
ఇప్పటి వరకు మనకు జలాంతర్గాముల గురించి తెలుసు. ఇకపై జలాంతర నగరాలు కూడా సముద్ర గర్భంలో వెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌లోని రియో డి జనీరో తీరానికి ఆవల సముద్ర గర్భంలో తొలి జలాంతర నగరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బెల్జియన్ డిజైనర్, ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలెబాట్ ఈ జలాంతర నగరానికి రూపకల్పన చేశారు.
ఇరవైవేల మందికి నివాసం కల్పించేలా వెయ్యి టవర్లతో ‘ఆక్వారియా’ పేరిట ఈ జలాంతర నగరాన్ని నిర్మించనున్నారు. సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు వరకు విస్తరించేలా ఈ జలాంతర నగర నిర్మాణాన్ని తలపెట్టారు. సముద్ర జలాల్లో కలిసిపోయి, కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం వ్యర్థాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టారు.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అంటార్కిటికా వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్రపు నాచు వంటి పదార్థాలతో ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు చెబుతున్నారు.