University of Missouri
-
అమెరికాలో వరంగల్ విద్యార్థిపై కాల్పులు
సాక్షి, వరంగల్/హైదరాబాద్: అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్(26) అనే విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం(అమెరికా కాలమానం ప్రకారం) మిస్సోరిలోని కాన్సస్ నగరంలో ఓ రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని శరత్‌ను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కొప్పు రామ్మోహన్, మాలతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు శరత్. కూతురు అక్షర. రామ్మోహన్ బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తుండగా, మాలతి పంచాయతీరాజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసిన రామ్మోహన్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఆయన తనయుడు శరత్ హైదరాబాద్‌లోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి.. మిస్సోరి యూనివర్సిటీలో ఎమ్మెస్ చదివేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. కాన్సస్‌లోని చార్లెట్ స్ట్రీట్ అపార్ట్మెంట్ 5303 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం అల్పాహారం కోసం శరత్ దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ‘‘ఇద్దరు స్నేహితులతో కలిసి శరత్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలో కొందరు దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్టు సమాచారం వచ్చింది. శరత్‌తో ఉన్న ఇద్దరు తప్పించుకున్నారు. శరత్ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వెనుక నుంచి కాల్పులు జరిపారు’’ అని రామ్మోహన్ తెలిపారు. అమెరికా నుంచి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు వివరించారు. పూర్తి సమాచారం అందించాలంటూ రామ్మోహన్ శనివారం డీజీపీని కలిశారు. - కొప్పు శరత్(ఫైల్) -
కాలు కదిపినా గుండె జబ్బులు దూరం
గంటల కొద్ది ఒకేచోట కూర్చుంటే ఏమవుతుంది..? కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశమూ లేకపోలేదు. అందుకే కనీసం గంటకోసారైనా లేచి అటూ ఇటూ తిరగాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే తాజా పరిశోధనల ప్రకారం కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు కనీసం కాళ్లను కదిపినా చాలని, దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు. కొంతమంది యువకులపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు. కాళ్లు కదిలించడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ పెరుగుతుందని ముందుగానే ఊహించినప్పటికీ రక్తనాళాల సమస్యలను నివారించే స్థాయిలో ఉంటుందని మాత్రం అనుకోలేదని జామే పాడిల్లా అనే పరిశోధకుడు పేర్కొన్నారు. రోజుకు 3 గంటల పాటు కూర్చునే వారిలో కొందరిని ఒక కాలును కదిలిస్తూ ఉండాలని చెప్పగా, మరికొందరికి నిమిషం పాటు కదిలించి, ఆ తర్వాత నాలుగు నిమిషాలు కదల్చకుండా ఉండాలని చెప్పినట్లు వివరించారు. కాలు దిగువ భాగంలో ఉండే రక్తనాళాల్లోని రక్తప్రసరణ పరిశీలించగా ఎక్కువ సేపు కదిలించిన వారిలో ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. -
మందుబాబుల సైకాలజీపై అధ్యయనం
ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. నలుగురు మిత్రులు కలిసి బార్‌కు వెళ్లి.. అందరూ ఒకే మోతాదులో మద్యాన్ని సేవించినా.. అందరూ ఒక్కతీరుగా ఉండరు. కొందరు రెండు పెగ్గులు తాగినా మాట తూళుతుంది. మరికొందరు ఐదారు పెగ్గులు తాగినా నిబాయించుకొని ఉండేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు కొంచెం మద్యం గొంతు దిగగానే చాలు.. తమలోని అనేకానేక కళలను వెలికితీస్తుంటారు. కొత్తగా ప్రవర్తిస్తారు. ఇందుకు కారణమేమిటి? మద్యం తాగిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎందుకు ప్రవర్తిస్తారు? అన్న అంశాలపై తాజాగా కొలంబియాలోని మిస్సోరి యూనివర్సిటీ సైకాలజీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ‘అడిక్షన్ రీసెర్చ్ అండ్ థియరీ’ పేరిట మిడ్వెస్ట్రర్న్ యూనివర్సిటీకి చెందిన 374మంది అండర్ గ్రాడ్యుయట్ల సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో మందుబాబులకు సంబంధించిన సంప్రదాయ అంశాలపై తార్కికమైన శాస్త్రీయమైన నిర్ధారణలు చేశారు. ఇందుకోసం సాహిత్యం, పాప్ కల్చర్‌ను పరిశోధకులు వడపోశారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు నాలుగు రకాల మందుబాబులు ఉంటారని తేల్చారు. ఆ నాలుగు రకాల వారికి: మేరి పప్పిన్స్, ద ఎర్నెస్ట్ హెమ్మింగ్వే, ద నట్టి ప్రొఫెసర్, మిస్టర్ హైడ్ అని పేర్లు పెట్టారు. ఈ నాలుగు రకాల్లో అత్యధికంగా 40శాతం మంది మందుబాబులు ఎర్నెస్ట్ హెమ్మింగ్వే కేటగిరీకి చెందుతారు. ప్రముఖ రచయిత హెర్నెస్ట్ హెమ్మింగ్వే పేరును ఈ కేటగిరీకి పెట్టారు. ఎందుకంటే తాను ఎంత పెద్దమొత్తంలో విస్కీ తాగినా.. తాగినట్టే కనిపించనని హెమ్మింగ్వే చెప్పేవారు. ఈ కేటగిరీకి చెందిన వారు మద్యాన్ని సేవించినా.. ఆ ప్రభావంతో తమ వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో మార్పు రాకుండా స్థిరంగా వ్యవహరిస్తారని అధ్యయనం పేర్కొంది. ఇక మేరీ పప్పిన్స్ కేటగిరీ విషయానికొస్తే 1964నాటి హాలీవుడ్ సినిమా పేరు ఇది. ఈ సినిమాలో మేరి పప్పీన్స్ పాత్ర మాదిరిగానే సంతోష సమయాల్లో, తమ ఆనందాన్ని మరింత పెంచుకోవడానికి, మరింత ఎంజాయ్ చేయడానికి వీరు మద్యాన్ని సేవిస్తారు. ఇక, నట్టి ప్రొఫెసర్ కూడా హాలీవుడ్ సినిమా పేరే. ఈ సినిమాలో ప్రధాన పాత్ర మాదిరిగానే ఈ కేటగిరీకి చెందిన మందుబాబులు సహజంగా ఆంతర్ముఖులై ఉంటారు. వీరు మద్యాన్ని సేవించినప్పుడు తమ సహజ భయాలను పక్కనబెట్టి మరింతగా ప్రజలతో కలిసిపోతారు. తాము అందరితో కలివిడిగా ఉంటామని చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక మిస్టర్ హైడ్ కేటగిరీకి వస్తే.. ఈ తరహా డింకర్స్లో రెండురకాల పాత్రలు ఉంటాయి. వీరు పెద్దగా బాధ్యతాయుతమైన వ్యక్తులు కాదు. పెద్దగా తెలివితేటలు కూడా ఉండవు. తాగినప్పుడు మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. వీరిపై మద్యం చాలా రాక్షసమైన ప్రభావాన్ని చూపుతుంది. -
మందుకొట్టే అలవాటు ఉందా.. అయితే?
న్యూయార్క్: మీరు యుక్తవయసులో ఉన్నారా, ఇప్పటికే మీకు మందుకొట్టే అలవాటు ఉందా. అయితే అర్జంటుగా పెళ్లిచేసుకోండి. మద్యపానం అలవాటు నుంచి బయటపడాలనుకుంటే భాగస్వామిని వెతుక్కోవాలని అమెరికా పరిశోధకులు సలహాయిస్తున్నారు. మందుకొట్టే దురలవాటును మాన్పించే శక్తి మ్యారేజీకి ఉందని వారు చెబుతున్నారు. అంతకుముందు పెద్ద మొత్తంలో సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేసి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలో డ్రింకింగ్ హాబిట్ ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందనే దానిపై పరిశీలన జరిపారు. పెళ్లికి ముందు, తర్వాత మందుబాబుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించారు. పెళ్లైన తర్వాత 50 శాతం మంది తాగుడు తగ్గించినట్టు తమ పరిశీలనలో తేలిందని పరిశోధకులు తెలిపారు. మద్యపానానికి బానిసలుగా మారిన వారు వివాహం తర్వాత మరింత శక్తివంతులుగా మారినట్టు నిర్థారణయిందని మిస్సౌరి యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ లీ చెప్పారు. వైవాహిక జీవితం కారణంగా మందుబాబులు మద్యపానం అలవాటు గణనీయంగా తగ్గించుకున్నారని వివరించారు.