కాలు కదిపినా గుండె జబ్బులు దూరం
గంటల కొద్ది ఒకేచోట కూర్చుంటే ఏమవుతుంది..? కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశమూ లేకపోలేదు. అందుకే కనీసం గంటకోసారైనా లేచి అటూ ఇటూ తిరగాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే తాజా పరిశోధనల ప్రకారం కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు కనీసం కాళ్లను కదిపినా చాలని, దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు. కొంతమంది యువకులపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు.
కాళ్లు కదిలించడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ పెరుగుతుందని ముందుగానే ఊహించినప్పటికీ రక్తనాళాల సమస్యలను నివారించే స్థాయిలో ఉంటుందని మాత్రం అనుకోలేదని జామే పాడిల్లా అనే పరిశోధకుడు పేర్కొన్నారు. రోజుకు 3 గంటల పాటు కూర్చునే వారిలో కొందరిని ఒక కాలును కదిలిస్తూ ఉండాలని చెప్పగా, మరికొందరికి నిమిషం పాటు కదిలించి, ఆ తర్వాత నాలుగు నిమిషాలు కదల్చకుండా ఉండాలని చెప్పినట్లు వివరించారు. కాలు దిగువ భాగంలో ఉండే రక్తనాళాల్లోని రక్తప్రసరణ పరిశీలించగా ఎక్కువ సేపు కదిలించిన వారిలో ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.