అక్టోబర్ 28న అంగారక యాత్ర!
బెంగళూరు: ఇస్రో చేపట్టిన ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ ప్రయోగానికి సర్వం సన్నద్ధమవుతోంది. అంతరిక్ష నిపుణులతో కూడిన జాతీయ కమిటీ పచ్చజెండా ఊపింది. అన్నీ సజావుగా సాగితే అక్టోబర్ 28న ‘అంగారక యాత్ర’ మొదలవుతుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. అంగారకుడిపై జీవాన్వేషణ, అక్కడి వాతావరణంపై పరిశోధన చేయడానికి ఇస్రో ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 19 మధ్య జరిపేందుకు ఇస్రో ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే, ఈ ప్రాజెక్టుపై గురు, శుక్రవారాల్లో నిపుణుల కమిటీ సమావేశాలను నిర్వహించింది. ఇస్రో మాజీ చైర్మన్ యూఆర్ రావు, అంతరిక్ష నిపుణుడు రొద్దం నరసింహతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇస్రోలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పాల్గొన్నారు. ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ ప్రయోగం, ప్రస్తుత ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై చర్చించిన నిపుణుల కమిటీ ప్రయోగానికి పచ్చజెండా ఊపింది.
తొలుత భావించినట్లుగా కాకుండా ప్రయోగాన్ని అక్టోబర్ 28 నుంచి నవంబర్ 19 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ 28న అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్త చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహ పరీక్షా కేంద్రంలో ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ ఉపగ్రహంపై ప్రకంపన, ధ్వని సంబంధ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి తరలిస్తారని వెల్లడించారు.