లబ్బీపేట(విజయవాడతూర్పు): కాళ్లు, చేతులు నరాలు మొద్దుబారడం, స్పర్శ తెలియక పోవడం, మంటలు పుట్టడం వంటి సమస్యలను ఇటీవల కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఇది పెరిఫరల్ న్యూరోపతి అనే నరాల జబ్బుగా వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని తొలిదశలో గుర్తించడం ద్వారా మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, నయం చేయవచ్చునంటున్నారు. అశ్రద్ధ చేస్తే కాళ్లు, చేతులకు రక్తప్రసరణ తగ్గి, గాంగ్రీన్స్ ఏర్పడడం, చివరికి అవయవాలు కోల్పోవడం, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పెరిఫరల్ న్యూరోపతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటున్నారు.
ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్న రోగులు
పెరిఫరల్ న్యూరోపతి బాధితులు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ నిర్వహించే న్యూరాలజీ విభాగానికి ప్రతిరోజూ 250 నుంచి 300 మంది రోగులు వస్తుంటారు. వారిలో 15 నుంచి 20 శాతం పెరిఫరల్ న్యూరోపతి సమస్యకు గురైన వారు ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. అంటే రోజూ 50 మంది చొప్పున వారానికి 150 మంది వరకూ పెరిఫరల్ న్యూరోపతి బాధితులు వస్తున్నారు. వీరిలో సమస్య తీవ్రతరమైన తర్వాత వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇది ఎవరికి వస్తుంది?
♦ జనాభాలో 2.4 శాతం మంది పెరిఫరల్ న్యూరోపతి సమస్యతో బాధపడుతున్నారు.
♦ మధుమేహుల్లో 70 శాతం మందికి వచ్చే అవకాశం ఉంది.
♦ వంశపారంపర్యంగా కూడా రావచ్చు
♦ రక్తనాళాల్లో తేడాలుంటే వచ్చే అవకాశం ఉంది.
♦ వయస్సు 55 ఏళ్లు నిండిన వారిలో రావచ్చు.
♦ క్యాన్సర్‌కు కీమోథెరఫీ పొందే వారిలో 40 శాతం మందిలో రావచ్చు.
♦ హెచ్‌ఐవీ/ఎయిడ్స్, టీబీ మందులు వాడే వారిలోనూ రావచ్చు.
♦ ఆల్కహాల్ సేవించే వారిలో, లెప్రసీ ఉన్న వారిలో కూడా రావచ్చు.
♦ కొందరికి స్పష్టమైన కారణం లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంది.
♦ నరాల తిమ్మిర్లు, మంటలు అనేవి కొందరిలో తాత్కాలికంగా కలిగి తగ్గిపోతే, మరికొందరికి దీర్ఘకాలంగా ఉంటూ చాలా ఇబ్బంది కలిగిస్తాయి.
వ్యాధి దుష్ఫలితాలివే...
► పెరిఫరల్ న్యూరోపతి ఉన్న కొందరిలో కండరాలు బిగుసుకుపోవడం, కండరాల అదురు, వణుకు కూడా ఉండవచ్చు.
► ఈ వ్యాధి సోకిన వారిలో కొందరిలో కండరాల బలహీనత, కండరాల క్షీణత, నడవడంలో ఇబ్బంది కూడా కలుగుతాయి.
► నడస్తూ ఉంటే స్పర్శ తెలియకుండా అవుతుంది.
► కొందరికి స్పర్శ తెలియకపోవడం, పాదం గాని, చేయిగాని, వేలు కానీ వంచితే ఎటు పక్కకి వంచారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
► కొందరిలో చెమటలు ఎక్కువగా పట్టడం, మరికొందరిలో తక్కువగా పట్టడం, నిల్చుంటే కళ్లు తిరగడం జరుగుతుంది.
► కంటినీరు, లాలాజలం తయారు కాదు.
► పురుషుల్లో లైంగిక పటుత్వం కూడా తగ్గే అవకాశం ఉంది.
► మూత్రకోశం, మలం పేగు అ«దీనంలో లేకుండా తయారవుతాయి.
► కంటిరెప్పలు పడిపోవడం, కంటి దగ్గర స్పర్శ తెలియకుండా పోతాయి.
► మూతి వంకర పోవడం కూడా జరగవచ్చు.
వ్యాధిపై అవగాహన అవసరం
పదేళ్లకు పైగా మధుమేహం ఉన్న వారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్ లోపం, కిడ్నీ ఫెయిల్యూర్, లివరు జబ్బులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి వాటికి వాడే కొన్ని మందులు పడకపోవడం వలన కూడా రావచ్చు. మూలకారణం తెలుసుకుని చికిత్స చేస్తే తేలికగా నయం చేయవచ్చు. ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం.
– డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి
మధుమేహుల్లో 70 శాతం మందిలో పెరిఫరల్ న్యూరోపతి వ్యాధి సోకుతున్నందున ప్రతి ఒక్కరూ శరీరంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తరచూ కాళ్లకు రక్తప్రసరణ సరిగా ఉందా లేదా పరీక్షించుకోవాలి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే దుష్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది.
– డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment