ప్రాణాన్ని బలి తీసుకున్న ‘పరువు’
తండా పరువు తీస్తున్నావని
పంచాయతీ పెట్టిన పెద్దలు
అవమానంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ఒంటరిగా కన్పించినందుకు పంచాయతీ పెట్టారు. తండావాసులందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. తండా పరువు తీస్తున్నావని ఆమెను మందలించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పరువు కోసం పెట్టిన పంచాయతీ నిండు ప్రాణాన్ని బలిగొంది.
పెంబి(ఖానాపూర్) : పెంబి మండలం ఇటిక్యాల పంచాయతీ పరిధిలోని కిష్టునాయక్‌తండాకు చెందిన డిగ్రీవిద్యార్థిని ఉమారాణి(20) మనస్థాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కిష్టునాయక్ తండాకు చెందిన దశరత్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కుతురు ఉమారాణి(20) ఈ నెల 1న గ్రామశివారు ప్రాంతంలో పలువురు గ్రామస్తులకు ఒంటరిగా కనిపించింది. ఈ విషయమై తండా పరువు తీస్తున్నావంటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఈ నెల 2న గ్రామంలో పంచాయతీ పెట్టి అందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. దీంతో అవమానానికి గురైన యువతి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెంబిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో యువతి మార్గమధ్యలోనే మృతి చెందింది. విద్యార్థి తండ్రి దశరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్ఐ కాశవేని సంజీవ్‌కుమార్ తెలిపారు. కాగా పంచాయతీ పెట్టి యువతి మృతికి కారణమైన వారందరిపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగానికి క్వాలిఫై అయి..
కాగా ఉమారాణి అక్లోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ మెయిన్స్‌కు ఎంపికైంది. ఉద్యోగ ఎంపిక పరీక్షలో 86 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్‌ల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉమారాణి అందరితో కలివిడిగా ఉండేది. ఉమారాణి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులతో పాటు గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. యువతి ఆకస్మికంగా మరణించడంతో పెంబి గ్రామానికి చెందిన నాయకులు పుప్పాల శంకర్, కున్సోత్ రమేశ్ తదితర నాయకులు ఆస్పత్రికి చేరుకొని కుటుంబీకులను పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం గ్రామానికి చేరుకుంది.