మెన్స్ హండ్రెడ్ లీగ్ 2024లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో (22 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్సర్లు) పాటు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన (20-11-16-5) నమోదు చేశాడు. సామ్ కర్రన్ వీర లెవెల్లో విజృంభించడంతో ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హండ్రెడ్ లీగ్‌లో సామ్ కర్రన్ నమోదు చేసిన హ్యాట్రిక్ మూడవది. సామ్‌కు ముందు టైమాల్ మిల్స్, ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కర్రన్‌తో పాటు డేవిడ్ మలాన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. విల్ జాక్స్ (2), జోర్డన్ కాక్స్ (14), డొనోవన్ ఫెరియెరా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యాడు. లండన్ బౌలర్లు ఓలీ స్టోన్, లియామ్ డాసన్, నాథన్ ఇల్లిస్, క్రిచ్లీ తలో వికెట్ పడగొట్టారు.
148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ స్పిరిట్.. 95 బంతుల్లో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. ఆడమ్ జంపా 3, విల్ జాక్స్, నాథన్ సౌటర్ తలో వికెట్ పడగొట్టారు. లండన్ ఇన్నింగ్స్‌లో కైల్ పెప్పర్ (20), డానియల్ లారెన్స్ (27), హెట్‌మైర్ (20) మాత్రమే 20 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశారు.
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై నార్త్ర్నన్ సూపర్ ఛార్జర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఒరిజినల్స్ 100 బంతుల్లో 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హర్స్ట్ (78) ఒరిజినల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment