unemploy
-
అమెరికాలో తగ్గిన నిరుద్యోగం
వాషింగ్టన్: అమెరికాలో గతవారం నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. లేబర్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం.. మే 18తో ముగిసిన వారానికి స్టేట్ అన్ఎంప్లాయిమెంట్ బెన్ఫిట్స్ కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య 8,000 తగ్గి 215,000కి చేరింది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం తాజా వారంలో 220,000మంది నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారని రాయిటర్స్ కథనం వెల్లడించింది. మార్చి 2022 నుండి ఫెడరల్ రిజర్వ్ నుండి 525 బేసిస్ పాయింట్ల విలువైన వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో లేబర్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నట్లు తేలింది. -
కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి
భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్‌లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. ‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్ఎస్బీసీ సూచిస్తుంది. -
నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్ పాస్‌ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్‌లపై 20 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్‌పాస్ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ రూ.2800కు పాస్‌లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్ (క్వార్టర్లీ) ప్రస్తుతం రూ.3900. 20 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.3120. రౌండెడ్ ఆఫ్‌తో రూ.3200కు పాస్‌లను పొందవచ్చు. పాస్‌ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ తాత్కాలిక బస్షెల్టర్లు రహదారుల విస్తరణ కారణంగా తొలగించిన బస్షెల్టర్ల స్థానంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. తొలగించిన బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సదుపాయం కోసం 24 బస్టాపుల్లో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. భరత్‌నగర్ (ఎర్రగడ్డ వైపు), ప్రగతినగర్, ఎల్లంపేట్ క్రాస్‌రోడ్, ఆర్సీపురం, ఉప్పల్ (రేణుక వైన్స్), యాప్రాల్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్, జియాగూడ గాంధీ విగ్రహం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, అడిక్‌మెట్, నారాయణగూడ (హిమాయత్‌నగర్ వైపు), బర్కత్‌పురా పీఎఫ్ ఆఫీస్, అఫ్జల్‌గంజ్, జిల్లెలగూడ, జైపురికాలనీ, మన్నెగూడ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ డిపో తదితర ప్రాంతాల్లో టెంట్లు వేసి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: పుట్టగానే ఆధార్!) -
గుడ్డిగా నమ్మారు.. చివరికి దుబాయ్‌లో..
జగిత్యాల క్రైం: మంచి ఉద్యోగం, బ్యాంక్ రుణం తీసుకొని ఎగ్గొట్ట వచ్చన్న ఏజెంట్ మాయమాటలు నమ్మి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు మోసపోయారు. విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. జిల్లాలోని పోతపల్లికి చెందిన రావుల మనోజ్‌కుమార్, తిమ్మాపూర్‌కు చెందిన నూనె నాగరాజు, మడక గ్రామానికి చెందిన నోముల శ్రీధర్, కరీంనగర్ పట్టణం భగత్‌నగర్‌కు చెందిన కొమిడి నవీన్‌రెడ్డి.. నిజామాబాద్ జిల్లా మానిక్బండార్కు చెందిన గల్ఫ్ ఏజెంట్ గుండారపు వంశీకృష్ణను కలిశారు. ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు చెల్లిస్తే విజిట్ వీసాపై దుబాయ్ పంపిస్తానని, అక్కడ తమవారు రిసీవ్ చేసుకొని కంపెనీ వీసా ఇప్పిస్తారని నమ్మబలికాడు. కంపెనీ వీసా వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం తీసుకుని స్వదేశానికి తిరిగి రావచ్చని నమ్మించాడు. గుడ్డిగా ఏజెంట్ మాటలు నమ్మారు ఏజెంట్ మాటలు నమ్మిన సదరు యువకులు ఒక్కొక్కరు రూ1.50 లక్షలు చొప్పున చెల్లించి ఫిబ్రవరి 11న హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన కొడిమ్యాల బాబా శ్రీనివాస్ ఈ యువకులను తీసుకెళ్లి దుబాయ్‌లోని సత్వా పట్టణంలో ఓ గదిలో పెట్టాడు. మరుసటి రోజు కంపెనీ వీసా కోసం ఏజెంట్‌ను ఫోన్లో నిలదీయగా.. బాబాశ్రీనివాస్ ఇప్పిస్తాడని చెప్పాడు. వారంతా శ్రీనివాస్‌ను అడుగగా.. తనకేమీ సంబంధం లేదని, కొద్దిరోజులపాటు తన వద్ద ఉంచుకోమని చెప్పాడన్నారు. దీంతో మోసపోయామని తెలుసుకొని.. పది రోజుల క్రితం నవీన్‌రెడ్డి అక్కడే ఉన్న వారి బంధువుల సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. మిగతా ముగ్గురు ఇండియాకు రావాలంటే ఒక్కొక్కరు రూ.44 వేలు చెల్లించాల్సి ఉంది. తమను ఆదుకోవాలని, విజిట్ వీసాపై పంపిన గల్ఫ్ ఏజెంట్ వంశీకృష్ణపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ( చదవండి: ఆ సంచీలో ఒక్క రూపాయి లేదు.. కిడ్నాప్ ఓ డ్రామా! ) -
రూ.వెయ్యి లాభం.. రూ.3.14 లక్షల నష్టం!
సాక్షి, సిటీబ్యూరో: క్రిప్టో కరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్‌పై మోజుతో నగరానికి చెందిన ఓ నిరుద్యోగి సైబర్ నేరగాడి వల్లో పడ్డాడు. తొలుత ఇతడికి రూ.వెయ్యి లాభం వచ్చేలా చేసిన ఆ దుండగుడు ఆపై ఆఫర్స్ పేరు చెప్పి రూ.3.14 లక్షలు కాజేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ మోసం ఎలా జరిగింది ► నగరానికి చెందిన మనీష్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. బిట్‌కాయిన్స్‌పై ఆసక్తి ఉన్న ఇతగాడు తన స్మార్ట్ ఫోన్లో బినాన్స్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ► ఈ యాప్‌లో ఉండే గ్రూపుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బిట్‌కాయిన్స్ క్రయ, విక్రేతలు ఉంటారు. ఈ ప్లాట్ఫామ్లోనే మనీష్‌కు బెంగళూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. ► అతడి నుంచి తొలుత రూ.5 వేలు, రూ.5 వేలు, రూ.13 వేలు వెచ్చించి మూడు బిట్కాయిన్లు ఖరీదు చేశాడు. వీటిని బినాన్స్‌లోనే విక్రయానికి పెట్టగా మనీష్‌కు రూ.24 వేలు వచ్చాయి. ఇలా రూ.వెయ్యి లాభం పొందిన ఇతగాడు బెంగళూరు వాసిని పూర్తిగా నమ్మాడు. ► ఆపై చాటింగ్ ద్వారా మనీష్‌ను సంప్రదించిన బెంగళూరు వాసి ప్రత్యేక ఆఫర్ నడుస్తోందని, రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే ఒక శాతం బిట్‌కాయిన్ బోనస్‌గా వస్తుందని నమ్మబలికాడు. ► దీంతో మనీష్ బిట్ కాయిన్ ఖరీదు చేసేందుకు రూ.25 వేలు బదిలీ చేశాడు. అయితే ఆ ఆఫర్ పొందాలంటే మరో రూ.23,526 పంపాలంటూ బెంగళూరు వాసి కోరాడు. ఇలా మొత్తం 15 లావాదేవీల్లో మనీష్ నుంచి రూ.3.14 లక్షలు కాజేశాడు. ► మనీష్ ఈ మొత్తాలను యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలకు బదిలీ ద్వారా పంపాడు. మరో రూ.24 వేలు పంపిస్తేనే ఆఫర్ వర్తిస్తుందంటూ బెంగళూరు వాసి చెప్పడంతో మనీష్‌కు అనుమానం వచ్చింది. ► తన డబ్బు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆ మొత్తానికి సరిపడా బిట్‌కాయిన్స్ పంపాలని బెంగళూరు వాసిని పలుసార్లు విజ్ఞప్తి చేశాడు. దీంతో తన వద్ద ఉన్న డబ్బంతా బిట్‌కాయిన్స్‌ల్లో ఇరుక్కుందని అతడు చెప్పాడు. ► రూ.20 వేలు పంపిస్తే