UoH
-
అంతరిక్షంలో వ్యవసాయం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాములు అక్కడ తినడానికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆ తిండి పదార్థాలకు బదులు అంతరిక్షంలోనే పండించిన సహజమైన ఆహారాన్ని వారు ఆస్వాదించొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. సుదూర గ్రహాలపై వ్యవసాయం చేసేందుకు సాయం చేసే వినూత్న బ్యాక్టీరియాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్)తో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ గుర్తించినట్లు విశ్వవిద్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే నౌకల్లో పలుచోట్ల కొత్తరకం బ్యాక్టీరియా ఒకదాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. మిథైలోబ్యాక్టీరియేజ్ అని పిలిచే ఈ బ్యాక్టీరియాలో ఒక రకం మిథైలోరూబ్రమ్ రోడిసియానమ్ కాగా, ఇప్పటివరకూ గుర్తించని బ్యాక్టీరియా రకాలు మరో మూడు ఉన్నాయి. వీటికి భారత్‌లో కనిపించే మిథైలోబ్యాక్టీరియమ్ ఇండికమ్‌తో దగ్గరి పోలికలు ఉన్నట్లు భారతీయ శాస్త్రవేత్త, అణ్ణామలై యూనివర్సిటీ మాజీ అధ్యాపకులు డాక్టర్ అజ్మల్ ఖాన్ గుర్తించారు. ఈ కారణంగా ఆ బ్యాక్టీరియాకు మిథైలోబ్యాక్టీరియమ్ అజ్మలీ అని పేరు కూడా పెట్టారు. ఈ అజ్మలీ రకం బ్యాక్టీరియాలో మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే జన్యువులు ఉన్నట్లు తదుపరి పరిశోధనల ద్వారా తెలిసింది. జేపీఎల్‌కు చెందిన కస్తూరి వెంకటేశన్, సి.సి.వాంగ్లతోపాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు, సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్‌లు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివరించింది. పరిశోధన వివరాలు ఫ్రాంటియర్స్ ఆఫ్ మైక్రోబయాలజీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఇతర గ్రహాల బాట పట్టాల్సిందే! భూమ్మీది వనరులు ఏదో ఒకరోజు అంతరించే పరిస్థితి ఉండటం, జనాభాతోపాటు అవసరాలూ పెరిగిపోనున్న నేపథ్యంలో మనిషి ఇంకో వందేళ్లకైనా ఇతర గ్రహాల బాట పట్టాల్సిందేనని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇందుకోసమే ఒకవైపు భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతూండగా.. ఇంకోవైపున భూ వాతావరణం లేని గ్రహాల్లోనూ మనిషి మనుగడ సాగించేందుకు అవసరమైన వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ వంటి వారు ఇంకో ఐదేళ్లలోనే అంగారకుడిపై మానవులతో కూడిన కాలనీని ఏర్పాటు చేస్తానని రెండేళ్ల క్రితమే ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బిగ్ ఫాల్కన్ రాకెట్ ద్వారా దశలవారీగా సామగ్రిని పంపి అంగారకుడిపైన వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చి కాలనీని ఏర్పాటు చేస్తానని, వ్యవసాయంతోపాటు అన్ని రకాల వ్యవస్థల ఏర్పాటుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని మస్క్ చెబుతున్నారు. వీటి మాటెలా ఉన్నా.. మనిషి కనీస అవసరాలైన ఆహారం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అతితక్కువ గురుత్వాకర్షణ ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా ప్రవర్తిస్తాయి? వాటి ఎదుగుదల ఎలా ఉంటుంది? వంటి అంశాలపై పలు దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేదికగా ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నాసాల సంయుక్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా వ్యవసాయంలో బ్యాక్టీరియా పాత్రపై సామాన్యులకు తెలిసింది తక్కువే. మొక్కల వేళ్ల వద్దకు పోషకాలను చేర్చడంలో బ్యాక్టీరియా కీలకపాత్ర పోషిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు గుర్తించిన అజ్మలీ రకం బ్యాక్టీరియా మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ప్రాథమికంగా తెలిసినా... మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. శాస్త్రవేత్తల అంచనాలు నిజమైతే అంతరిక్షంలో మన కూడుకు ఢోకా లేనట్లే!! కాకపోతే ఈ విషయం తెలిసేందుకు మరికొంత సమయం పడుతుంది!! -
