపర్‌స్టార్.. ‘ట్వీటర్’ భాయ్.. ‘మన్‌కీ బాత్’ మోదీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలనకు నేటితో రెండు సంవత్సరాలు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? పొందిన వైఫల్యాలేమిటి? అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. రాజకీయ రంగంలో మాత్రం నిస్సంశయంగా మోదీనే విజేత. తాను సంకల్పం చెప్పుకున్న విధంగా ‘కాంగ్రెస్ ముక్త భారత్’ దిశగా వడివడిగా అడుగులేస్తున్నారు. నానాటికీ కాంగ్రెస్ పార్టీ శల్యమైపోతోంది. ఆర్థిక రంగంలో మాత్రం ఆ వడి లేదు. అడుగులు ఇంకా తడబడుతున్నాయ్. ‘అచ్చేదిన్’ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ► మోదీ రెండేళ్ల రాజకీయ విజయం ► ‘అచ్చే దిన్’ కోసం ఇంకా నిరీక్షణ ఏళ్ల తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు ‘అచ్చే దిన్’ తెస్తామని.. అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలన విమర్శల్లో మునిగిపోయిన ‘కాంగ్రెస్’ నుంచి భారత్‌ను ముక్తం చేస్తామని.. రెండు ప్రధాన నినాదాలతో ఎన్నికల్లో పోరాడి అద్భుత విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సర్కారు గురువారంతో రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. మరి ఆ లక్ష్యాల్లో ఈ రెండేళ్లలో ఎంతవరకూ సాధించారంటే..? ప్రజలకు మంచి రోజులు ఇంకా మొదలు కాలేదు కానీ.. కాంగ్రెస్‌కు గడ్డు రోజులు మాత్రం పెరిగిపోతున్నాయి. మోదీ సర్కారు ఆర్థికాభివృద్ధి రంగంలో ఇంకా ముందడుగు వేసే క్రమంలోనే ఉన్నప్పటికీ.. ఆయన కేంద్ర బిందువుగా అధికార బీజేపీ రాజకీయ రంగంలో మాత్రం బలంగా దూసుకెళుతోంది. అదే సమయంలో సామాజిక రంగంలోనూ భావజాలాల ఘర్షణ విస్తరిస్తోంది. మత అసహనం, ఆధిపత్యవాదం, జాతీయవాదం వంటి అంశాలపై విశ్వవిద్యాలయాల్లో మేధోవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆశించినంత అభివృద్ధి లేకపోవటం, కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోవటం, ధరలు పెరుగుతుండటం, అసహనతత్వం విస్తరిస్తుండటం వంటి వాటి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రం కనిపించటం లేదు. పైగా మోదీ మీద సానుకూల పవనాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని.. ఆ కారణంగానే రాష్ట్రాల్లో సైతం బీజేపీ విస్తరిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి భారీ కార్యక్రమాలతో పాటు సామాన్య ప్రజలకు ఆరోగ్యబీమా, రైతులకు పంట బీమా వంటి సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూలత సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం రోజురోజుకూ అంతరిస్తూ పోతోంటే.. బీజేపీ ప్రభావం అంతకంతకూ విస్తరిస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య పట్టుపట్టి పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చి.. ఎన్నికల్లో కమలదళానికి అద్భుత విజయాన్ని సాధించిపెట్టిన నరేంద్రమోదీకి దీటైన మరో నేత.. ఆయనను ఢీ కొట్ట గల ప్రతి నాయకుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎవరూ కనిపించటం లేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కానీ, ఆమె కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కానీ.. మోదీ హవా ముందు తేలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రజాదరణ అంతరించి పోతోందా? 2013 జూన్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితుడైనప్పుడు మోదీ ఒక పిలుపునిచ్చారు. ‘‘ఈ దేశాన్ని కాంగ్రెస్ నుంచి మనం విముక్తం చేయాల్సిన అవసరముంది. కాంగ్రెస్ లేని భారత్‌ను నిర్మించటం మన లక్ష్యం కావాలి’’ అని నినదించారు. అప్పటికి పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాలో కొట్టుకుపోయింది. లోక్‌సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా అయినా పొందలేకపోయింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వాటిలో 11 రాష్ట్రాల్లో తానే ప్రభుత్వ సారథిగా ఉండగా.. మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సారథ్యంలోని సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉంది. రెండేళ్ల తర్వాత తిరిగి చూస్తే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడుకు తగ్గిపోయాయి. మరొక రాష్ట్రంలో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా సంకీర్ణ సర్కారు ఉంది. 2014 మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణం చేసేటప్పటికి.. