
ఉప్పల్ లో ఉనద్కత్ హ్యాట్రిక్
హైదరాబాద్: సన్ రైజర్స్ తో ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రైజింగ్ పుణే పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ హ్యాట్రిక్ దాటికి సన్ రైజర్స్ సొంత మైదానంలో పరాజయం పొందింది. ఈ మ్యాచ్ లో ఉనద్కత్ 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో రైజింగ్ పుణే 12 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై విజయం సాధించింది. ఇక చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు కావల్సి ఉండగా ఉనద్కత్ చక్కటి బంతులతో ముగ్గురు హైదరాబాద్ బ్యాట్స్ మెన్ లు పెవిలియన్ దారి పట్టించాడు.
బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లు వరుసగా అవుట్ కావడంతో ఈ సీజన్ లో హ్యాట్రిక్ వికెట్ తీసిన మూడో బౌలర్ గా ఉనద్కత్ రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు శ్యామ్యుల్ బద్రీ ముంబై ఇండియన్స్ పై , ఆండ్రూ టై రైజింగ్ పుణే లపై ఈ సీజన్ లో ఒకే రోజు హ్యాట్రిక్ సాధించారు. ఒకే ఇలా ముగ్గురు బౌలర్లు హ్యాట్రిక్ సాధించడం ఐపీఎల్ చరిత్రలో రెండో సారి. తొలి సీజన్ లో ఎన్తిని, లక్ష్మీపతి బాలజీ, అమిత్ మిశ్రాలు సాధించగా, మళ్లీ పదో సీజన్ లో ముగ్గురు బౌలర్లు సాధించడం విశేషం.