ugd
-
జీతాలడిగితే.. ఉద్యోగాలు లేకుండా చేస్తా..
సాక్షి, విజయనగరం : జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఏఈ రాజ్‌కుమార్, కాంట్రాక్టర్ భరత్ బెదిరింపులకు దిగుతున్నారని నరవ యూజీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జీతాలిప్పించండి మహాప్రభో’ శీర్షికతో ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జీతాలివ్వాల్సిందిపోయి ఉద్యోగాలు తీసేస్తామంటూ కాంట్రాక్టర్ భరత్, ఆయనకు వంతపాడుతూ ఏఈ రాజ్‌కుమార్ బెదిరింపులకు దిగుతున్నారు. ఉద్యోగుల పక్షాన ఉండవలసిన ఏఈ.. కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాంట్రాక్ట్ సమయం ముగిసినా ఇంకా ఇక్కడి ప్లాంట్‌లో చెలామణి చేస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా నిబద్ధతో విధులు నిర్వహిస్తున్నామన్న జాలి కూడా చూపడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
యూజీడీ... ట్రాజెడీ
– ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు – నిధుల విడుదలకు ఆసక్తి చూపని ప్రభుత్వం – పట్టించుకోని పబ్లిక్ హెల్త్ అధికారులు – అవస్థలు పడుతున్న జనం కడప కార్పొరేషన్: కడప నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి.యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనుల్లో ఏర్పడిన లోపాలు, అసంపూర్తి నిర్మాణాల వల్ల నగర వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూజీడీ పథకం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లో పగులగొట్టిన రోడ్లను మరమ్మతులు చేసేందుకు వ్యయం కనబరచకపోవడంతో ఈ పథకం తీవ్ర విమర్శలపాలైంది. అధికారుల పర్యవేక్షణ లేక చాలా చోట్ల పైపులకు మధ్య కనెక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడక్కడా యూజీడీకి ఇండ్లనుంచి కనెక్షన్లు ఇచ్చుకోవడంతో పనులు అసంపూర్తిగా ఉన్నచోట ఆ మురికినీరంతా మ్యాన్‌హోల్స్ ద్వారా ఉప్పొంగి రహదారులపైకి వస్తోంది. రూ.108 కోట్లకు పరిపాలనా అనుమతులు వచ్చినా... రూ.72 కోట్లతో యూజీడీ పనులు మొదలుపెట్టినప్పటికీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం మొత్తం రూ.108 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఈమేరకు ఇంకా రూ.36 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే అన్ని నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 1,2 జోన్లలో ఎస్టీపీ, ట్రంప్మైన్స్ నిర్మాణం, 19 కీ.మీల మేర రోడ్లను పునరుద్ధరించడానికి పబ్లిక్ హెల్త్ అధికారులు రూ.29.20కోట్లతో అంచనాలు పంపారు. అలాగే 3,4జోన్లలో 9.56 కీ.మీలు ఉన్న అంతరాలు(గ్యాప్స్)ను సరిదిద్దడానికి రూ.4.80 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటికి కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ పబ్లిక్ హెల్త్ ఎస్ఈ అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కొత్త ఏజెన్సీ వచ్చేదెప్పుడు... ఇక్కట్లు తీరేదెప్పుడు..? భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో కడపను 4 జోన్లుగా విభజించారు. మొత్తం 312కీ.మీల మేర యూజీడీ పనులు చేయాలని నిర్ణయించగా ప్రస్తుతం 286కీ.మీలు పూర్తి అయ్యింది. ఇందులో 3,4 జోన్లలో యూజీడీ పనులు దాదాపు పూర్తి అయి 16 ఎకరాలలో మురుగునీటి శుద్ది కేంద్రం (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)కూడా పూర్తయ్యింది. 