Under Water City
-
సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం!
ఇప్పటి వరకు మనకు జలాంతర్గాముల గురించి తెలుసు. ఇకపై జలాంతర నగరాలు కూడా సముద్ర గర్భంలో వెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌లోని రియో డి జనీరో తీరానికి ఆవల సముద్ర గర్భంలో తొలి జలాంతర నగరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బెల్జియన్ డిజైనర్, ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలెబాట్ ఈ జలాంతర నగరానికి రూపకల్పన చేశారు. ఇరవైవేల మందికి నివాసం కల్పించేలా వెయ్యి టవర్లతో ‘ఆక్వారియా’ పేరిట ఈ జలాంతర నగరాన్ని నిర్మించనున్నారు. సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు వరకు విస్తరించేలా ఈ జలాంతర నగర నిర్మాణాన్ని తలపెట్టారు. సముద్ర జలాల్లో కలిసిపోయి, కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం వ్యర్థాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అంటార్కిటికా వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్రపు నాచు వంటి పదార్థాలతో ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు చెబుతున్నారు. -
అండర్ వాటర్ సిటీ
జనాభా పెరిగిపోతోంది.. ఇంకొన్నేళ్లలో నేలపై మనిషి మనుగడ కష్టమే. మరి మార్గోపాయమేమిటి? సముద్రమే అంటోంది సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్. వందేళ్ల తరువాత భూమిపై మానవ మనుగడ ఎలా ఉంటుందన్న అంశంపై శాంసంగ్ కొన్ని అంచనాలను సిద్ధం చేసింది. దీని ప్రకారం... పెరిగిపోతున్న జనాభాకు తగిన ఆవాసాన్ని కల్పించేందుకు సముద్రాలే మేలు. ఫొటోలో చూపినట్లు భారీ సైజు బుడగల్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్లు, కార్యాలయాలు ఏర్పాటవుతాయి. అవసరాన్నిబట్టి ఇంట్లోని గదుల సైజులు మారిపోతాయి. ఎవరైనా అతిథులు వస్తే లివింగ్ రూమ్ కాస్తా బెడ్రూమ్గా మారిపోతుందన్నమాట. చుట్టూ ఉండే సముద్రపు నీటిని ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొడతారు. హైడ్రోజన్ ఇంధనంగా పనికొస్తే.. ఆక్సిజన్ మనిషి ఊపిరిపీల్చుకునేందుకు ఉపయోగిస్తారు. సముద్రపు అలల ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని వాడుకుంటారు. నేల అవసరం లేని వ్యవసాయం (హైడ్రోపోనిక్స్) ద్వారా ఎవరికి వారు ఇంటి పంటలు పండించుకుంటారు.