సాక్షి, అమరావతి: తెలంగాణ సర్కారు శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో అక్రమంగా నిరంతరాయ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఆదివారం మరో టీఎంసీ నీరు సముద్రంలో కలిసింది. గత వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 6.944 టీఎంసీలు వృథాగా కడలి పాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే.. ఈ నీటితో రాష్ట్రంలో 45 వేలు, తెలంగాణలో 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉండేదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ దందుడుకు వైఖరి వల్ల రెండు రాష్ట్రాలకూ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం ఆదివారం పూర్తిగా నిలిచిపోయింది. నీటిమట్టం 809.65 అడుగులకు తగ్గిపోయింది.
అయినా తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 7,063 క్యూసెక్కులను తోడేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 34.04 టీఎంసీలకు పడిపోయింది. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్‌లో నీటి మట్టం 529.30 అడుగులకు పడిపోగా నీటి నిల్వ 177.76 టీఎంసీలకు తగ్గిపోయింది. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని ఆ రాష్ట్ర ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది.
కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా సరే.. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని నిర్విరామంగా కొనసాగిస్తోంది. పులిచింతల నుంచి వదిలేస్తున్న 5,600 క్యూసెక్కులకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల 73,50 క్యూసెక్కులు వెరసి 12,950 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే కావడంతో మిగులుగా ఉన్న 11,479 క్యూసెక్కులను 20 గేట్లను అర్ధ అడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment