మళ్లీ రాజైస్తాన్...
అనామకులను మరోసారి అందలం ఎక్కిస్తూ... ఫామ్‌లో లేని వారిపైనా అత్యధిక ధర వెచ్చిస్తూ... అంచనాలకు అందదని... ఊహలకు చిక్కదని మరోసారి నిరూపించింది ఐపీఎల్ వేలం. టి20 దిగ్గజమనదగ్గ బ్రెండన్ మెకల్లమ్‌కు మొండిచేయి చూపిస్తూ... మెరుపు వీరుడు యువరాజ్ సింగ్‌ను చివరి వరకు ఊరిస్తూ... మలింగకు మళ్లీ ఆటగాడిగా అవకాశమిస్తూ... విదేశీ కొత్త కెరటాలకు చోటిస్తూ... ఎవరో ఒకరు కొనకపోతారా అని ఏమూలనో ఉన్న పుజారా ఆశలను నీరుగారుస్తూ... అనూహ్య పరిణామాలకు వేదికగా నిలిచింది. 351 ఆటగాళ్లు వేలానికి రాగా... 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
జైపూర్: గతేడాది ఆసాంతం ఆడించినా, చెప్పుకోదగ్గ ప్రదర్శన కనీసం ఒక్కటీ లేకున్నా సౌరాష్ట్ర పేసర్ జైదేవ్ ఉనాద్కట్‌పై రాజస్తాన్ రాయల్స్ మళ్లీ కోట్ల రూపాయల వర్షం కురిపించింది. 2018 జనవరిలో జరిగిన ప్రధాన వేలంలో భారత ఆటగాళ్లందరిలో అత్యధిక ధర (రూ.11.5 కోట్లు)కు ఉనాద్కట్‌ను కొనుగోలు చేసిన రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ... మంగళవారం ఇక్కడ నిర్వహించిన మినీ వేలంలో మరోసారి అతడిపై రూ.8.4 కోట్లు వెచ్చించింది. తన ప్రాథమిక ధర రూ.కోటిన్నరగా పేర్కొంటూ జైదేవ్ వేలానికి రావడం గమనార్హం. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో పాటు విజయ్ హజారే ట్రోఫీతో గుర్తింపు తెచ్చుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (ప్రాథమిక ధర రూ. 20 లక్షలు) సైతం అనూహ్యంగా రూ.8.4 కోట్లు పలకడం విశేషం. ఇతడి కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఇక టీమిండియా ప్రపంచ కప్‌ల హీరో యువరాజ్ సింగ్‌ను రెండో రౌండ్లో ఎట్టకేలకు అతడి ప్రాథమిక ధర రూ.కోటికే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఓటమికి ప్రధాన కారణమైన ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌ను రూ.7.2 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా సభ్యులైన విహారిని రూ.2 కోట్లకు, ఇషాంత్‌ను రూ.1.1 కోట్లకు ఢిల్లీ, షమీని రూ.4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేశాయి. ఆంధ్ర క్రికెటర్లు బండారు అయ్యప్పను రూ. 20 లక్షలకు ఢిల్లీ... ఎర్రా పృథ్వీ రాజ్‌ను కోల్‌కతా కొన్నాయి.
కుర్రాళ్లే... కోటీశ్వరులు
ప్రస్తుత వేలంలో కొందరు యువ ఆటగాళ్ల పంట పండింది. రూ.లక్షల్లోని ప్రాథమిక ధరలో ఉన్న వారిని ఫ్రాంచైజీలు రూ.కోట్లకు సొంతం చేసుకున్నాయి. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది 17 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్‌సింగ్ గురించి. ఒక్క టి20 కూడా ఆడని ఇతడిని పంజాబ్ రూ.4.8 కోట్లకు కొనుక్కుంది. ఇటీవలి అండర్–19 ఆసియా కప్ ఫైనల్లో 37 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు ప్రభ్‌సిమ్రన్. 16 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ప్రయాస్ రే బర్మన్ను బెంగళూరు రూ.కోటిన్నరకు తీసుకుంది.
వీరిని కొనేవారే లేరు...
పుజారా, మనోజ్ తివారీ (భారత్), బ్రెండన్ మెకల్లమ్, హేల్స్, వోక్స్ (ఇంగ్లండ్), ఆమ్లా, స్టెయిన్, మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), కోరె అండర్సన్ (న్యూజిలాండ్), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్).
