అదంతా రాజకీయ స్టంట్
సాక్షి, ముంబై: తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌కి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ స్టంట్ అని శివసేన నాయకుడొకరు పేర్కొన్నారు. ఫలితాలు వెల్లడి కాగానే ఇది కేవలం మోడీ విజయమని బహిరంగంగా ప్రకటించిన రాజ్... మరి ఉద్ధవ్‌కు పుష్పగుచ్ఛం పంపడమెందుకు..? శుభాకాంక్షలు ఎందుకు తెలియజేసినట్లు...? అంటూ ఆయన నిలదీశారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేకి మర్యాదపూర్వకంగా ఆరు అడుగుల ఎత్తయిన భారీ పూల బొకేని రాజ్ పంపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ రాజ్‌ఠాక్రే కేవలం సానుభూతి రాజకీయాలు చేస్తారని ఆరోపించారు.
పూలబొకే పంపడంలోని ఆంతర్యం ప్రజల సానుభూతి పొందడానికి చేసిన యత్నమని ఆరోపించారు. ఇతరులతో పూల బొకే పంపించే బదులు తానే స్వయంగా మాతోశ్రీ బంగ్లాకు వచ్చి ఉద్ధవ్‌కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశమే ఉంటే నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో పూల బొకే ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.
అంతేకాకుండా ఠాణే, కల్యాణ్-డోంబివలి కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఘన విజయం సాధించిందని, ఈ పూల బొకే ఆలోచన అప్పుడు ఎందుకు రాలేదని నిలదీశారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చిన శివసేనను అభినందించని రాజ్... ఇప్పుడెందుకు శుభాకాంక్షలు తెలియజేసినట్లోననని ఎద్దేవా చేశారు.