
హ్యారీ బ్రూక్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు మొయిన్ అలీ (Moeen Ali) సమర్థించాడు. రెండేళ్ల పాటు ఈ ఇంగ్లండ్ యువ బ్యాటర్‌పై నిషేధం విధించడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అకస్మాత్తుగా ‘తప్పుకోవాలనే’ నిర్ణయం తీసుకోవడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ
కాగా ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతడు రాబోయే రెండు సీజన్ల పాటు ఐపీఎల్‌లో పాల్గొనకుండా ఈ నిషేధం అమలుకానుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికైన బ్రూక్.. మార్చి 22 నుంచి జరిగే ఐపీఎల్ 18వ సీజన్ (IPL 2025)లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది.
ఐపీఎల్‌లో ఈ ఏడాది సవరించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో తన పేరు నమోదు చేసుకొని అమ్ముడైన తర్వాత సీజన్‌కు అందబాటులో ఉండాల్సిందే. గాయం తప్ప ఇతరత్రా కారణాలను సాకులుగా చెబితే కుదరదు.
నిబంధన ప్రకారమే
ఇలా సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్న ఆటగాళ్లను రెండు సీజన్ల పాటు వేలంలో.. అలాగే లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. ఈ మేరకు ఐపీఎల్ నియమావళిలో నిబంధనలు పొందుపరిచారు. తాజా నిబంధన ప్రకారమే హ్యారీ బ్రూక్‌పై చర్యలు తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా 2025, 2026 సీజన్లలో బ్రూక్ పాల్గొనేందుకు వీలుండదు. ఈ మేరకు సదరు క్రికెటర్‌తో పాటు, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు సమాచారం ఇచ్చారు. నిజానికి బ్రూక్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు.
నానమ్మ మృతి కారణం చూపుతూ
గతేడాది కూడా తన నానమ్మ మృతి కారణం చూపుతూ ఏకంగా లీగ్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ క్రికెట్‌కే తన ప్రాధాన్యత అని స్వదేశంతో భారత్ (జూన్‌లో)తో జరిగే సిరీస్‌కు ముందు పూర్తిస్థాయి ఉత్తేజంతో అందుబాటులో ఉండేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తా
ఈ పరిణామాల నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ కఠిన నిర్ణయం కాదు. బీసీసీఐ ఎందుకు ఇలా వ్యవహరించిందో నేను అర్థం చేసుకోగలను. బ్రూక్ ఒక్కడే కాదు.. చాలా మంది గతంలో ఇలాగే చేశారు.
తమకు నచ్చినపుడు తిరిగి వచ్చి ఆర్థికంగా లబ్ది పొందారు. అయితే, వారికి ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఆటగాళ్లను కొన్న ఫ్రాంఛైజీలకు నష్టం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక్క ఆటగాడి వల్ల జట్టు కూర్పు, వ్యూహాలు, ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అకస్మాత్ మార్పుల వల్ల అంతా గందరగోళమైపోతుంది. హ్యారీ బ్రూక్‌ను కొనుక్కున్న జట్టు అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేయాలనే చూస్తుంది. కానీ అది సాధ్యం కావచ్చు.. కాకపోవచ్చు. కాబట్టి వారు తమ ప్రణాళికలను అందుకు తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది.
ఆదిల్ రషీద్ సైతం
గాయం వల్ల సీజన్ నుంచి తప్పుకొంటే ఎవరూ తప్పుబట్టరు. బోర్డు కూడా ఇందుకు మినహాయింపు ఇస్తుంది. కానీ ఇలా వేరే కారణాలు చూపుతూ అర్ధంతరంగా తప్పుకోవడం ఏమాత్రం సరికాదు’’ అని మొయిన్ అలీ బ్రూక్ తీరును విమర్శించాడు.
ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ కూడా మొయిన్ అలీ తరహాలోనే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో మొయిన్ అలీని కోల్‌కతా రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
Comments
Please login to add a commentAdd a comment