వేధింపులు తాళలేకే జ్యోతి ఆత్మహత్య
ఏలూరు (వన్‌టౌన్) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పవర్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం పట్టాల వద్ద పడి ఉన్న యువతి మృతదేహం వివరాలను పోలీసులు గుర్తించారు. పత్రికలలో ప్రచురితమైన కుమార్తె ఫొటోను చూసి గుర్తుపట్టిన తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలిలా ఉన్నాయి. ఏలూరు పన్నెండు పంపుల సెంటర్‌కు చెందిన కుమరపు అప్పారావు, లక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె జ్యోతి. అప్పారావు స్థానిక టింబర్ డిపోలో పనిచేస్తుండగా, లక్ష్మీ ఇళ్లలో పనిచేస్తుంటుంది. కొడుకు హరిక్రిష్ణ ఎనిమిదేళ్ల వయసులో నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు.
కోర్టులో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న టేకి వెంకటేశ్వరరావుతో ఈ ఏడాది మే 15న జ్యోతికి (18) వివాహమైంది. పెళ్ళి సమయంలో రూ. రెండు లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారం, పెళ్లికొడుకుకు రూ.యాభైవేల బంగారం, యాభై వేలు ఆడపడుచు కట్నం, మరో యాభైవేల విలువచేసే సారె ఇచ్చారు. అత్తింటికి వెళ్లిన నాటి నుంచి అత్త, మామ, ఆడపడుచు తరచూ వేధించేవారు. వారికున్న కిరాణా షాపులో జ్యోతి చేదోడు వాదోడుగా ఉంటున్నా దుకాణానికి వచ్చే వారితో సంబంధం అట్టి హింసించేవారు. పక్కనే ఉన్న ఒక బేకరీలో పనిచేసే మరో యువతితో జ్యోతి తన వేదనను వెళ్లబోసుకునేది. ఈ విషయం తెలిసి జ్యోతిని అత్త,మామలు, ఆడపడుచు, భర్త తిట్టిపోసి బయటికి నెట్టివేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.