
అడ్రెస్ లేదు!
► విద్యార్థుల యూనిఫాం కోసం ఇండెంట్ కూడా పంపని అధికారులు
► గత తప్పిదాలు పునరావృతం
► మేల్కోని విద్యా శాఖ
కంబదూరు మండలం తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో 133 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రామం పక్కనే ఉన్న ఓబుగానపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 83 మంది చదువుతున్నారు. ఈ రెండు స్కూళ్ల విద్యార్థులకు 2015-16 విద్యా సంవత్సరంలో ఒక్క జత యూనిఫాం కూడా ఇవ్వలేదు. ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో అధికారులు బుట్టదాఖలు చేశారనేందుకు ఈ రెండు స్కూళ్లే నిదర్శనం. జిల్లాలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి.
ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు అన్ని స్కూళ్లకు ఏప్రిల్ మూడో వారంలో యూనిఫాం పంపిణీ చేశారు. అంటే విద్యా సంవత్సరం చివరి రోజుల్లో ఇచ్చారు. అధికారుల అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు కలర్ దుస్తులతోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతియేటా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 13న పునఃప్రారంభం కానున్నాయి. సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా 1-8 తరగతుల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో1-8 తరగతుల విద్యార్థులు 2,99,632 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. 1-7 తరగతుల బాలురకు చొక్కా- నిక్కర్, బాలికలకు చొక్కా- స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు పంపిణీ చేయాలి. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి కావాలి.
అయితే.. ఇప్పటిదాకా ఏ ఒక్క మండలం నుంచి ఇండెంట్ పంపలేదు. మండల విద్యాశాఖ అధికారులు ఇండెంట్ పెడితే ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తారు. తర్వాత కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే సుమారు 3-4 నెలలు పట్టే అవకాశముందని టీచర్లు చెబుతున్నారు.
ఏటా ఇదే తంతు : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే యూనిఫాం, పుస్తకాలు విక్రయిస్తున్నాయి.
దీంతో ఆయా పాఠశాలల విద్యార్థులు తొలిరోజు నుంచే యూనిఫాంతో బడికి వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల పరిస్థితి ఇందుకు భిన్నం. అధికారుల అలసత్వం కారణంగా వారికి యూనిఫాం పంపిణీలో ప్రతిసారీ జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రతి సమావేశంలోనూ ఊదరకొడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు.