Uniform distribution
-
3.34 లక్షల యూనిఫాం పంపిణీ
సర్వశిక్షా అభియాన్ సీఎంఓ వెంకట్రావు కరప: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొత్తం 3.34 లక్షల యూనిఫాం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ సీఎంఓ ఇంటి వెంకట్రావు తెలిపారు. కరప మండలం కొరుపల్లిలో మంగళవారం ఆయన డ్వాక్రా మహిళలు రూపొందిస్తున్న యూనిఫాంను పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఆర్డీఏ సౌజన్యంతో ఇప్పటివరకు 65 వేల మందికి యూనిఫాం సిద్ధం చేసినట్టు చెప్పారు. 55 మండలాల్లో డ్వాక్రా మహిళలు వీటిని కుడుతున్నారని, ఒకొక్క విద్యార్థికి రెండు జతలు ఇస్తున్నట్టు వివరించారు. నెలాఖరుకు 83 శాతం పంపిణీ అవుతుందని, సెప్టెంబర్ పది కల్లా పంపిణీని పూర్తి చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు ఉన్నారు. -
అడ్రెస్ లేదు!
► విద్యార్థుల యూనిఫాం కోసం ఇండెంట్ కూడా పంపని అధికారులు ► గత తప్పిదాలు పునరావృతం ► మేల్కోని విద్యా శాఖ కంబదూరు మండలం తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో 133 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రామం పక్కనే ఉన్న ఓబుగానపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 83 మంది చదువుతున్నారు. ఈ రెండు స్కూళ్ల విద్యార్థులకు 2015-16 విద్యా సంవత్సరంలో ఒక్క జత యూనిఫాం కూడా ఇవ్వలేదు. ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో అధికారులు బుట్టదాఖలు చేశారనేందుకు ఈ రెండు స్కూళ్లే నిదర్శనం. జిల్లాలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు అన్ని స్కూళ్లకు ఏప్రిల్ మూడో వారంలో యూనిఫాం పంపిణీ చేశారు. అంటే విద్యా సంవత్సరం చివరి రోజుల్లో ఇచ్చారు. అధికారుల అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు కలర్ దుస్తులతోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతియేటా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 13న పునఃప్రారంభం కానున్నాయి. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా 1-8 తరగతుల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో1-8 తరగతుల విద్యార్థులు 2,99,632 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. 1-7 తరగతుల బాలురకు చొక్కా- నిక్కర్, బాలికలకు చొక్కా- స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు పంపిణీ చేయాలి. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి కావాలి. అయితే.. ఇప్పటిదాకా ఏ ఒక్క మండలం నుంచి ఇండెంట్ పంపలేదు. మండల విద్యాశాఖ అధికారులు ఇండెంట్ పెడితే ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తారు. తర్వాత కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే సుమారు 3-4 నెలలు పట్టే అవకాశముందని టీచర్లు చెబుతున్నారు. ఏటా ఇదే తంతు : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే యూనిఫాం, పుస్తకాలు విక్రయిస్తున్నాయి. దీంతో ఆయా పాఠశాలల విద్యార్థులు తొలిరోజు నుంచే యూనిఫాంతో బడికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల పరిస్థితి ఇందుకు భిన్నం. అధికారుల అలసత్వం కారణంగా వారికి యూనిఫాం పంపిణీలో ప్రతిసారీ జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రతి సమావేశంలోనూ ఊదరకొడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. -
అడ్రెస్ గల్లంతు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందని యూనిఫాం 1.93 లక్షల మంది ఎదురుచూపులు విద్యాసంవత్సరం ముగుస్తున్నా స్పందన లేదు పట్టించుకోని అధికారులు మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ గజిబిజిగా మారింది. విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందజేయాలి. సర్వశిక్షాభియాన్ ద్వారా జనవరిలో కొన్ని మండలాలకు ఆప్కో ద్వారా క్లాత్ అందజేశారు. మరికొన్ని మండలాలకు ఇంకా చేరలేదు. ఆప్కో నుంచి వచ్చిన క్లాత్ మండల కేంద్రానికి చేరితే అక్కడ్నుంచి ఎంఈవోల ద్వారా ఆయా పాఠశాలలకు అందజేయాలి. స్కూళ్ల యాజమాన్య కమిటీల ద్వారా ఈ దుస్తులు కుట్టే పనిని స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు అప్పగించాలి. ఒక్కొక్క జతకు కుట్టుకూలిగా రూ. 40 చెల్లిస్తామని ప్రకటించారు. కొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉండడంతో గిట్టుబాటు కాదనే సాకుతో డ్వాక్రా సంఘాల సభ్యులు దుస్తులు కుట్టే పనిని చేపట్టలేదు. జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే బాలలు 1.93 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ దుస్తులు ఎప్పుడు కుట్టి అందజేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏప్రిల్ 23తో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటికైనా యూనిఫాం అందజేస్తారా.. లేదా అనేది అర్థం కావడం లేదు. కొన్ని పాఠశాలలకు దుస్తులు వచ్చినా వాటిని హెచ్ఎంలు ఇవ్వని పరిస్థితి ఉంది. మగ పిల్లలకు నిక్కరు, చొక్కా, ఆడపిల్లలకు స్కర్ట్, చొక్కా రెండేసి జతలు అందజేయాల్సి ఉంది. అధికారుల ఏకపక్ష నిర్ణయం పాఠశాల యాజమాన్య కమిటీల నేతృత్వంలో యూనిఫాం కుట్టించాల్సి ఉన్నా అధికారులు ఓ అడుగు ముందుకేసి జిల్లాలోని 225కుపైగా పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే పనిని ఓ ఏజెన్సీకి అప్పగించారు. ఆగస్టులోనే విద్యార్థులకు సంబంధించి దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనవరిలో ఆప్కో నుంచి క్లాత్ విడుదలైంది. 2015 జూన్‌లో క్లాత్ పంపిణీ చేయాల్సిఉండగా 2016 జనవరి వరకు ఈ క్లాత్‌ను అందజేశారు. ఒకే ఏజెన్సీకి 225 మందికి పైగా విద్యార్థులకు దుస్తులు కుట్టే పని అప్పగించడంతో ఆ ఏజెన్సీ పేరున కుట్టుకూలి ఇచ్చే అవకాశం లేదని విజయవాడ డీవైఈవో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలల కమిటీలను ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనించదగిన అంశం. జనవరిలోనే క్లాత్ ఇచ్చారని, పాఠశాలలకు సెలవులు ప్రకటించే నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. దుస్తులు ఉపయోగపడేనా! ఆగస్టులో విద్యార్థుల నుంచి కొలతలు తీసుకుని.. జనవరిలో క్లాత్ పంపిణీ చేసి, ఏప్రిల్‌లో యూనిఫాం లను అందజేస్తే అవి ఎంత మేర విద్యార్థులకు సరిపోతాయనే అనుమానాలున్నాయి. పిల్లలు ఏడాదికి రెండు, మూడంగుళాలు పెరుగుతారని, ఏప్రిల్‌లో ఇచ్చిన దుస్తులు మళ్లీ పాఠశాల పునఃప్రారంభం నాటికే పనికొస్తాయని తల్లిదండ్రులు అంటున్నారు. రెండేళ్లుగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై డీఈవో ఎ.సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యూనిఫాం కుట్టే పని వేగంగా జరుగుతోందని, మార్చి నెలలో విద్యార్థులందరికీ అందజేస్తామని చెప్పారు.