భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర! | To drought with underground drip! | Sakshi
Sakshi News home page

భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర!

Published Mon, Aug 7 2017 11:30 PM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర!

భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర!

కొత్త పోకడ
వాతావరణ మార్పుల నేపథ్యంలో బిందు సేద్యంలో కొత్తపోకడ.. భూగర్భ డ్రిప్‌కు ఆదరణ
తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటకు రక్షణ  
సాధారణ డ్రిప్‌తో కన్నా.. భూగర్భ డ్రిప్‌తో అదనపు ప్రయోజనాలు
ఉద్యాన తోటలతోపాటు మొక్కజొన్న, వరి, గోధుమ తదితర పంటలకూ భూగర్భ డ్రిప్‌ అనుకూలమే..
ఇజ్రాయెల్‌ సాంకేతికతతో భూగర్భ డ్రిప్‌తో వరిని సాగు చేస్తున్న కాలిఫోర్నియా రైతులు
వరి, గోధుమ సాగులో భూగర్భ డ్రిప్‌ వాడకంపై అధ్యయనానికి సిద్ధమవుతున్న పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

వర్షాకాలంలోనూ తిష్టవేస్తున్న కరువు రైతుల ఆశలను నిలువునా కాటేస్తున్నది. ప్రకృతిపై ఆధారపడి బతికే అన్నదాతల జీవనాధారాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నది. భూతాపం పెరుగుతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా కరువు రక్కసి విస్తరిస్తూ ఉంది. కరువు పీడిత ప్రాంతాల జాబితా ఏటేటా తామరతంపరవుతూ ఉంది.

మన దేశంలో 1960వ దశకంలో 5 రాష్ట్రాల్లో 66 జిల్లాలు కరువు కాటకాల పాలవ్వగా,  2010వ దశకంలో (2017 జూన్‌ నాటికి) 23 రాష్ట్రాల్లో 405 జిల్లాలకు కరువు రక్కసి విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో వ్యవసాయ కేంద్రాలైన కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను సైతం కరువు వణికిస్తోంది. ఈ పూర్వరంగంలో మరింత సమర్థవంతంగా నీటి వినియోగంపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి.

రసాయనిక ఎరువులతో సాగయ్యే ఏక పంటల కన్నా... ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే మిశ్రమ పంటలకు కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడం మన రైతులకూ అనుభవంలో ఉన్న సంగతే.

పంట మొక్కలు, పండ్ల చెట్ల మొదళ్ల దగ్గర్లో భూమిపైన డ్రిప్‌లు, స్ప్రింక్లర్లతోపాటు.. రెయిన్‌గన్‌లు ఏర్పాటు చేసుకొని కొందరు రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, తరచూ కరువు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత తక్కువ నీటితో పంటలు పండించ వీలయ్యే ‘భూగర్భ డ్రిప్‌’ పద్ధతి ముందుకు వస్తోంది. ఎడారిలోనూ సమర్థవంతంగా నీటి వినియోగంపై పరిశోధనలో ముందంజలో ఉన్న ఇజ్రాయెల్‌ భూగర్భ డ్రిప్‌ వాడకంలోనూ పైచేయి సాధించింది. ఏళ్ల తరబడి నిరవధికంగా సాగులో ఉండే ఉద్యాన తోటల్లో వినియోగించడం అమెరికాలోనూ అతికొద్ది మంది రైతుల అనుభవంలో ఉన్నదే.

కరువు సమస్య తరచూ ఎదురుకాటంతో డెల్టా ప్రాంతాల్లోనూ పంటలకు సాగు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో.. కొద్ది నెలల్లో కోతకొచ్చే మొక్కజొన్న, సోయా చిక్కుళ్లను ఇప్పటికే భూగర్భ డ్రిప్‌తో సాగు చేసి.. కరువును సమర్థవంతంగా తట్టుకోవడంతోపాటు దిగుబడులనూ గణనీయంగా పెంచుకోగలిగినట్లు సమాచారం.

భూగర్భ డ్రిప్‌ సంగతులు..
భూగర్భ డ్రిప్‌ అంటే.. పంట మొక్కలు, పండ్ల చెట్లకు నేలపైన కాకుండా.. వేర్ల దగ్గరలో నీటి తేమను అవసరం మేరకు తగుమాత్రంగా అందించే వ్యవస్థ. ముఖ్యంగా వరి సాగులో ఎకరానికి లక్షల లీటర్ల నీటిని ఆదా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది.
భూమి లోపల పంటను బట్టి 4 నుంచి 30 అంగుళాల లోతులో శాశ్వత డ్రిప్‌ను ఏర్పాటు చేస్తారు. నీటి తేమ వేర్లకు క్రమం తప్పకుండా అందుతుంది. మట్టిలో తేమ పరిస్థితిని సెన్సార్ల ద్వారా గమనిస్తూ.. పంటకు అవసరమైనప్పుడు తగుమాత్రంగా నీటిని అందిస్తారు.
ఏ రకం పంట వేర్లు ఎంత లోతుకు వెళ్తాయన్నదాన్ని బట్టి.. ఆ పొలంలో మట్టి గట్టిపడే లక్షణాన్ని బట్టి.. భూమికి ఎన్ని అంగుళాల లోతున డ్రిప్‌ పైపులు, లైన్లు వేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు.
దీన్ని ప్రతి ఏటా మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి వేసుకుంటే పదేళ్లపాటు కదిలించాల్సిన అవసరం ఉండదట. కరువొచ్చినా ఉన్న నీటితోనే మంచి దిగుబడులు తీయగలుగుతారు కాబట్టి.. దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమేనని చెబుతున్నారు.
ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు పొలంలో తిరగడం వల్ల భూగర్భ డ్రిప్‌కు ఎటువంటి నష్టమూ ఉండదు.
రెయిన్‌ గన్‌ల ద్వారా ఖర్చయ్యే నీటిలో సగంతోనే భూగర్భ డ్రిప్‌ ద్వారా పంటలు పండించవచ్చు.
వరి తదితర పంట విత్తనాలు మొలకెత్తడానికి మొదట ఒక తడి పెడతారు. మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్‌ ద్వారా నీటిని అందిస్తారు. పొలంలో భూమి పై భాగం పొడిగానే ఉంటుంది. ఫలితంగా కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
మట్టిలో నీటి తేమ ఎంత లోతులో ఎంత ఉంది? అనేది ఎప్పటికప్పుడు గమనించి రైతు మొబైల్‌ లేదా కంప్యూటర్‌కు సెన్సార్లు సమాచారం ఇస్తాయి. నీరు పంటలకు అవసరం లేనంత కిందికి వెళ్తున్నదో లేదో తెలుసుకోవడానికి భూగర్భంలో అక్కడక్కడా సెన్సార్లు పెడతారు.
భూగర్భ డ్రిప్‌తో అతి తక్కువ నీటితో, కరువు కాలంలోనూ పంట తీయవచ్చు. అయితే, దీన్ని ఏర్పాటు చేసుకోవడం అధిక ఖర్చుతో కూడిన పనే. ఎకరానికి రూ. 35 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుందని ఒక అంచనా.
అమెరికాలోని మిన్నొసోట రాష్ట్రానికి చెందిన మొక్కజొన్న రైతు బ్రియాన్‌ వెల్‌డె తన 58 ఎకరాల పొలంలో భూగర్భ డ్రిప్‌ను గత ఏడాదిగా వాడుతున్నారు. మొక్కజొన్న  రైతుల సంఘం ఆర్థిక సాయంతో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. 5 అడుగుల దూరంలో 14 అంగుళాల లోతులో.. 8 అంగుళాల వ్యాసార్ధం గల భూగర్భ డ్రిప్‌ పైపులను అమర్చారు. వీటి నుంచి డ్రిప్‌ టేపుల ద్వారా నీటిని మొక్కజొన్న మొక్కల వేర్లకు నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జూలైలో నీటి ఎద్దడి కాలంలోనూ తేలికపాటి ఇసుక నేలలో మొక్కజొన్న పంటను భూగర్భ డ్రిప్‌ వల్లనే కాపాడుకోగలిగానని, ఇదొక ఆశావహమైన ప్రత్యామ్నాయమని  బ్రియాన్‌ వెల్‌డె అంటున్నారు. తొలుత ఎక్కువ పెట్టుబడి అవసరమైనప్పటికీ ఇది రైతుకు లాభదాయకమేనన్నారు.
రసాయనిక వ్యవసాయంలోనైనా, సేంద్రియ / ప్రకృతి వ్యవసాయంలోనైనా భూగర్భ డ్రిప్‌ లైన్ల ద్వారా ద్రవ రూప ఎరువులను అందిస్తూ.. మంచి దిగుబడులు పొందడం అసాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
అంతర పంటలు సాగు చేసుకోవాలనుకుంటే అందుకు అనుగుణంగా అదనపు భూగర్భ డ్రిప్‌ లైన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పంటల వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదనతో ప్రకృతి సేద్యం చేసే రైతులకు భూగర్భ డ్రిప్‌తో అధిక ప్రయోజనం చేకూరవచ్చు.
మట్టి ఉష్ణోగ్రతలు, నేల స్వభావం, పంటల స్వభావం తదితర అంశాలను బట్టి భూగర్భ డ్రిప్‌ ప్రభావశీలత ఆధారపడి ఉంటుంది. బిందు సేద్యంలో ముందుకొస్తున్న ఈ కొత్తపోకడపై పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ దిశగా దీక్షగా కదిలితే కరువు పీడిత రైతుల్లో కొందరికైనా మేలు కలుగుతుంది.