రూ.1.7 లక్షలు లోన్ తీసుకుని ఆ మొత్తం చెల్లిస్తానని, అంతకు మించి ఇవ్వలేనని బుధవారం స్పష్టం చేశాడు. మళ్లీ గురువారం అడగ్గా... రూ.30 వేలు పంపాలని, రూ.7 లక్షలు రుణం తీసుకుని మొత్తం రూ.3.14 లక్షలు చెల్లిస్తానన్నాడు. ► అతడి గుర్తింపు కార్డులు పంపాలంటూ మనీష్ కోరగా... తనకు లేవని, కుటుంబీకుల పేరుతో కొన్ని పంపాడు. మనీష్ వేరే ఫోన్ నంబర్ నుంచి బినాన్స్ యాప్‌లోకి ప్రవేశించి బెంగళూరు వాసితో కొత్త వ్యక్తిలా చాటింగ్ చేశాడు. ► తనకు రూ.50 వేల బిట్‌కాయిన్స్ కావాలని, ఆ మొత్తం పంపడానికి గుర్తింపుకార్డు షేర్ చేయాలని కోరాడు. దీనికి అంగీకరించిన బెంగళూరు వాసి తన ఆధార్ కార్డు ప్రతిని షేర్ చేశాడు. అతగాడు తనను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశాడని గ్రహించిన మనీష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణా లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు ప్రారంభించారు. ( చదవండి: వామ్మో.. ‘ఖతర్’నాక్ మోసం! ) -
ఇది ఆత్మహత్యకాదు.. ప్రభుత్వ హత్య!
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్‌నాయక్ మృతి చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో ఇక ఉద్యోగాలు రావని, పోరాటం చేయాలని, తాను బతికి వస్తే మీతో కలుస్తానని సునీల్ నాయక్ పిలుపునివ్వడం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకుందామని ఆ ప్రకటనలో ఉత్తమ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, పట్టభద్రుడు సునీల్ నాయక్ ఆత్మహత్య కేవలం కేసీఆర్ సర్కార్ చేతగానితనంతోనే జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమయిన కేసీఆర్ అండ్ కో, ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలివ్వకుండా వారి చావులకు కారణమవుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. సునీల్‌కు నివాళి... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నేతృత్వంలో పలువురు సునీల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్దినమని, కలెక్టర్ అవుతానన్న గిరిజన బిడ్డ కాటికి పోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ డౌన్‌డౌన్... మా ఉద్యోగాలు–మాక్కావాలి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి ముట్టడి సునీల్ మృతి వార్త ఉమ్మడి వరంగల్‌లో దావానలంలా వ్యాపించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశా యి. ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉండగా, సునీల్ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్ ముందు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్ చేశారు. అండగా ఉంటాం: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం రాలేదన్న బాధ, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. సునీల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి సునీల్ లేని లోటు తీర్చలేనిదని, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. -
ఒక్క ఆలోచన.. వంద అవకాశాలు
ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో దాదాపు ప్రతి ఒక్కరికి అనుభవమే. అలాంటిది.. ఓ కంపెనీ తీసేసిన తర్వాత మరో చోట ఉద్యోగం పొందడం అంటే మాటలు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే పాట్రిక్ హోగ్లాండ్ అనే వ్యక్తికి ఎదురయ్యింది. రెజ్యూమ్ పట్టుకుని ఎన్నో చోట్ల తిరిగాడు. ఫలితం లేదు. తీవ్ర నిరాశకు లోనైన సమయంలో అతనికి వచ్చిన ఓ వినూత్న ఆలోచన అతడిని తిరిగి ఉద్యోగస్తుడిగా మార్చింది. ఆ వివరాలు ఏంటో అతడి మాటల్లోనే.. ‘గతంలో నేను పని చేస్తున్న కంపెనీ నన్ను ఉద్యోగంలోంచి తీసేసింది. నెల రోజులు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. నాకు ఓ కుమారుడు. ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. దాంతో తిరిగి ఉద్యోగాన్వేషణలో పడ్డాను. ఆన్లైన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయడం.. కంపెనీల చుట్టూ తిరగడం ఇలా చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ప్రతి చోట నిరాశే ఎదురయ్యింది. ఏం చేయాలో పాలుపోలేదు. అలా ఉన్న సమయంలో నాకొక వినూత్న ఆలోచన వచ్చింది’ అన్నారు పాట్రిక్. ‘దాని ప్రకారం పదుల సంఖ్యలో రెజ్యూమ్‌లను ప్రింట్ తీయించాను. తర్వాత ‘నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. దయచేసి ఓ రెజ్యూమ్ తీసుకొండి’ అని రాసి ఉన్న ఓ ప్ల కార్డు పట్టుకుని రద్దీగా ఉండే ప్రాంతంలో నిలబడే వాడిని. వచ్చి పోయే వారిని ఆపి నా గురించి చెప్పేవాడిని. తొలుత జనాలు నన్ను చూసి నవ్వేవారు. కానీ తర్వాత నా ప్రయత్నం గురించి ఆలోచించేవారు. ఈ క్రమంలో మెలిస్సా డిజియాన్ఫిలిప్పో అనే ఓ వ్యక్తి ద్వారా నా ప్రయత్నం సోషల్ మీడియాకు ఎక్కడం, ఉద్యోగం పొందడం జరిగాయి’ అన్నాడు పాట్రిక్. ఈ విషయం గురించి మెలిస్సా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘ఓ రోజు నేను ఆఫీస్‌కు వెళ్తుండగా.. పాట్రిక్ కనిపించాడు. ఎర్రటి ఎండలో.. చెరగని చిరునవ్వుతో రోడ్డు మీద వచ్చిపోయే వారిని ఆపి.. తన ప్రయత్నం గురించి చెప్తూ.. రెజ్యూమ్ ఇస్తున్నాడు. అతని ఆలోచన నాకు నచ్చింది. దాంతో రెజ్యూమ్ తీసుకుని.. నాకు తెలిసిన వారి కంపెనీలకు పంపించాను. మీరు కూడా తనకు సాయం చేయండి’ అంటూ మెలిస్సా తన ఫేస్బుక్లో పాట్రిక్ రెజ్యూమ్ని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు ఊహించనంత స్పందన వచ్చింది. చాలా మంది పాట్రిక్ ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాక.. తమకు తెలిసిన చోటల్లా పాట్రిక్ గురించి చెప్పడం ప్రారంభించారు. చాలా కొద్ది రోజుల్లోనే పాట్రిక్‌కు ఉద్యోగం ఇస్తామంటూ చాలా మంది ముందుకు వచ్చారు. ప్రస్తుతం పాట్రిక్ ఓ మహిళా కాంట్రక్టర్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. తనకు సాయం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు పాట్రిక్. ప్రస్తుతం ఈ స్టోరి ఫేస్బుక్లో తెగ ట్రెండ్ అవుతోంది. -
ప్రాణం తీసిన పూడిక బావి
భీమదేవరపల్లి(హుస్నాబాద్) : ఎండిపోతున్న మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు తాపత్రయపడిన యువరైతు తన వ్యవసాయ బావి పూడికతీసేందుకు ఉపక్రమించాడు. దురదృష్టావశాత్తు వ్యవసాయ బావిలోనుంచి క్రేన్ సాయంతో పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌కు గ్రామానికి చెందిన బొల్లంపల్లి రాకేష్(30) అనే యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గట్లనర్సింగపూర్‌కు చెందిన బొల్లంపల్లి యోహోన్, కొంరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కలదు. పెద్ద కుమారుడైన రాకేష్ డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేస్తున్నాడు. వీరికున్న ఎకరం వ్యవసాయ భూమిలో వర్షకాలంలో పత్తి పంట సాగు చేస్తే దిగుబడి రాలేదు. దీంతో యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చె సమయంలోనే వ్యవసాయ బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో పంట వల్లుమోహం పట్టింది. దీంతో పంటను రక్షించుకునేందుకు గత రెండు రోజుల క్రితమే