ఇతర రాష్ట్రాలలోనూ మిషన్ భగీరథ
కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ సూచన
మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందించేందుకు తాము చేపడుతున్న మిషన్ భగీరథ పథకం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు అంశాల్లో రాష్ట్రాల పనితీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ పథకం అమలు తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడేలా మిషన్ భగీరథ తీరు తెన్నులు, ప్రణాళికను వివరించాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ నన్ను కోరారు. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథను ప్రణాళికబద్ధంగా ఎలా ఏర్పాటు చేయాలి, నిధులు ఎలా సమకూర్చుకోవాలి తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చాను. పథకాన్ని కేంద్ర మంత్రి, ఇతర మంత్రులు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. సకాలంలో ఈ పథకాన్ని పూర్తిచేస్తాం’’ అని అన్నారు. రాష్ట్రాల్లో 100 రోజుల్లో వాటర్ టెస్టింగ్ లేబొరేటరీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించగా తాము 96 రోజుల్లోనే ఏర్పాటు చేసి ప్రశంసాపత్రాన్ని అందకున్నాన్నారు.
రెచ్చగొట్టే చర్యలు సరికాదు...
ప్రతిపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని మీడియా ప్రస్తావించగా ‘‘పాతబస్తీలో ఇంతకంటే ఎక్కువ గొడవలు జరిగాయి. వీళ్లెందుకు అక్కడికి వెళ్లారో.. వాళ్లెందుకు దాడి చేశారో తెలియదు. ఎన్నికల సమయంలో సంయమనంతో ఉండాలి. రెచ్చగొట్టే ప్రయత్నం చేయరాదు. కానీ ప్రతిపక్ష నేతలు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో కేవలం కాంగ్రెస్ నేతలపైనే దాడులు జరగలేదు. టీఆర్ఎస్ నేతలపైనా దాడులు జరిగాయి. కేసులు నమోదైన వారిలో టీఆర్ఎస్ వారూ ఉన్నారు. మా ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. దాడి ఘటనపై పోలీసు యంత్రాంగం తగిన రీతిలో స్పందిస్తుంది..’ అని ఆయన బదులిచ్చారు.