ఆ సినిమా చూడకండి.. వైరస్ వస్తోంది!
ముంబై: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే ఆన్లైన్ లో లీక్ అవడం పట్ల సినిమా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. పైరసీని ప్రోత్సహించొద్దని, ధియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. ఈ సినిమాను నిజంగా సెన్సార్ బోర్డు లీక్ చేసివుంటే అంతకన్నా అవమానం మరోటి ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఒకవేళ సెన్సార్ లీక్ చేయకుంటే పైరసీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ లో 'ఉడ్తా పంజాబ్' లీక్ కావడం బాధ కలిగించిందని తెలుగు సినీ నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. ఇది సినిమా రూపకర్తలను, ఫిల్మ్ ఇండస్ట్రీని అగౌరవపరచమేనని ఆయన ట్వీట్ చేశారు.
'ఉడ్తా పంజాబ్' వివాదంపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. ఈ సినిమా లీక్ వెనుక ప్రధాని మోదీ హస్తం ఉందని ఒకరు అంటే, ఇదందా సెన్సార్ బోర్డు కుట్రని మరొకరు ఆరోపించారు. ముందు హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టడం మానుకోవాలని మరొకరు సలహాయిస్తే.. వివాదంతో 'ఉడ్తా పంజాబ్' మంచి పబ్లిసిటీ వచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఆన్లైన్ లో లీకైన 'ఉడ్తా పంజాబ్'తో కంప్యూటర్లకు వైరస్ ప్రమాదం ముప్పు పొంచివుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లింకులను క్లిక్ చేస్తే వైరస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. 'ఉడ్తా పంజాబ్' లీక్ తో నేను ఎందుకు ట్రెండింగ్ అవుతున్నానని ప్రశిస్తూ 'త్రీఇడియట్స్' సినిమాలోని 'వైరస్' పాత్రధారి ఫొటో పెట్టారు.