భూగర్భ డ్రిప్‌తో వరి, గోధుమ సాగుపై పంజాబ్‌ వర్సిటీ అధ్యయనం!
పంజాబ్‌లోని 138 నీటి బ్లాక్‌లకు గాను 110 బ్లాక్‌లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం గోధుమ సాగులో డ్రిప్‌ వాడకంపై పరిశోధనలు చేపట్టింది. రెండేళ్ల క్షేత్రస్థాయి పరిశోధన అనంతరం.. రబీలో డ్రిప్‌తో గోధుమ పంటను సగం నీటితోనే సాగు చేయవచ్చని డాక్టర్‌ ఎ. ఎస్‌. బ్రార్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. మొదట 4 అంగుళాల నీటితో పొలంలో నీటిని పారగట్టారు. గోధుమ విత్తనాలు మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్‌ ద్వారా 5 విడతలుగా (కేవలం 20% నీటితోనే) నీటి తడులు ఇచ్చారు.

డ్రిప్‌ను వాడటం ద్వారా 15 రోజులు ముందుగా గోధుమ విత్తుకోవడం వీలవుతుంది. తద్వారా 10% దిగుబడిని పెంచే అవకాశం ఉందని ఆయన ఇటీవల ప్రకటించారు. రెండేళ్లుగా డ్రిప్‌పై అధ్యయనం చేసిన డా. బ్రార్‌ బృందం ఇప్పుడు భూగర్భ డ్రిప్‌పై దృష్టిపెట్టింది. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టడానికి ఇటీవలే నిధులు విడుదలయ్యాయని డా. బ్రార్‌ తెలిపారు. రబీలో గోధుమతోపాటు, ఖరీఫ్‌లో వరి పంటను కూడా భూగర్భ డ్రిప్‌ ద్వారా పండించడానికి అవకాశాలున్నాయన్నారు. వరి, గోధుమ సాగుకు భూగర్భ డ్రిప్‌ను వాడే పద్ధతిని రైతులకు పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండేళ్లలో సిఫారసు చేసే అవకాశాలున్నాయి.

కాలిఫోర్నియాలో భూగర్భ డ్రిప్‌తో వరి సాగు!
అత్యధిక పరిమాణంలో సాగు నీరు అవసరమయ్యే వరి పొలాల్లో సైతం భూగర్భ డ్రిప్‌ వాడకానికి అమెరికాలోని కాలిఫోర్నియా రైతులు ఇజ్రాయెల్‌ సాంకేతిక సహకారంతో శ్రీకారం చుట్టారు. వరి పంటను భూగర్భ డ్రిప్‌తో పండించే సాంకేతికతపై విశేష పరిశోధనలకు ఇజ్రాయెల్‌లోని బెన్‌–గురియన్‌ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. వరి సాగుకు పేరొందిన మూడు అమెరికన్‌ రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. సేంద్రియ వరి సాగులో పేరుగాంచిన ‘లుండ్‌బెర్గ్‌ ఫామిలీ ఫామ్స్‌’ సంస్థ బెన్‌–గురియన్‌ విశ్వవిద్యాలయంతో గత ఏడాది ఒప్పందం చేసుకొని, తొట్టతొలిగా వంద ఎకరాల్లో భూగర్భ డ్రిప్‌తో వరి సాగుకు ఉపక్రమించింది.
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement