భూగర్భ డ్రిప్‌తో తోటలు పదిలం!
► చెట్టుకు నీరు కాదు.. వేర్లకు నీటి తేమ ఇస్తే చాలంటున్న స్వచ్ఛంద సంస్థ – సి.ఇ.సి.
► స్వల్ప ఖర్చుతోనే పండ్ల తోటలు, కూరగాయ తోటలకు తీవ్ర కరువు, వడగాడ్పుల నుంచి రక్షణ
► సాధారణ డ్రిప్ ద్వారా ఖర్చయ్యే నీటిలో 75% నీటిని భూగర్భ డ్రిప్ ఆదా చేస్తుంది
► అనంతపురం జిల్లాలో నేల ఉష్ణోగ్రత.. నీటి ఆవిరి అత్యధికం: ఎఫ్.ఎ.ఒ.
► తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ భూగర్భ డ్రిప్‌తో పండ్ల తోటలను రక్షించుకుంటున్న రైతులు
వాతావరణ మార్పుల వల్ల భూతాపం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉంది. దీంతో, పండ్ల తోటలను కాపాడుకోవడం రైతులకు కనాకష్టమవుతున్నది. డ్రిప్ ద్వారా ఇచ్చే నీరు చెట్లు వేళ్ల దగ్గరకు చేరకుండానే ఆవిరైపోతున్నది. చెట్లకు పైపుల ద్వారా వారం పది రోజులకోసారి, ట్యాంకర్ల ద్వారా 20 రోజులకోసారి నీరిచ్చినా.. 2–3 రోజుల్లోనే తేమ ఆరిపోతున్నది. వరుసగా ఆరోసారి కరువు ప్రాంతంగా ప్రకటితమైన అనంతపురం, ప్రకాశం తదితర తీవ్ర కరువు పీడిత ప్రాంతాల్లో ముదురు మామిడి తోటలు సైతం నిలువునా ఎండిపోతుండడంతో రైతులు తిరిగి కోలుకోలేనంతగా నష్టపోతున్నారు.
పాతికేళ్ల తోటలే ఎండిపోతున్నాయి..
ఎడతెగని కరువుతో ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లెలో రైతుల మామిడి మానులే ఎండిపోతున్నాయి. తిప్పారెడ్డి అనే రైతు ఏడెకరాల మామిడి తోట నిలువునా ఎండిపోయింది. 26–30 ఏళ్ల నాటి తోట ఆయనది. నాలుగు బోర్లు వేయగా, గతంలోనే 3 బోర్లు ఎండిపోయాయి. తిప్పారెడ్డి గత ఏడాది సుమారు రూ. లక్షన్నర ఖర్చుతో ట్యాంకర్లతో నీటిని తెచ్చి పోసి తోటను బతికించుకున్నాడు. ఇప్పుడు నాలుగో బోరు కూడా ఎండిపోయింది. చేతిలో డబ్బు లేక ఈ ఏడాది ట్యాంకర్లతో నీటిని తెచ్చి పోయలేకపోయాడు తిప్పారెడ్డి. తోట నిలువునా ఎండిపోయింది. కోటి ఆశలతో పెంచుకున్న తోట మంచి కాపు ఇచ్చే వయసులో నిలువునా ఎండిపోతే.. చూడడానికి మనస్కరించక తిప్పారెడ్డి తన ఎండిపోయిన తోట దగ్గరకు కూడా రాలేని దైన్య స్థితి నెలకొంది. ఎందరో మామిడి, బత్తాయి తోటల రైతుల పరిస్థితి ఇదే మాదిరిగా అగమ్యగోచరంగా మారింది.
ఈ విపత్తును ఎదుర్కొనే మార్గమే లేదా?
ఉంది.. డ్రిప్‌తో నీటిని నేలపైన కాదు, వేళ్ల దగ్గర ఇవ్వటమే పరిష్కారం!
మట్టిలో అడుగు లోతున వేర్లకు నీటి తేమను అందిస్తే తోటలను నిక్షేపంగా కాపాడుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ (సి.ఇ.సి.) అనే స్వచ్ఛంద సంస్థ నిరూపిస్తోంది. డ్రిప్‌కు ఖర్చయ్యే నీటిలో పావు వంతు నీటితో, చెట్టుకు రూ. 50 ఖర్చుతోనే ఈ ‘భూగర్భ డ్రిప్’ను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతోంది. అనంతపురం, ప్రకాశం, రంగారెడ్డి, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో కొందరు రైతులు ఈ పద్ధతిలో పండ్ల తోటలను రక్షించుకుంటూ పచ్చగా ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఈ ఎండాకాలం తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో బోర్లు చాలా వరకు ఎండిపోయాయి. రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చి పండ్ల తోటలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారి ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట ప్రాంతాల్లో తోటల యాజమాన్యం రైతులకు ఏటేటా సమస్యాత్మకంగా మారుతోంది.
