'ఉడ్తా పంజాబ్' ఎఫెక్ట్; 179 లింక్స్ బ్లాక్
ముంబై: 'ఉడ్తా పంజాబ్' ఆన్లైన్ లో లీక్ పై ఫిర్యాదు అందించిన 24 గంటల్లో ముంబై పోలీసులు స్పందించారు. ఆన్లైన్ లో ఈ సినిమాకు సంబంధించిన 179 లింకులు బ్లాక్ చేశారు. మరో 500 లింకులను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్) సహాయంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
విడుదలకు ముందే బుధవారం మధ్యాహ్నం 'ఉడ్తా పంజాబ్'ను ఆన్లైన్ లో లీక్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు గురువారం కోర్టును ఆశ్రయించారు. తమ సినిమాను ఆన్లైన్ పెట్టిన వెబ్సైట్లను నిలిపివేసేలా ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇంటర్నెట్ డొమైన్లు, 500పైగా ఇంటర్నెట్ యూఆర్ఎల్స్ ను కోర్టుకు సమర్పించారు.
'ఉడ్తా పంజాబ్' ఆన్లైన్ లో ఎవరు లీక్ చేశారో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, సెన్సార్ వివాదాలను దాటుకుని శుక్రవారం ఈ సినిమా ధియేటర్లలో విడుదలైంది.