విజన్ 2047కు ప్రణాళికలు సిద్ధం చేయండి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం.జానకి
నెల్లూరు సిటీ : విజన్ 2047లో భాగంగా నెల్లూరు నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం. జానకి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో గురువారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణాలచెరువు, సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హడ్కో రుణంతో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్వాతంత్రం వచ్చి 2047కి 100 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా నెల్లూరును అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచిం చారు. ఈ సమీక్ష జరుగుతున్న మందిరంలోకి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో జన ఆర్గనైజేషన్ సభ్యులు స్వాతిరామనాథన్, డీఎంఏ కన్నబాబు, కార్పొరేషన్ కమిషనర్ ఢిల్లీరావు, పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ మోహన్, డీటీసీ శివరామప్రసాద్, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట కమిషనర్లు శ్రీనివాసులు, నరేంద్ర, సూళ్లూరుపేట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.