1,2 జోన్లలో పనులు జరిగినా అక్కడ ఎస్టీపీకి స్థల సేకరణ సమస్య రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బుగ్గవంక చివర గూడూరు గ్రామపొలంలో 2.47ఎకరాలలో ఎస్టీపీ నిర్మాణానికి స్థలసేకరణ పూర్తయింది. ఈ ఫైల్ ఆర్డీఓ వద్ద ఈ పెండింగులో ఉన్నట్లు తెలిసింది. యూజీడీ పనులు నిర్వహించి ఐదేళ్లు పూర్తి కావడంతో పనులు చేసిన సంస్థను పబ్లిక్ హెల్త్ అధికారులు టెర్మినేట్ చేశారు. ప్రస్తుతం పనుల నిర్వహణకు పబ్లిక్ హెల్త్ అధికారుల వద్ద ఏ ఏజెన్సీ లేదు. మ్యాన్‌హోళ్లపై వేయడానికి మూతలుగానీ, వేయడానికి సిబ్బందిగానీ వారి వద్ద లేనట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పబ్లిక్ హెల్త్ అధికారులు పంపిన అంచానాలకు అనుమతులు వచ్చి కొత్త ఏజెన్సీని నియమిస్తే తప్పా నగరవాసులకు ఈ అవస్థలు తప్పేట్లు కనిపించడం లేదు. – కడపలో నాలుగు జోన్లు కలిపి 11,450 మ్యాన్‌హోళ్లు, 13,350 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉండగా 10,195 మ్యాన్‌హోళ్లు, 12,495 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు పూర్తి అయ్యాయి. కాగా సిమెంటు మూతలు నాణ్యత సరిగా లేక 40 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. మరికొన్నింటిపై మూతలే లేకపోవడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్టీసీరీజనల్ మేనేజర్ కార్యాలయం సమీపంలో మ్యాన్‌హోళ్లు దెబ్బతిని ఏడాదిపైనే అయ్యింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం తటాకాన్ని తలపించే రీతిలో ఉంటుంది. వాననీటిని బయటికి పంపేందుకు ఇక్కడి మ్యాన్‌హోళ్లను తెరవడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో మ్యాన్‌హోల్ తెరిచి ఉందనే విషయం తెలియక వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. – ఎన్జీఓ కాలనీలోని రత్న సభాపతి వీధిలో ఇటీవల సిమెంటు రోడ్డు నిర్మించారు. కానీ యూజీడీ ఇన్స్పెక్షన్ ఛాంబర్లను మాత్రం అలాగే వదిలేయడంతో అవి ప్రమాదకరంగా ఉన్నాయి. ఓంశాంతినగర్‌లో ఇటీవల నగరపాలక అధికారులు వేసిన పైపులు నెలరోజులైనా కాకమునుపే పగిలిపోయి బొరియలు ఏర్పడ్డాయి. ఇక్కడ పలు మ్యాన్హోళ్లనుంచి మురికినీరు ఉబికి వస్తోంది. నగర శివార్లలోని ఆర్టీసీ కాలనీ వెనుక ఉన్న బహుజన నగర్లో ఇదే పరిస్థితి. రెండు నెలల్లో పూర్తి చేస్తాం : పబ్లిక్ హెల్త్ ఈఈ భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి తాము పంపిన ప్రతిపాదనలకు ఎస్ఈ అభ్యంతరాలు లేవనెత్తగా వాటిని నివృత్తి చేశామని పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివనాగేంద్ర తెలిపారు. అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టి అన్ని గ్యాప్స్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకు రెండు నెలలు సమయం పట్టవచ్చని తెలపారు. -
నగరం.. నరకం
బురద గుంటలు... రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు... దుర్వాసనల మధ్య దుర్భర జీవనం... ఇదేదో మారుమూల గ్రామంలో పరిస్థితి అనుకొనేరు సుమా...! ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం సుందర స్వరూపం! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పుణ్యమా అని గత ఎనిమిదేళ్లుగా కరీంనగర్ ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకానికి సజీవ తార్కాణం! కరీంనగర్: 2005లో కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడ్డ తర్వాత యూజీడీ మంజూరైంది. రూ.76.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. మే 23, 2007న పరిపాలనా అనుమతి రాగా, ఆగస్టు 8, 2007న సాంకేతిక అనుమతి లభించింది. దీంతో మార్చి 27, 2008లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రాంకీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. 