అసెంబ్లీ వద్దంటే.. ఎందుకు విభజిస్తారు
తెలంగాణ అంశం ఇప్పటికే అదుపు తప్పిందని కేంద్ర మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ''రాష్ట్ర ప్రజలు విభజన వద్దని చెబుతున్నపుడు, అసెంబ్లీ కూడా విభజన బిల్లును తిరస్కరించినప్పుడు పార్లమెంటు గుడ్డిగా దాన్ని ఆమోదించడానికి ముందుకు వెళ్లకూడదు'' అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో తప్పులు దొర్లాయని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లును శుక్రవారం నాడు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినప్పుడు.. ఆ భేటీలో తాను లేనని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలిలో చర్చించి, తిరస్కరించి కేంద్రానికి తిప్పి పంపిన ఈ బిల్లును యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచాలని తీర్మానించింది. అలాగే.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ పార్టీలు చేసిన డిమాండ్లు, సూచించిన సవరణలు మొత్తం 9072 ఉండగా, వాటిలో 32 సవరణలను మాత్రమే ఖరారు చేసింది.