క్రేన్ సాయంతో తండ్రి యోహోన్, కుమారుడు రాకేష్‌తో పాటుగా కూలీలతో వ్యవసాయ బావిలో పూటీకతీత పనులు చేపట్టారు. కాగా బుధవారం బావిలోని విద్యుత్ మోటర్ పనిచేయకపోవడంతో మోటర్‌ను పైకి తీసేందుకు రాకేష్ బావిలోకి దిగాడు. క్రేన్ వైర్ మోటర్‌కు అమర్చి మోటర్‌పై రాకేష్ కూర్చుండి పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో రాకేష్ బావిలో పడగా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా మారిన రాకేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని సర్పంచ్ సల్పాల రాధికతిరుపతితో పాటు పలువురు సందర్శించి నివాలులర్పించారు. కాగా రాకేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్యాల ప్రకాశ్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి షడ్రక్ ప్రభుత్వాన్ని కోరారు. -
పట్టుదలతో చదివితే ఉద్యోగాలు
ఖిలావరంగల్ : నిరుద్యోగులు పట్టుదలతో చదివితే తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని టీఎస్ఎస్పీ ఇన్చార్జి కమాండెంట్ శ్రీనివాస్‌కుమార్ సూచించారు. నగర శివారులోని మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులతో శనివారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమాండెంట్ శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ బెటాలియన్‌లో సుమారు 300 మం ది అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్ష ణ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో 60 మంది బాలికలు, 90 మంది బాలురు దేహదారుఢ్య పరీక్షల్లో రాణించినట్లు తెలిపారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యర్థులు తగిన రీతిలో సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమాండెంట్ అంజయ్య, శిక్షణ ఇన్ స్పెక్టర్లు భాస్కర్, ఘని, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
పాలకొండ : నాగావళి ఉపాధి శిక్షణ సంస్థ (నైరేడ్) సంస్థ నుంచి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ప్రొగ్రామ్ అధికారి సి.నాగరాజు శుక్రవారం తెలిపారు. ఇందు కోసం ఈ నెల 10న ఉదయం 10 గంటలకు రాజాం నైరేడ్ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. స్త్రీలకు సంబంధించి హోం నర్సింగ్, డైజనర్ బ్లౌజ్, షారీ పెయింటింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ కల్పిస్తామని 18 నుంచి 40 ఏళ్లు వయస్సు కలిగిన వారు ఇంటర్వూ్యలకు హాజరు కావాలని కోరారు. పురుషులకు సంబంధించి సెక్యూరిటీ గార్డు, మెుబైల్ ఫోన్ సర్వీసింగ్, ట్యాక్సీ డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి వరకు చదువుకుని 40 ఏళ్లులోపు వయస్సు ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు 9989057451, 9502845558 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
రేపు డీఆర్డీఏ జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను డీఆర్డీఏ–ఈజీఎం జాబ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ నుంచి పీజీ వరకు చదివి ఉండి, 19 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. వివిధ కంపెనీలు, సంస్థల్లో వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. అభ్యర్థులు వారి విద్యార్హత సర్టిఫికెట్, జిరాక్స్ కాపీలు, ఆధార్‌కార్డులతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని డీఆర్డీఏ–ఈజీఎం కార్యాలయంలో సంప్రదించాలని, లేదా 08518–277499, 9014296452, 9705171923 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.