సీమలో రాజధాని లేకుంటే మరో ఉద్యమం
తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎస్వీయూ విద్యార్థులు గురువారం బంద్ పాటించారు. తరగతులు బహిష్కరించి క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. రాయలసీమలోనే రాజధానిని నిర్మించాలని నినాదాలు చేశారు.
రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి(ఆర్‌ఎస్‌జేఏసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఎస్వీయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల విద్యార్థులు తరగతులు బిహష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్ ఏజే సూరి, కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, ఎస్వీయూ కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఎస్వీయూ విద్యార్థి నాయకులు ఎస్.మణి, శ్రీనురాయల్, మహేంద్రనాయక్, సాయికృష్ణ, చైతన్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లెలో..
మదనపల్లె క్రైం: రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక మల్లికార్జున సర్కిల్లో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉత్తన్న డివిజన్ నాయకులు రాజు, మణి, రామకృష్ణ, నాగార్జున, హరీష్, విద్యార్థులు పాల్గొన్నారు.