ఉపాధ్యాయ సంఘాల హర్షం
హైదరాబాద్: ఏకీకృత సర్వీసు రూల్స్‌కు సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతకం చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దీనిపై రాష్ట్రపతికి, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపాయి. ఉపాధ్యాయుల చిరకాల కోరిక తీరిందని పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
వీలైనంత త్వరగా ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి అమల్లోకి తేవాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, పీఆర్టీయూ–తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్‌రాజు, టీటీఎఫ్ నేతలు రామచంద్రం, రఘునందన్, టీటీయూ నేతలు మణిపాల్‌రెడ్డి, నరసింహస్వామి తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి’తో టీచర్లకు మేలు: పాతూరి
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమల్లోకి వస్తే టీచర్లకు మేలు జరుగుతుందని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడంపై పాతూరి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో నాలుగు దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించినట్టయిందని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.