భూములకు హద్దులు గుర్తించండి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
రాసుపల్లి,(ఎన్పీకుంట) : రాసుపల్లి భూములలో ఏర్పాటు చేయబోయే అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 1200 ఎకరాల అసైన్డ, శివాయిజమా, పట్టాభూమలను గుర్తించి హద్దులను గుర్తించాలని సర్వే అధికారులను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారానికల్లా పనులు పూర్తికావాలని అన్నారు. ఎన్టీపీసీ, ఎపీ జెన్కో, ట్రాన్సకో అధికారులకు మంగళవారం ఆయన భూముల వివరాలను వివరించారు.
పి.కొత్తపల్లి, ఎన్పీకుంట, వెలిగెల్లు గ్రామాల పరిదిలో సుమారు 7688.08 ఎకరాలు భూమిని గుర్తించడం జరిగిందన్నారు. భూముల స్వాధీనం గురించి ఇప్పటికే రైతులతో చర్చలు కూడా జరిపినట్లు వివరించారు. ఏకమొత్తంలో పరిహారం అందేలా చూడాలంటూ తీర్మానం చేయడంతో విషయాన్ని రాష్ర్ట ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కొత్త జీవోల ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా చూడటం జరుగుతుందన్నారు.
నాలుగు రోజుల్లో పనులు పూర్తి
మొదట విడతలో భాగంగా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టును నేషనల్ దర్మల్ పవర్‌కార్పొరేషన్, సోలార్‌పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టడం జరుగుతోందని తహశీల్దార్ రత్నమయ్య తెలిపారు. అందులో భాగంగా మొదట విడతలో 1200 ఎకరాలకు సంబందించిన పూర్తి వివరాలను సేకరించడం జరిగిందని దీనిని 5 బ్లాక్‌లుగా ఏర్పాటు చేసి బౌండరీలు గుర్తించడం నాలుగు రోజులలో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. జెసీ వెంట నెడ్‌క్యాప్ ఎడి శివప్రసాద్, ఎన్టీపీసీ సుందర్, ఎపీజెన్‌కో, ట్రాన్స్‌కో మేనిజింగ్ డెరైక్టర్లు ఎడి మశ్చేంద్రనాథ్, మిట్కాన్ కన్సల్టెన్సీ సీనియర్ విపి దీపక్జూడ్, రెవెన్యూ అధికారులు , విఆర్ఓలు పాల్గొన్నారు.