విద్యార్థుల్లోని నైపుణ్యం వెలికితీయాలి
సాక్షి, సిటీబ్యూరో: యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలు, యూనిఫైడ్ సైబర్ ఒలింపియాడ్, యూనిఫైడ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ విజేతలకు ఆవార్డులు ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో రాష్ట్రానికి చెందిన 130 మంది విద్యార్థులు అవార్డును దక్కించుకున్నారు.
విజేతలుగా నిలిచిన వీరితో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి, ఉత్తమ పనితీరు కనబర్చిన పాఠశాలలకు ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సెం టర్ ఫర్ సెల్యూలర్ అండ్ మానిక్యూలర్ బయోలాజి (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌బాబు అవార్డులు అందజేసి సత్కరించారు. యూనిఫైడ్ కౌన్సిల్ డెరైక్టర్ కల్లూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ .. సంస్థ ఆరంభించిన తొలినాళ్ల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాణ్యమైన విద్యా సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల నైపుణ్యం వెలికి తీసేలా పరీక్షలు నిర్వహిస్తోందన్నారు.
ఈ పరీక్షకు ఇండోనేషియా, రష్యా, కువైట్, బ్రిటన్ తదితర దేశాల నుంచి ఏడు లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ బీవీ పట్టాభిరామ్, క్యాట్‌నవ్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.