మలింగ మళ్లీ ఆటగాడిగా...
శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ రానున్న సీజన్లో మళ్లీ ముంబై ఇండియన్స్‌కు బౌలర్‌గా సేవలందించనున్నాడు. గతేడాది అతడు మెంటార్‌గా పనిచేయడం గమనార్హం. ఈసారి మలింగను ముంబై రూ.2 కోట్లకు పాడుకుంది.
అలా బాది... ఇలా వచ్చాడు...
ముంబై బ్యాట్స్‌మన్ శివమ్ దూబే సోమవారం బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది అందరి దృష్టి ఆకర్షించాడు. సరిగ్గా వేలానికి ముందు ఈ ప్రదర్శన అతడిపై కోట్లు కురిపించింది. వేలంలో శివమ్‌ను బెంగళూరు రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఎవరీ చక్రవర్తి
తమిళనాడుకు చెందిన ఓ అన్క్యాప్డ్ క్రికెటర్ వేలంలోనే ప్రధాన ఆకర్షణయ్యాడు. ఐదు ఫ్రాంచైజీలు అతని కోసం ఎగబడ్డాయి. కానీ చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సొంతమయ్యాడు. ఎంతంటే రూ. 8.40 కోట్లకు! అమ్మో అంత మొత్తామా! ఎవరతను? ఏంటీ అతని స్పెషాలిటీ?
వరుణ్ చక్రవర్తి... తమిళ ఆల్‌రౌండర్. కానీ జాతీయ జట్టుకైతే ఇంతవరకు ఆడలేదు. అంతెందుకు రంజీ మ్యాచ్ కూడా అడింది ఒక్కటే. అదీ ఈ ఏడాదే. నిజానికి బాల్యం నుంచే అతనేమీ క్రికెట్ పిచ్చోడు కాదు. చాలా ఆలస్యంగా తన 13వ ఏట ఆటకు పరిచయమయ్యాడు. 17 ఏళ్ల వయసు వరకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. కానీ ఆయా వయో విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో ఆటకు బైబై చెప్పి ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో ఐదేళ్ల డిగ్రీ పూర్తిచేశాడు. కొన్నాళ్లు ఆర్కిటెక్చర్‌గా పనిచేశాడు. అప్పుడప్పుడు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండటం వల్ల మళ్లీ ఆటపై మనసు పెట్టాడు. అంతే ఈసారి వరుణ్ జాబ్‌కు టాటా చెప్పి ఆటకు సై అన్నాడు. క్రోమ్‌బెస్ట్ క్రికెట్ క్లబ్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ మోకాలి గాయంతో పేస్‌ను వదిలేసి స్పిన్నరయ్యాడు. జూబ్లీ క్రికెట్ క్లబ్ తరఫున చెన్నైలో ఫోర్త్ డివిజన్ లీగ్ క్రికెట్ ఆడాడు. గత 2017–18 సీజన్లో ఆ క్లబ్ జట్టు తరఫున ఏడు వన్డేలాడిన వరుణ్ 3.06 ఎకానమీతో 31 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించే చక్రవర్తి ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)తో అందరికంటా పడ్డాడు. రెండేళ్లుగా ఒక్క మ్యాచ్ గెలవని సీచెమ్ మధురై పాంథర్స్‌ను ఈ ఏడాది విజేతగా నిలపడంతో అతని ప్రతిభ బయటపడింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఛాన్స్ కొట్టేశాడు. అక్కడ 9 మ్యాచ్‌లాడి లీగ్ దశలో అత్యధిక వికెట్లు (22) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్–11 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్‌లో బౌలింగ్ వేసేవాడు. స్థానిక వివాదం కారణంగా సీఎస్కే పుణే వేదికకు మారడంతో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా... మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, జట్టు విశ్లేషకుడు శ్రీకాంత్‌ల పిలుపుమేరకు ఆ జట్టు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌లోనూ పాల్గొన్నాడు. కానీ ఏమైందో వాళ్లు రిలీజ్ చేయడంతో వేలానికి వచ్చాడు. ఈ లక్కీ క్రికెటర్ రూ. 20 లక్షల ప్రాథమిక ధర నుంచి ఏకంగా కోట్లు కొల్లగొట్టాడు. ‘రూ. 20 లక్షలకు ఎవరో ఒకరు కొంటారనే నమ్మకం ఉంది. కానీ 40 రెట్లు పలుకుతానని అస్సలు ఊహించలేదు’ అని ఉబ్బితబ్బిబ్బయ్యాడు వరుణ్.
ఏ జట్టులో ఎవరంటే...
చెన్నై సూపర్ కింగ్స్: మోహిత్ శర్మ (రూ.5 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.20 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్: ఇంగ్రామ్ (రూ.6.40 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు), విహారి (రూ.2 కోట్లు), రూథర్‌ఫర్డ్ (రూ.2 కోట్లు), ఇషాంత్ (రూ.1.10 కోట్లు), కీమో పాల్ (రూ.50 లక్షలు), జలజ్ సక్సేనా, అంకుష్ బైన్స్, నాథు సింగ్, బండారు అయ్యప్ప (రూ.20 లక్షల చొప్పున).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: వరుణ్ చక్రవర్తి (రూ.8.40 కోట్లు), స్యామ్ కరన్ (రూ.7.20 కోట్లు), షమీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రూ.4.80 కోట్లు చొప్పున), నికొలస్ పూరన్ (రూ.4.20 కోట్లు), మోజెస్ హెన్రిక్స్ (రూ.కోటి), హర్డస్ విల్జియొన్ (రూ.75 లక్షలు), దర్షన్ నల్కండే (రూ.30 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.25 లక్షలు), అర్షదీప్ సింగ్, అగ్నివేశ్, హర్‌ప్రీత్ బ్రార్, మురుగన్ అశ్విన్ (రూ.20 లక్షల చొప్పున).
కోల్‌కతా నైట్ రైడర్స్: కార్లొస్ బ్రాత్‌వైట్ (రూ.5 కోట్లు), లోకి ఫెర్గూసన్ (రూ.1.60 కోట్లు), జో డెన్లీ (రూ.కోటి), హారీ గుర్నీ (రూ.75 లక్షలు), నిఖిల్ శంకర్ నాయక్, శ్రీకాంత్ ముండే, యర్రా పృథ్వీరాజ్, అన్రిచ్ నొర్జె (రూ.20 లక్షల చొప్పున).
ముంబై ఇండియన్స్: బరీందర్ శరణ్ (రూ.3.40 కోట్లు), లసిత్ మలింగ (రూ.2 కోట్లు), యువరాజ్ సింగ్ (రూ.1 కోటి), అన్మోల్ప్రీత్ సింగ్ (రూ.80 లక్షలు), పంకజ్ జస్వాల్, రసిక్ దార్ (రూ. 20 లక్షల చొప్పున).
రాజస్తాన్ రాయల్స్: జైదేవ్ ఉనాద్కట్ (రూ.8.40 కోట్లు), వరుణ్ అరోన్ (రూ.2.40 కోట్లు), ఒషేన్ థామస్ (రూ.1.10 కోట్లు), టర్నర్, లివింగ్స్టన్ (రూ.50 లక్షలు చొప్పున), శశాంక్ (రూ.30 లక్షలు), రియాన్ పరాగ్, మనన్ వోహ్రా, శుబ్‌మన్ రన్జానే (రూ. 20 లక్షల చొప్పున).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: శివమ్ దూబే (రూ.5 కోట్లు), హెట్‌మైర్ (రూ.4.20 కోట్లు), అక్షదీప్‌నాథ్ (రూ.3.60 కోట్లు), ప్రయాస్ రే బర్మన్ (రూ.1.50 కోట్లు), హిమ్మత్ సింగ్ (రూ.65 లక్షలు), గురుకీరత్ సింగ్ మాన్ (రూ.50 లక్షలు), క్లాసెన్ (రూ.50 లక్షలు), దేవ్‌దత్, మిలింద్ కుమార్ (రూ. 20 లక్షల చొప్పున).
సన్‌రైజర్స్ హైదరాబాద్: జానీ బెయిర్‌స్టో (రూ.2.20 కోట్లు), వృద్ధిమాన్ సాహా (రూ.1.20 కోట్లు), మార్టిన్ గప్టిల్ (రూ. కోటి).
- సాక్షి క్రీడా విభాగం