అనంతపురం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదైనప్పుడు మట్టి ఉష్ణోగ్రత (సాయిల్ టెంపరేచర్) అత్యధికంగా 66–67 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటున్నది. ఏప్రిల్/మే నెలల్లో రోజుకు 20–25 మిల్లీమీటర్ల నీరు అత్యధికంగా ఆవిరైపోతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది.పండ్ల తోటలన్నిటికీ డ్రిప్ ఉంది. అయితే, బోర్లు చాలా చోట్ల ఎండిపోయాయి లేదా బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. డ్రిప్ ద్వారా చెట్ల దగ్గర భూమి పైన పడిన నీటిలో చెట్ల వేళ్లకు అందుతున్నది చాలా తక్కువ. కొందరు రైతులు పైపులతో వారం లేదా 10 రోజులకు ఒకసారి ప్రతి చెట్టుకు 200–250 లీటర్ల నీరు ఇస్తున్నారు.
ఆర్థిక స్థోమత ఉన్న కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చి మామిడి చెట్లను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌ను రూ. 600 ఖర్చుతో తెచ్చి 8 చెట్లకు పోస్తున్నారు. ట్యాంకరు ఖర్చులో 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. 20 రోజులకోసారి ట్యాంకరు నీటిని పోస్తున్నారు. ఎక్కువ నీరు ఒకేసారి పోయడం వల్ల వేళ్లకు తెగుళ్లు కూడా వస్తున్నాయి. తోటలకు పైన చెప్పుకున్న ఏ పద్ధతిలో నీరిస్తున్నప్పటికీ.. అధిక పగటి ఉషోగ్రత, అధిక నేల ఉష్ణోగ్రత కారణంగా 3–4 రోజుల్లోనే నేలలో తేమ పూర్తిగా ఆరిపోతున్నది. ఈ సమస్యకు సులువైన, సమర్థవంతమైన పరిష్కారం భూగర్భ డ్రిప్. స్వల్ప ఖర్చుతో రైతులు ఏర్పాటు చేసుకోగలిగినది కావడం దీని మరో ప్రత్యేకత.
చెట్టుకు రూ. 50 ఖర్చుతోనే..
భూగర్భ డ్రిప్ మట్టిలో తేమను మాయిశ్చర్ మీటర్ ద్వారా తెలుసుకుంటూ అవసరం మేరకు నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. నీటిని ఇచ్చినప్పుడు మట్టిలో తేమ 99 శాతం ఉంటుంది. ఈ తేమ ఎంత త్వరగా ఆరిపోతుందో నేల స్వభావం, భూమిలో సేంద్రియ పదార్థంపై ఆధారపడి ఉంటుంది. మట్టిలో నీటి తేమ 40–60 శాతానికి తగ్గినప్పుడు.. భూగర్భ డ్రిప్ ద్వారా మళ్లీ నీటిని తగుమాత్రంగా అందిస్తే సరిపోతుంది. పెద్ద చెట్టుకు మహా అయితే 50 రూపాయల ఖర్చుతో, అతి తక్కువ నీటితో కరువును తట్టుకునే చక్కని భూగర్భ డ్రిప్‌ను ఏర్పాటు చేసుకోవచ్చంటే ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.
కరువు ప్రాంతాల్లో తోటలను తక్కువ నీటితోనే రక్షించుకోవడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని రైతుల అనుభవాలు చెబుతున్నాయి. అనంతపురం, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాలతోపాటు.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, ద్రాక్ష తోటలు, కూరగాయ తోటల రైతులు భూగర్భ డ్రిప్ పద్ధతిని అనుసరిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారని గోపాల్ తెలిపారు. నీరు నేల మీద కాదు.. నీటి తేమను పీచు వేళ్ల దగ్గర నేల లోపల ఇవ్వాలన్నది సమర్థవంతంగా సాగు నీటి వినియోగానికి దోహదపడే విప్లవాత్మక ఆలోచన. డ్రిప్‌తో పోల్చితే 25% నీటితోనే మండే ఎండల్లోనైనా తోటలను బతికించుకోడానికి భూగర్భ డ్రిప్ ఉపకరించడం హర్షదాయకం.
‘భూగర్భ డ్రిప్ ’ పనిచేసేదెలా?
నీటి కరువు సమస్యకు సి.ఇ.సి. సూచిస్తున్న చక్కని పరిష్కారం ఏమిటంటే.. భూగర్భ డ్రిప్ పద్ధతి. సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్(స్వర్) అని దీన్ని పిలుస్తున్నారు. మొక్క లేదా చెట్టు వేర్లకు అవసరానికి తగినంత నీటి తేమను అందించడం ద్వారా అతి తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని సాగు చేయగలగడమే ‘స్వర్’ ప్రత్యేకత. సాధారణ డ్రిప్ లైనుకు అదనంగా అగ్గిపెట్టె అంతటి పరికరాన్ని (బరీడ్ మోయిశ్చర్ డిఫ్యూజర్–బి.ఎం.డి.) జత చేసి, దాన్ని మట్టిలో పెట్టి కప్పేయాలి. చెట్టు ఎంత పెద్దదైనా నీటి తేమను, పోషకాలను గ్రహించేది పీచు వేళ్లు (యాక్టివ్ రూట్స్) మాత్రమే. చెట్టు దగ్గర్లో అడుగు లోతున మట్టి తవ్వి ఈ పరికరాన్ని పెట్టి మట్టి కప్పేయాలి. ఈ భూగర్భ డ్రిప్ పరికరం ఖరీదు మహా అయితే 12.50 రూపాయలు. పెద్ద చెట్టు చుట్టూతా 4 లేదా 5 పెడితే సరిపోతుంది. సాధారణ డ్రిప్ ద్వారా ఇచ్చే నీటిలో 25% నీటితోనే ఈ పద్ధతిలో నిరంతరాయంగా, తగుమాత్రంగా నీటి తేమను నేరుగా వేళ్లకు అందిస్తూ చెట్లను సునాయాసంగా బతికించుకోవచ్చు. పచ్చని చిగుళ్లు వేసేలా చక్కగా చూసుకోవచ్చు.
ఎంత పెద్ద చెట్లనైనా బతికించుకోవచ్చు!
సాగు నీటి గురించి మన ఆలోచన మారాలి. ‘నేల పైన’ ఎంత ఎక్కువ మోతాదులో నీరు ఇచ్చామని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. మేం చెబుతున్నదేమిటంటే.. చెట్టుకు నీరెంత ఎక్కువ ఇచ్చామని కాదు, ‘వేరుకు తేమ’ను ఎంత నిరంతరాయంగా ఇచ్చామని ఆలోచించాలి. 25–30 ఏళ్ల మామిడి చెట్టుకయినా సరే 12 నుంచి 28 అంగుళాల (సగటున అడుగున్నర) లోతులోనే నీటిని, పోషకాలను చురుగ్గా తీసుకునే వేళ్లు ఉంటాయి. పీచు వేర్లు ఉండే ప్రాంతంలో 12 అంగుళాల లోతులో భూగర్భంలో నీటి తేమను నిదానంగా అందించే పరికరాన్ని(బరీడ్ మోయిశ్చర్ డిఫ్యూజర్–బి.ఎం.డి.) ఏర్పాటు చేసి, దాన్ని డ్రిప్ లైన్‌తో అనుసంధానం చేస్తే చాలు. పీచు వేర్ల దగ్గరలో నీటి తేమను కొంచెం కొంచెంగా అందించడం ద్వారా మట్టిలో పోషకాలను వేర్లకు అందించే సూక్ష్మజీవరాశి చురుగ్గా పనిచేస్తుంది.
తద్వారా చెట్లకు మంచి పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి, ఎన్నో ఏళ్లుగా కొండంత ఆశతో పెంచుకుంటున్న చెట్లు దెబ్బతినకుండా బాగుంటాయి. గతంలో భూమిలో కుండను పాతిపెట్టి, అందులోకి డ్రిప్ ద్వారా నీటిని వదిలేవాళ్లం. ఇప్పుడు కుండకు బదులుగా బి.ఎం.డి. పరికరాన్ని వాడుతున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి తోటలు సాగు చేస్తున్న చిన్న రైతులతో కలిసి పనిచేస్తూ ఈ వినూత్న పద్ధతిని ఆవిష్కరించాం, ఇప్పటికీ మెరుగుపరుస్తూ ఉన్నాం. ఈ ఆవిష్కరణ మా సంస్థకు రెండు అంతర్జాతీయ అవార్డులు తెచ్చిపెట్టింది.
– కె. ఎస్. గోపాల్, డైరెక్టర్ (098481 27794), భూగర్భ డ్రిప్ పద్ధతి ఆవిష్కర్త, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సి.ఇ.సి.), హైదరాబాద్
నాలుగు రోజులైనా తేమ ఉంటున్నది..
కరువు వల్ల ఈ ఏడాది మా గ్రామంలో 20–25 ఏళ్ల మామిడి చెట్లు కూడా ఎండిపోయాయి. నా మామిడి తోటలో బోరుకు సోలార్ మోటారు పెట్టాను. ‘స్వర్’ భూగర్భ డ్రిప్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల తక్కువ నీటితోనే చెట్లను బతికించుకోగలుగుతున్నాం. నీరు ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత కూడా వేళ్ల దగ్గర తేమ ఉంటున్నది.
– ఎం. బాబూ ప్రసాద్ (85009 86024), బుచ్చయ్యగారిపల్లె, బుక్కపట్నం మం. అనంతపురం జిల్లా
మేలుగానే ఉంది..!
మూడెకరాల మామిడి తోటలో 225 మొక్కలున్నాయి. మొక్కలు నాటి రెండున్నరేళ్లు అయింది. బోరులో నీళ్లు ఆగి ఆగి వస్తున్నాయి. తోటలో 3 డ్రమ్ములు పెట్టాను. పైపులతో నీరు పెట్టేవాడిని. నెల క్రితం భూమి లోపల డ్రిప్పు పెట్టుకున్నాను. వారానికోసారి నీళ్లు వదులుతున్నాను. పైకి తేమ కనపడదు. దీని వల్ల తక్కువ నీటితోనే మా తోటకు మేలుగానే ఉంది. చెట్లు పచ్చగా ఇగుర్లు వచ్చాయి.
– ఎం. వెంకటనారాయణ (96186 46423), బుక్కపట్నం, అనంతపురం జిల్లా
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్