అడ్రెస్ గల్లంతు | Address missing | Sakshi
Sakshi News home page

అడ్రెస్ గల్లంతు

Published Mon, Feb 29 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

అడ్రెస్ గల్లంతు

అడ్రెస్ గల్లంతు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందని    యూనిఫాం
1.93 లక్షల మంది ఎదురుచూపులు
విద్యాసంవత్సరం ముగుస్తున్నా స్పందన లేదు
పట్టించుకోని  అధికారులు
 

మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ గజిబిజిగా మారింది. విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందజేయాలి. సర్వశిక్షాభియాన్ ద్వారా జనవరిలో కొన్ని మండలాలకు ఆప్కో ద్వారా క్లాత్ అందజేశారు. మరికొన్ని మండలాలకు ఇంకా చేరలేదు. ఆప్కో నుంచి వచ్చిన క్లాత్ మండల కేంద్రానికి చేరితే అక్కడ్నుంచి ఎంఈవోల ద్వారా ఆయా పాఠశాలలకు అందజేయాలి. స్కూళ్ల యాజమాన్య కమిటీల ద్వారా ఈ దుస్తులు కుట్టే పనిని స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు అప్పగించాలి. ఒక్కొక్క జతకు కుట్టుకూలిగా రూ. 40 చెల్లిస్తామని ప్రకటించారు. కొన్నిచోట్ల  విద్యార్థులు తక్కువగా ఉండడంతో గిట్టుబాటు కాదనే సాకుతో డ్వాక్రా సంఘాల సభ్యులు దుస్తులు కుట్టే పనిని చేపట్టలేదు. జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే బాలలు 1.93 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ దుస్తులు ఎప్పుడు కుట్టి అందజేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏప్రిల్ 23తో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటికైనా యూనిఫాం అందజేస్తారా.. లేదా అనేది అర్థం కావడం లేదు.  కొన్ని పాఠశాలలకు దుస్తులు వచ్చినా వాటిని హెచ్‌ఎంలు ఇవ్వని పరిస్థితి ఉంది. మగ పిల్లలకు నిక్కరు, చొక్కా, ఆడపిల్లలకు స్కర్ట్, చొక్కా రెండేసి జతలు అందజేయాల్సి ఉంది.

అధికారుల ఏకపక్ష నిర్ణయం
పాఠశాల యాజమాన్య కమిటీల నేతృత్వంలో యూనిఫాం కుట్టించాల్సి ఉన్నా అధికారులు ఓ అడుగు ముందుకేసి జిల్లాలోని 225కుపైగా పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే పనిని ఓ ఏజెన్సీకి అప్పగించారు. ఆగస్టులోనే విద్యార్థులకు సంబంధించి దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనవరిలో ఆప్కో నుంచి క్లాత్ విడుదలైంది. 2015 జూన్‌లో క్లాత్ పంపిణీ చేయాల్సిఉండగా  2016 జనవరి వరకు ఈ క్లాత్‌ను అందజేశారు. ఒకే ఏజెన్సీకి 225 మందికి పైగా విద్యార్థులకు దుస్తులు కుట్టే పని అప్పగించడంతో ఆ ఏజెన్సీ పేరున కుట్టుకూలి ఇచ్చే అవకాశం లేదని విజయవాడ డీవైఈవో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలల కమిటీలను ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనించదగిన అంశం. జనవరిలోనే క్లాత్ ఇచ్చారని, పాఠశాలలకు సెలవులు ప్రకటించే నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

దుస్తులు ఉపయోగపడేనా!
ఆగస్టులో విద్యార్థుల నుంచి కొలతలు తీసుకుని.. జనవరిలో క్లాత్ పంపిణీ చేసి, ఏప్రిల్‌లో యూనిఫాం లను అందజేస్తే అవి ఎంత మేర విద్యార్థులకు సరిపోతాయనే అనుమానాలున్నాయి. పిల్లలు ఏడాదికి రెండు, మూడంగుళాలు పెరుగుతారని, ఏప్రిల్‌లో ఇచ్చిన దుస్తులు మళ్లీ పాఠశాల పునఃప్రారంభం నాటికే పనికొస్తాయని  తల్లిదండ్రులు అంటున్నారు.   రెండేళ్లుగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై డీఈవో ఎ.సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యూనిఫాం కుట్టే పని వేగంగా జరుగుతోందని, మార్చి నెలలో విద్యార్థులందరికీ అందజేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement