నిధులివ్వలేం: చంద్రబాబు
- అమరావతిలో భూగర్భ విద్యుత్తు వ్యవస్థపై సీఎం రూ.1,500 కోట్లు
- కేటాయించలేమని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతిలో అత్యాధునిక భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకు రూ.1,500 కోట్లు కేటాయించలేమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పేశారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించమని ట్రాన్స్‌కోకు సూచించారు. ఇప్పట్లో రాజధానికి డెవలపర్లు వచ్చే అవకాశాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి కోసం ప్రభుత్వం సమీకరించిన 33 వేల ఎకరాల మీదుగా ఎనిమిది ట్రాన్స్‌కో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు వెళ్తున్నాయి. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఆ లైన్లను తొలగించి డెవలపర్లకు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.
అందుకు అత్యాధునిక రీతిలో భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థను ఏర్పాటుకు సీఎం ఆమోదించడంతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయడానికి ట్రాన్స్‌కో ప్రాథమిక సన్నాహాల్లో నిమగ్నమైంది. కానీ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ట్రాన్స్‌కోకు సీఎం షాక్ ఇచ్చారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ కోసం రూ.1,500కోట్లు ప్రభుత్వం కేటాయించలేదని తేల్చేశారు. బాబు వ్యాఖ్యలతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. భూగర్భ విద్యుత్తు పనులు పూర్తికావడానికి రెండేళ్లు పడుతుంది. అంటే అప్పటికి రాజధాని డెవలపర్ల ఎంపిక పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశాలు లేవని స్పష్టమైంది. రైతుల నుంచి సమీకరించిన 33 వేల ఎకరాల్లో రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం కోసం డెవలపర్లకు ఇస్తామన్నది ప్రభుత్వ విధానం. ప్రస్తుతం భూగర్భ విద్యుత్తు వ్యవస్థకు రూ.1,500 కోట్లే కేటాయించలేమని ప్రభుత్వం చెబుతోంది. ఆ లెక్కన మౌలిక సదుపాయాలకు రూ.5,500 కోట్లు కేటాయించడం కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది.