కట్నం తీసుకురాలేదనే అక్కసుతో..
హైదరాబాద్: కట్నం కోసం కట్టుకున్న భార్యపైనే యాసిడ్ పోశాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రెండేళ్ల క్రితం సాజిద్ అనే వ్యక్తికి ఉజ్మతో వివాహమైంది. అయితే పెళ్లయినప్పటి నుంచే సాజిద్ కట్నం డిమాండ్ చేయటం మొదలుపెట్టాడు. కట్నం ఇవ్వకుంటే పుట్టింటికి వెళ్లిపోవాలని భార్యను తరచూ బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఉజ్మ కన్నవారింటికి వచ్చేసింది.
అయితే భార్య కట్నంతో తిరిగి రాలేదనే కోపంతో సాజిద్ తన సోదరులతో కలిసి నిద్రిస్తున్న ఉజ్మపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఉజ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యాసిడ్ దాడితో 30 నుంచి 50 శాతం వరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషయంగా వైద్యులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడ్డ సాజిద్ పరారీ అయ్యాడు. ఉజ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సాజిద్ సోదరులు మజిద్, రిజ్వాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.