'కేసు తెలియదుగానీ సస్పెన్షన్ మాత్రం సరికాదు'
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థకు అనుమతిచ్చి సస్పెండ్‌కు గురైన కేంద్ర హోంశాఖ అధికారులకు హోంశాఖ మాజీ కార్యదర్శి దన్నుగా నిలిచారు. వారిని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఏదైన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా విదేశాల నుంచి నిధులు పొందే సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఏ) ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి.
అయితే, జకీర్ నాయక్ కూడా ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి ఎఫ్సీఏ అనుమతి కోరగా దానికి అప్పుడు ఉన్న హోంశాఖ అధికారులు లైసెన్స్ ఇచ్చారు. అయితే, జకీర్ నాయక్ ఇటీవల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో జకీర్ నాయక్ పై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆయన స్వచ్చంద సంస్థ గుర్తింపు రద్దు చేశారు. దానికి అనుమతిచ్చిన నలుగురు అధికారులను ఈ నెల(సెప్టెంబర్) 1న సస్పెండ్ చేశారు.
దీనిపై హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై స్పందించారు. 'జకీర్ నాయక్‌పై కేసు వివరాలు ఏమిటో నాకు తెలియదు. కానీ సస్పెండ్ చేయడం సరికాదు. అలాంటి చర్యలు సాధారణంగా ప్రజలను నిరుత్సాహపరుస్తాయి. ఇలాంటి చర్యలే తీసుకుంటూపోతే బ్యూరోక్రసీ ఆగిపోయే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఆగిపోయే ప్రమాదం ఉంది. నా అనుభవం ప్రకారం హోంశాఖ కార్యదర్శి ఇలాంటి కేసుల్లో తన అధికారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు.