unwanted criticism
-
నిక్కీపై ట్రంప్ అనుచిత పోస్టులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు తెర తీశారు.అయోవా ప్రైమరీ బ్యాలెట్లో విజయం సాధించి ట్రంప్ ఇప్పటికే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హాలేపై ట్రంప్ తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. నిక్కీపై ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో అనుచిత పోస్టులు పెట్టారు. నిక్కీ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు అమెరికన్ పౌరసత్వం లేదని, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆమె అనర్హురాలని వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ఆమె పేరులోని అక్షరాలను కూడా తప్పుగా రాశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు నిక్కీ ఎక్స్‌లో ధీటైన సమాధానమిచ్చారు. ‘ట్రంప్ గురించి నాకు బాగా తెలుసు అభద్రతాభావం,భయానికి గురైనపుడు ట్రంప్ వేరే వ్యక్తుల పేర్లు తీస్తారు. ఈ విషయంపై దృష్టి పెట్టి నా శక్తిని నేను వృథా చేసుకోను’అని హాలే పోస్టు చేశారు. గతంలో ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు కూడా ఆయన అమెరికన్ కాదని జాతి వివక్ష ప్రచారాన్ని ట్రంప్ విస్తృతంగా నిర్వహించారు. ఈ నెల 15న జరిగిన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు రాగా రన్నరప్‌గా నిలిచిన డిశాంటిస్ ట్రంప్ దరిదాపుల్లో కూడా లేరు. నిక్కీ డిశాంటిస్ కన్నా వెనుకబడడం గమనార్హం. ఇదీచదవండి.. అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా -
వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్
♦ కాంగ్రెస్ నేతలకు కర్నె ప్రభాకర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ నాయకుడు జైరాం రమేశ్ మొదలు గల్లీ లీడర్ల దాకా రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే అనవసర విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు, మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, భానుప్రసాద్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. గాంధీ భవన్లో గాలి సామ్రాట్లు ప్రెస్మీట్లు పెడుతూ గాలి కూతల్లో డాక్టరేట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలను పదే పదే మాట్లాడితే నిజం అవుతాయనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారిని మించిన ఇసుక డాన్లు ఎవరూ లేరన్నారు. డ్రగ్స్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలే: జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో డ్రగ్స్ సంస్కృతిని పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ విమర్శలు చేయడం అంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్‌లో 3 పబ్‌లే ఉన్నాయన్న రేవంత్ దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.