అధికారులు తీరు మార్చుకోవాలి
♦ కాగితంపై కాదు.. చేతల్లో చూపించాలి
♦ అటవీశాఖ మంత్రి జోగు రామన్న
♦ విద్యార్థులు తక్కువ సంఖ్యలో
హాజరు కావడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం
♦ నీటిట్యాంకుల నిర్మాణానికి భూమిపూజ
ఆదిలాబాద్‌రూరల్: సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారని, వారు పని తీరు మార్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. వాటర్‌గ్రిడ్ పనుల్లో భాగంగా శుక్రవారం మండలంలోని లోకారి, రాములుగూడ, యాపల్‌గూడ గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
లోకారి పాఠశాలను సందర్శించిన ఆయన ప్రార్థనలో పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో హరితహారం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిల్లోకి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడుగగా.. వారు సమాధానాలు చెప్పకపోవడంతో విద్యాబోధన ఇలా ఉంటే ఎలా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.
ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిషు మీడియం బోధించాలని పలుమార్లు డీఈవోలకు ఆదేశాలను జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణాల కార్యక్రమం చేపడితే అధికారుల పర్యవేక్షణ లోపంతో తూతూమంత్రంగా ఇంకుడుగుంతలు నిర్మించడం సరికాదని అన్నారు. కాగితాల్లో వందలాది ఇంకుడుగుంతలను నిర్మించామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తే నిరుపయోగంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
అందుక లోకారిలోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతనే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడి నుంచి చిన్న లోకారి గ్రామానికి వెళ్లిన మంత్రి పాఠశాలలో ఉపాధ్యాయురాలు లేకపోవడంపై అక్కడి నుంచి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. రాములుగూడకు వెళ్లిన మంత్రి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రూ.4 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు
జిల్లాలో రూ.4వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టినట్లు మంత్రి రామన్న తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలు అందిస్తామని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పనిసరిగా అమలు చేసేలా చట్టాన్ని తీసుకు వస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, ఎంపీపీ నైతం లక్ష్మీశుక్లాల్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, సర్పంచ్‌లు మడావి స్వప్నతుకారాం, ఇస్రూబాయి, ఉష్కం రఘుపతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కీ స్వామి, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ మధుకర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రమణ, ఏఈ సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.