విశ్వనగరంలో వెలుగు రేఖలు
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్) :ఏదైనా ఒక రాష్ట్రం, ప్రాంతం ఆర్థిక స్థితిని అంచనా వేయడంలో విద్యుత్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. విశ్వ నగరంగా మారిన విశాఖ ఆర్థిక రాజధానిగా బలంగా ఎదిగేలా విద్యుత్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మాల్స్, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా విశాఖలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగని విధంగా భూగర్భం నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్ పంపిణీ కానుంది. పారిశ్రామికవేత్తలు, పర్యాటకులను ఆకర్షించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖలో సిద్ధమవుతున్న ఆధునిక విద్యుత్ వ్యవస్థపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ..
తుపాన్లకు తల వంచదు..
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చి విశాఖలో స్థిరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాలను అందిపుచ్చుకుంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సాగర నగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు కూడా మొదలయ్యాయి.
తుపాన్లు లాంటి విపత్తుల సమయంలోనూ విశాఖ నగరం అంతటా విద్యుత్ వెలుగులకు ఆటంకం కలుగకుండా రూ.925 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.481.49 కోట్ల ఖర్చుతో 80,529 విద్యుత్ కనెక్షన్లను భూగర్భ విద్యుత్ వ్యవస్థలోకి తెచ్చారు. నగరం మొత్తం 2,449 కి.మీ. పొడవున అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయనున్నారు. సముద్రాన్ని ఆనుకుని ఉన్న నగరం కావడంతో తుపాన్లు వచ్చినపుడు విద్యుత్ స్థంభాలు దెబ్బతింటున్నాయి.
ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా పాత స్థంభాల స్థానంలో సెంట్రిఫ్యూగల్లీ కాస్ట్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ స్థంభాలు (స్పన్‌పోల్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3,266 స్పన్‌పోల్స్ ఏర్పాటు కాగా అందుకోసం రూ.15.36 కోట్లను వెచ్చించారు. నష్టాల తగ్గింపు, ఆధునీకరణ పనులను సుమారు రూ.1,722.02 కోట్లతో చేపట్టారు. ఇందులో భాగంగా 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 16 నిర్మించనున్నారు. గత మూడు నెలల్లో 421 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
30 శాతం పెరిగిన వినియోగం
మొత్తం 1,647 చ.కిలోమీటర్లు విస్తరించిన విశాఖలో 22,80,457 జనాభా ఉంది. వీరికి సరిపడా విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. దాదాపు 8,32,377 గృహ, 1,06,006 వాణిజ్య, 1,803 పారిశ్రామిక, 10,909 ప్రభుత్వ, స్థానిక సంస్థలు, 1,179 హెచ్‌టీ, 5,215 వ్యవసాయ కనెక్షన్లకు విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ విద్యుత్‌ను అందిస్తోంది. ఇంత భారీగా జరుగుతున్న విద్యుత్ సరఫరాలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా 1,281 విద్యుత్ సరఫరా నియంత్రికలు (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు) అమర్చారు.
మరో 4,955 డీటీఆర్లను సుమారు రూ.514.688 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. 316.64 సర్క్యూట్ కిలోమీటర్ల మేర లైన్లు మార్చుతున్నారు. ఈ చర్యల ఫలితంగా వేసవిలోనూ విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరుగుతోంది. గతంలో సరాసరి రోజుకు 11 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదు కాగా ఇప్పుడు 16.495 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 30 శాతం పెరిగింది.
పూర్తి భద్రత..
విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా విశాఖ సర్కిల్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగా సర్క్యూట్ బ్రేకర్లను అమర్చుతున్నారు. ఇవి విద్యుత్ వైర్లు తెగి కింద పడినప్పుడు ఫీడర్ ట్రిప్ అయ్యేలా చేసి సరఫరాను నిలిపివేస్తాయి. సబ్ స్టేషన్లో అలారం మోగించడం ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఏ ప్రాంతంలో వైరు తెగిందో కచ్చితంగా చూపిస్తాయి. లో ఓల్టేజ్, హై ఓల్టేజ్‌ను అంచనా వేస్తాయి. దీనివల్ల గృహోపకరణాలు కాలిపోవడం, అగ్ని ప్రమాదాలు లాంటి వాటిని అరికట్టవచ్చు.
విశాఖ రహదారులపై నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇనుప రక్షణ కంచెలతో పాటు షాక్ కొట్టని పోలీప్రొపిలిన్ వలలను ప్రయోగాత్మకంగా రక్షణ కోసం వాడుతున్నారు. రహదారుల మీదుగా వెళ్లే వైర్లకు కింద ఈ వల ఉంటుంది. వైరు తెగినా వలలోనే పడుతుంది.
విద్యుత్ సిద్ధం:
విద్యుత్ పరంగా విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ వినియోగం చాలా ఎక్కువ. పోర్టు, నేవీ, రైల్వే, ఆస్పత్రులు లాంటి భారీ వ్యవస్థలకు అనుబంధంగా ఉండే విభాగాలకు విద్యుత్ సరఫరా అందించాలి. విశాఖ, అరకు, పాడేరు లాంటి పర్యాటక ప్రాంతాలు, సింహాచలం, శ్రీకాకుళం లాంటి పుణ్య క్షేత్రాలకు నిత్యం పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. నగరానికి భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, కార్యాలయాలు వస్తున్నాయి. వాటికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి.
ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా అన్ని సబ్స్టేషన్లను భవిష్యత్ అవసరాలకు సరిపడా సిద్ధం చేశాం. మేజర్ సిటీ ఏరియా అంతా అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టుతో కవర్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో నగరం మొత్తం అండర్ గ్రౌండ్ కేబులింగ్ జరుగుతుంది. వినియోగం ఎంత పెరిగినా విద్యుత్ మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి.
– ఎల్.మహేంద్రనాథ్, పర్యవేక్షక ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్, విశాఖ సర్కిల్.