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, అస్సాం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కారు ఉంటే.. జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లలో కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు మోదీ సర్కారుకు రెండేళ్లు పూర్తయ్యేటప్పటికి.. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మిజోరం, పుదుచ్చేరిలకు కాంగ్రెస్ పరిమితమైంది. బిహార్ సర్కారులో జూనియర్ పార్టనర్‌గా ఉంది. అయితే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ పరిగణించే మధ్యభారతదేశంలో లేకపోవటం గమనార్హం. అంతేకాదు.. అందులో కర్ణాటకను మినహాయిస్తే మిగతావన్నీ చిన్నా చితకా రాష్ట్రాలే. మరొకరకంగా చెప్తే.. కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న భారత ప్రజల సంఖ్య వేగంగా భారీగా పడిపోతోంది. జనాభా ప్రాతిపదికన చూస్తే.. కేవలం సుమారు 7 శాతం మంది (అందులో కర్ణాటక జనాభా 5 శాతం) దేశ ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఉన్నారు. ఆ పార్టీ జూనియర్ భాగస్వామిగా ఉన్న బిహార్‌ను కూడా కలిపినా కాంగ్రెస్ పాలనలోని మొత్తం జనాభా దేశ జనాభాలో 15 శాతానికి మాత్రమే పెరుగుతుంది. ఇది ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 16 శాతం కన్నా తక్కువ. దీనినిబట్టి.. భారతదేశం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ దిశగా వేగంగా పయనిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి విషయంలో..: కేంద్ర ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు రాకుండా రెండేళ్లు సాగటం మోదీ సర్కారు సాధించిన ఒక విజయం. అయితే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలు.. ఆ పార్టీ కూడా అందుకు అతీతం కాదన్న విషయాన్ని చెప్తున్నాయి. అలాగే.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై రేగిన వివాదాలు.. అందులో మోదీ తన విద్యార్హతలపై వచ్చిన వివాదానికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టకపోవటం ఆయన ప్రతిష్టకు కొంత చేటు చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే.. ఎన్నికల హామీల్లో ప్రధానమైన నల్లధనం వెనక్కు తెస్తామన్న మాట ఇంకా నెరవేరలేదు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి, ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన బడా పెట్టుబడిదారులను వెనక్కు రప్పించటంలోనూ ఇంకా సఫలం కాలేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో..: మోదీ అధికారంలోకి వచ్చాక కేంద్ర – రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించటం మొదలైంది. రాష్ట్రాలకు ఆర్థికంగా మరింత సాధికారం చేసేందుకు ఆయన సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 42 శాతానికి పెంచటం అందులో ఒకటి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాల అభిప్రాయానికి మరింత విలువనివ్వాలన్న నిర్ణయం సహకార సమాఖ్యను బలోపేతం చేసేదే. కానీ.. బీజేపీ లేదా ఎన్డీఏ యేతర పక్షాల పాలనలోని రాష్ట్రాలతో కేంద్రం ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాలు.. ఢిల్లీ సర్కారుతో నిత్యం జగడాలు ఆ కోవలోనివే. ‘అచ్చే దిన్’ మున్ముందు వస్తాయా? ఈ రెండేళ్లలో మోదీ సర్కారు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ భారీగా నిధులు వ్యయం చేస్తోంది. కానీ ఉపాధి అవకాశాలు ఏమంతగా మెరుగుపడలేదు. పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచినప్పటికీ పెట్టుబడుల రాక వేగం పుంజుకోలేదు. వీటికి తోడుగా భూసేకరణ సంస్కరణలు తెచ్చినప్పటికీ పరిశ్రమల స్థాపన మెరుగుపడలేదు. ఒకవైపు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ కొనసాగుతున్నా దేశంలో క్షేత్రస్థాయిలో పెద్దగా ఫలితాలు కనిపించటం లేదు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగానూ ఆర్థికాభివృద్ధి నెమ్మదించటమేనని చెప్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవటం ద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి అవకాశాలను తగ్గించటం, ఆ ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందేలా చూడటంతో పాటు.. మరింత ఎక్కువమంది ప్రజలను, లావాదేవీలను ప్రధాన ఆర్థిక స్రవంతికి అనుసంధానం చేశారు. అయినా వారి జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా వర్షాభావం, నీటికొరత, కరవు కారణంగా దేశంలో నాలుగో వంతు మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. మోదీ సర్కారు ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టిన చర్యలు మున్ముందు సత్ఫలితాలు ఇస్తాయని.. అప్పుడు ‘మంచి రోజులు’ వస్తాయని ప్రభుత్వ పెద్దలతో పాటు పలువురు నిపుణులూ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై..: భారత విదేశీ విధానానికి మోదీ కొత్త జీవం పోశారనే నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి.. తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి మోదీ గతంలో ఏ ప్రధానీ చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు. రెండేళ్లలో ఐదు ఖండాల్లోని 40 దేశాలను సందర్శించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూ పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ జన్మదినం రోజున సైతం అనూహ్యంగా అక్కడకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. అయితే.. పాక్‌తో సత్సంబంధాల సంగతేమో కానీ అంతర్జాతీయ వేదికపై మాత్రం భారత్ ప్రతిష్ట ఇనుమడించిందనే చెప్పవచ్చు. సామాజిక రంగంలో..: మోదీ రెండేళ్ల పరిపాలనలో ఏదైనా పెద్ద విమర్శ ఉందంటే అది సమాజంలో ‘అసహనం పెరుగుతోంద’న్న విమర్శే. ప్రధానంగా బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండే సంఘ్ పరివార్ సంస్థలు, హిందుత్వ శక్తులు మత అసహనానికి పాల్పడుతున్న ఉదంతాలు ఈ రెండేళ్లలో ప్రముఖంగానే కనిపించాయి. దబోల్కర్, కలబుర్గి, పాన్సేరే వంటి హేతువాదులు హత్యకు గురవటం, బీఫ్ తినటంపై నిషేధం, ఘర్ వాపసి వంటి ఉదంతాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆయా ఘటనలపై మోదీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ పలువురు రచయితలు, మేధావులు, కళాకారులు ప్రభుత్వ అవార్డులను వెనక్కు ఇవ్వటం పెను కలకలం రేపింది. అలాగే.. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య.. జేఎన్‌యూలో విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌ను దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయటం వంటి ఘటనలు విద్యార్థి లోకంలోనూ మేధావి వర్గంలోనూ తీవ్ర అలజడిని రేపింది. ప్రాంతీయ పార్టీలపై గెలుపులేదు ఇక బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలు 10 రాష్ట్రాల్లో – ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఢిల్లీ, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం – అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల మొత్తం జనాభా 41 శాతానికి పైనే. అయితే.. బీజేపీ ఈ రెండేళ్లలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఒక్క ప్రాంతీయ పార్టీని కూడా ఓడించలేకపోవటం విశేషం. సర్వశక్తులూ ఒడ్డినా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ), బిహార్‌లో నితీశ్‌కుమార్ (జేడీయూ)లను గెలవలేకపోవటం మాత్రమే బీజేపీకి ఈ రెండేళ్లలో రాజకీయంగా తగిలిన ఎదురుదెబ్బలు. అంతేకాదు.. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీకి (తృణమూల్ కాంగ్రెస్) కానీ, తమిళనాడులో జయలలితకు (అన్నా డీఎంకే) కానీ బీజేపీ గట్టి సవాల్ ఇవ్వలేకపోయింది. ఇక కేరళలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ.. అక్కడ బలంగా ఉన్న వామపక్షాలు బీజేపీని పుంజుకోనివ్వలేదు. దాంతో కేవలం ఒక్క సీటు సంపాదించి ఖాతా తెరిచిన సంతోషంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. . నలుదిశలా వికసిస్తున్న కమలం.. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టేటప్పటికి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వాలను నడుపుతోంది. వాటిలో 9 రాష్ట్రాల్లో – మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గోవా – సొంతంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. మరో 4 రాష్ట్రాల్లో – ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ – సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఐదు రాష్ట్రాల్లో – మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, అస్సాం – బీజేపీ స్వయంగా గానీ, సంకీర్ణంగా గానీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ చీలిక బృందంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 13 రాష్ట్రాలకు చెందిన జనాభా దేశ జనాభాలో 43 శాతానికి పైగా ఉన్నారు. అంటే.. జాతీయ స్థాయిలోనే కాదు.. రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ రోజు రోజుకూ క్షీణించిపోతుండగా బీజేపీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో గెలుపుతో ఈశాన్యంలో ఒక రాష్ట్రాన్ని తొలిసారి తమ ఖాతాలో వేసుకున్న కమలదళం.. ఇటు కేరళలోనూ ఒక అసెంబ్లీ సీటు గెలిచి ఖాతా తెరిచింది. దీంతో బీజేపీ ఇప్పుడు గుజరాత్ నుంచి గౌహతి వరకూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించినట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.