సీఎం చుట్టూ మరింత బిగుస్తున్న ఉచ్చు
తిరువనంతపురం: సోలార్ స్కాం లో ప్రధాని నిందితుడు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో చెలరేగిన ఆందోళన ఉద్రిక్తతను రాజేసింది. ముఖ్యమంత్రిపై కేసులు నమోదు చేయాలని కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఊమెన్ చాందీ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, ప్రజాసంఘాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. డివైఎఫ్ఐ, తదితర కార్యకర్తలు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. తక్షణమే చాందీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులు సెక్రటేరియట్ వద్ద బారికేడ్లను తొలగించి లోనికి వెళ్లేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత రాజుకుంది. పోలీసులకు, కార్యకర్తలకుమధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు.
సోలార్ స్కాంలో ప్రధాన నిందితులైన సరితా నాయర్, రాధా కృష్ణన్-తమకున్న రాజకీయ పలుకుబడితో సౌర విద్యుత్ పానెల్‌ను చవకగా అందిస్తామని నమ్మించి పారిశ్రామికవేత్తల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ సిఎం వ్యక్తిగత సిబ్బంది ఏడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని జస్టిస్ శివరాజన్ కమిటీ ముందు ఆరోపించడంతో ముఖ్యమంత్రి చుట్టూ సోలార్ స్కాం ఉచ్చు బిగుస్తోంది.
ఈ ఆరోపణల నేపథ్యంలో కేసును విచారిస్తున్న త్రిసూర్ కోర్టు - ప్రాథమిక ఆధారాలను పరిశీలించి -ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో ప్రతిపక్షాలు సోలార్ స్కాంను అస్త్రంగా చేసుకుని ఊమెన్ చాందీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు తనపై ఆరోపణలు చేసిన సరితా నాయర్ పై ఊమెన్ చాందీ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.