303 కిలోమీటర్ల యూజీడీ నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఇక అప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఎనిమిదేళ్లుగా నత్తకు నడక నేర్పినట్లు పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును చూస్తే.. మరో రెండు సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా పనులు యూజీడీ నిర్మాణ పనుల్లో మొదటి నుంచీ నాణ్యత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. పైపులైన్ల కింద ఇసుక వేయడం లేదు. చాంబర్ల నిర్మాణంలో నాణ్యత కరువైంది. తూతూమంత్రంగా పనులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రజారోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం ప్రజల కు శాపంగా మారింది. పైప్‌లైన్ కోసం తవ్విన రోడ్ల ను నామమాత్రంగా పూడ్చడంతో పనులు జరిగిన ప్రాంతాలన్నీ గుంతలమయంగా మారాయి. ప్యాచ్‌వర్క్ అయితే పైపై పూతలతో మమ అనిపించారు. దీంతో కొద్దిరోజులకే ఆ పూత లేచిపోయి గుంతలు ఏర్పడుతున్నాయి. మట్టిని రోడ్డుపైనే వదిలివేయడం తో నడక కూడా నరకప్రాయంగా మారింది. ఇక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు 80 శాత మే పూర్తయ్యాయి. యూజీడీ పనులు 303 కిలోమీటర్లకు 288 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా 15 కిలోమీటర్లు పైపులైన్ మిగిలి ఉంది. రూ.126.5కోట్లు ఖర్చుచేసి యూజీడీ పనులు పూర్తిచేసినా అది పనికి వస్తుందో.. మట్టిలో కలిసిపోతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల పూర్తికి మరో రూ.50 కోట్లు అధ్వాన్నంగా జరుగుతున్న పనులను నిలిపివేయాలని సంవత్సరం క్రితం వరకు స్థానిక ప్రజాప్రతి నిదులు నెత్తినోరు బాదుకున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చంతా మట్టిపాలేనని, ఇప్పటికైనా పనులు ఆపాలని ప్రభుత్వానికి విన్నవించారు. మొదట మంజూరు చేసిన రూ.76.50 కోట్లు నిధుల్లో అప్పటికే రూ.60 కోట్ల పైచిలుకు కాంట్రాక్టర్ బిల్లులు పొందా రు. ఇక మిగిలిన పనికి నిధులు సరిపోవని కాంట్రాక్టర్ సైతం చేతులెత్తేశారు. యూజీడీ గండం తప్పిం దని అందరూ అనుకుంటున్న సమయంలో గతేడాది ఆగష్టు 5న సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో యూజీడీ మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.50 కోట్లు మంజూరు చేస్తూ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈసారి ఆర్అండ్బీ ప్రధాన రహదారుల్లో 14.5 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. రోడ్లన్నీ ఛిద్రం చేసేశారు. పనులు పూర్తయిన చోట కూడా ప్యాచ్‌వర్క్‌ల పనులు చేపట్టలేకపోయారు. దీంతో తారురోడ్లు కాస్తా బొందలమయంగా తయారయ్యాయి. గుంతలు గుదిబండగా మారి వాహనదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. హౌసింగ్ బోర్డులో నరకయాతన నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో జరుగుతున్న పనులతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సబ్‌స్టేషన్ నుంచి 300 మీటర్ల పైపులైన్ కోసం నాలుగు నెలలుగా పనులు చేస్తున్నారు. పనులను క్రమపద్ధతిలో చేయకపోవడంతో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. బురుదతో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. కాలినడకే కష్టంగా మారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తిచేయాలని నెత్తినోరు బాదుకున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌లోగా పనులు పూర్తి : భద్రయ్య, ప్రజారోగ్యశాఖ ఈఈ యూజీడీ పనులు సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించాం. ప్యాచ్‌వర్క్‌ల కోసం రూ.90 లక్షలు కేటాయించాం. సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్వర్క్లన్నీ పూర్తిచేస్తాం. యూజీడీ కాంట్రాక్టర్ 25 కిలోమీటర్ల ప్యాచ్‌వర్క్ పూర్తిచేయాల్సి ఉంది. హౌసింగ్‌బోర్డులో పనులు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీవరేజ్ ట్యాంకు పనులు పూర్తి చేసి దశలవారీగా ఇండ్ల నుంచి యూజీడీ కనెక్షన్లు ఇస్తాం.