కరోనా: వ్యాక్సిన్ తయారీకి కీలక ముందడుగు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ మానవాళి బిక్కుబిక్కుమంటోంది. వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అది అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఒక ఊరటనిచ్చే కబురు చెప్పింది. హెచ్‌సీయూ అధ్యాపకురాలు సీమా మిశ్రా సాఫ్ట్వేర్ సాయంతో వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఎపిటోప్స్ రూపొందించారని తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: కరోనాపై పోరు: ‘జాతి రక్షణకై ప్రతిజ్ఞ చేస్తున్నాం’) ‘బయో కెమిస్ట్రీ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్ సీమా మిశ్రా సాఫ్ట్వేర్ సాయంతో టీ-సెల్ ఎపిటోప్స్‌ను తయారు చేశారు. ఈ ఎపిటోప్స్ కోవిడ్-19 ప్రోటీన్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. సీమా మిశ్రా రూపొందించిన డిజైన్ల ద్వారా వైరస్‌కు చుట్టూ ఉండే ప్రోటీన్లపై వీటిని ప్రయోగించి నాశనం చేయొచ్చు. అవి కేవలం వైరస్ ప్రోటీన్లపైనే పనిచేస్తాయి, మనిషికి సంబంధించిన ప్రోటీన్లపై దుష్ర్పభావం చూపవు. అయితే, ప్రయోగదశలో ఎపిటోప్స్ పనితీరు ఆధారంగా కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ ఆధారపడి ఉంటుంది. (చదవండి: రాష్ట్రాల వారిగా కరోనా కేసులు) అన్నీ సక్రమంగా కుదిరితే టీ-సెల్ ఎపిటోప్స్ సాయంతో పదిరోజుల్లోనే వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. ఎపిటోప్స్ డిజైన్లకు సంబంధించిన ఆన్లైన్ అధ్యయనాన్ని కెమ్‌రిక్సివ్ అనే జర్నల్‌కు సీమా మిశ్రా పంపించారు. ఆమె కంప్యూటర్ ఆధారిత గణన పరిశోధనలతో సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్ వైపు అడుగులు పడినట్టే. అయితే, ఈ ప్రయోగాలకు డబ్బు, సమయం అవసరం’ అని హెచ్‌సీయూ పేర్కొంది. వ్యాక్సిన్ తయారీని అలా ఉంచితే.. సామాజిక దూరం పాటించడమే కోవిడ్ నియత్రణకు మన ముందున్న మేలైన మార్గం అని హెచ్‌సీయూ స్పష్టం చేసింది. -
హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ
సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినికి క్యాంపస్ ప్లేస్మెంట్లో భారీ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లోని ఎంసీఏ విద్యార్థిని వి. నందిని సోని క్యాంపస్ ప్లేస్మెంట్లో అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. హెచ్‌సీయూలోని ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో ఈ ప్లేస్‌మెంట్‌ను నిర్వహించారు. రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి నందినిని అడోబ్ సిస్టమ్స్ కంపెనీ ఎంపిక చేసింది. దీంతో హెచ్‌సీయూలో చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవీయర్స్ కళాశాలలో బీసీఏ చదివారు. కాగా, ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్‌సీయూ ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో చైర్మన్ రాజీవ్ వాంకర్ తెలిపారు. ఇంజినీరింగ్ వదిలేశా: నందిని మొదట ఇంజినీరింగ్ కోర్సులు చేయాలనుకున్నా కానీ ఆ తరువాత కంప్యూటర్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉండాలన్న లక్ష్యంతో ఎంసీఏలో చేరినట్టు నందిని సోని తెలిపారు. స్మార్ట్ ఇండియా హాకథాన్– 2019లో తన బృందంతో కలిసి విజేతగా నిలిచినట్టు వెల్లడించారు. అత్యధిక ప్యాకేజీతో అడోబ్ సిస్టమ్స్‌లో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందన్నారు. (ఐసెట్–2020 నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు హెచ్‌సీయూ బంద్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్‌పై మళ్లీ అగ్గి రాజుకుంది. విద్యార్థుల సస్పెన్షన్‌కి వ్యతిరేకంగా ఐదు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో హెచ్‌సీయూ విద్యార్థి సంఘం మంగళవారం యూనివర్సిటీ బంద్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థుల సస్పెన్షన్‌కు యాజమాన్యం కక్షపూరిత వైఖరే కారణమని, దీనికి నిరసనగా విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించాలని కోరింది. వైస్ చాన్స్‌లర్ అప్పారావు కక్షపూరిత వైఖరి విద్యార్థుల భవిష్యత్‌ను బలితీసుకుంటున్నదని ఆరోపించింది. సోమవారం యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు, విద్యార్థులు మాట్లాడారు. వార్డెన్లు తాగి వచ్చి అనవసర రాద్ధాంతం చేయగా తమను సస్పెండ్ చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. వార్డెన్లపై దాడి జరిగితే పోలీస్ కంప్లెయింట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే బేషరతుగా సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థి సంఘం కార్యదర్శి ఆరిఫ్ అహ్మద్, నాయకులు బషీర్, భాస్కర్ డిమాండ్ చేశారు. ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న మగాళ్లందర్నీ మీ అమ్మాయిల హాస్టల్‌కి రానిస్తేనన్నా మీరు సంతృప్తి చెందుతారా’అంటూ ఓ వార్డెన్ నాతో అసభ్య ప్రేలాపన చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపే. దీనిని యాజమాన్యం నిలదీయకపోగా, రోహిత్ ఉద్యమంలో చురుకుగా ఉన్న 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. – అథిర ఉన్ని, విద్యార్థిని ప్రొక్టోరల్ కమిటీని ఎందుకు మినహాయించారు? ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్చేయడంలో ఉద్దేశం విద్యార్థులను భయపెట్టడమే. రోహిత్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారినే టార్గెట్ చేశారు. ప్రొక్టోరల్ కమిటీ క్యాంపస్‌లో ఉన్నతమైన కమిటీ, మరి దాన్నెందుకు విస్మరించారు. వీసీ అప్పారావు వైఖరికి టీడీపీ రాజకీయ అండదండలే కారణం. - మున్నా, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వార్డెన్లను దుర్భాషలాడింది ఎవరు? పది మందిపై వేటు వేశారు. వారినెలా గుర్తించారో తెలియదు. వారిలో ఎవరెవరు ఏం నేరం చేశారని కానీ, ఏం జరిగిందని కానీ రిపోర్టు ఇవ్వలేదు. మరి కమిటీ ఎందుకు వేసినట్టు..? - వెంకటేష్ చౌహాన్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇక్కడ ప్రశ్నించడమే నేరం.. ఆరోజు జరిగింది భౌతిక దాడి కాదు. కేవలం వాగ్వాదం. లైట్స్ ఆర్పి దాడికి దిగారనడం ఒఠ్ఠి అబద్ధం. తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇదంతా చేస్తున్నారు. రోహిత్ ఉద్యమంలో ఉన్నందుకే ఇదంతా. ఇక్కడ ప్రశ్నించడమే నేరమైంది. - సాయి యామర్తి, సస్పెండైన విద్యార్థి -
హెచ్‌సీయూలో మరో వివాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ(హెచ్‌సీయూ)లో మరో వివాదం రాజుకుంది. హాస్టల్ వార్డెన్‌తో విద్యార్థుల వాగ్వాదాన్ని సాకుగా చూపి వీసీ అప్పారావు 10 మంది విద్యార్థులను అకడమిక్స్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఇద్దరు అమ్మాయిలు, ఓ దళిత స్టూడెంట్, మరో ఏడుగురు విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా తయారైంది. అసలేమైందంటే..? ఈ నెల 3న రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీల పేరుతో డిప్యూటీ వార్డెన్ వినీత్ సీపీ నాయర్ బాయ్స్ హాస్టల్‌కు వచ్చారు. ఆ సమయంలో హాస్టల్లోని తన మిత్రుడి వద్ద పుస్తకం కోసం వచ్చిన అమ్మాయిని వార్డెన్ నిలదీశారు. దీంతో ఆయన వైఖరిని హాస్టల్ విద్యార్థులు తప్పు పట్టారు. విద్యార్థులు పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం సహజమేనని, దానికి అభ్యంతరమేంటని నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. దీన్ని సాకుగా చూపి, అక్కడ ఎలాంటి ఘర్షణ జరగకుండానే దీనిపై వీసీ అప్పారావు ఈ నెల 4న ఓ స్వతంత్ర కమిటీ వేశారు. 6న విద్యార్థులను కమిటీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు కమిటీ ఎదుట జరిగిన వాస్తవాన్ని వివరించారు. అక్కడ ఎలాంటి భౌతిక దాడులు జరగలేదని ఎంత చెప్పినా యాజమాన్యం పట్టించుకోలేదు. వామపక్ష రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తోన్న విద్యార్థులను గుర్తించి ముగ్గురిపై రెండేళ్లు, మరో ఏడుగురిపై ఆరు నెలలపాటు అకడమిక్ సస్పెన్షన్ విధించింది. నిజానికి హాస్టల్లో ఏ ఘటన జరిగినా ప్రొక్టోరల్ బోర్డ్ పరిశీలించి విచారించాల్సి ఉంటుంది. కానీ అదేదీ లేకుండా వర్సిటీ యాజమాన్యం.. ఏకపక్షంగా వ్యవహరించిందని, తమపై కక్ష సాధింపునకు పాల్పడిందని సస్పెన్షన్‌కు గురైన యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ నాయకుడు సాయికుమార్ యామర్తి ‘సాక్షి’కి తెలిపారు. సస్పెన్షన్‌కి గురైన వారిలో కేరళ ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ అర్పిత్, లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యులు తినంజలి, త్రిపురకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకుడు కేశబన్, హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకుడు సాహిత్, తెలంగాణ బీఎస్ఎఫ్ నాయకుడు వెంకటేశ్, బెంగాల్‌కు చెందిన శుభం గోస్వామి, ప్రత్యూష్, అథిర, సాగ్నిక్‌లు ఉన్నారు. ఇందులో ప్రత్యూష్, అథిర, సాగ్నిక్‌లను రెండేళ్లు మిగిలిన వారిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఆరు నెలల పాటు పాటు సస్పెండ్ అయినవారిని హస్టల్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయడం గమనార్హం. వారిపైనే వేటు వేయడంలో ఉద్దేశం..? హాస్టల్ వద్ద వాగ్వివాదం జరిగిన సమయంలో 200 మంది విద్యార్థులుంటే కేవలం వామపక్ష విద్యార్థి సంఘ నాయకులపైనే సస్పెన్షన్ వేటు వేయడంలో ఉద్దేశం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రోహి త్ వేముల మరణం తర్వాత కూడా వర్సిటీలో వీసీ అప్పారావు ఆగడాలకు అంతే లేకుండా పోతోందని విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థుల సస్పెన్షన్‌పై పోరా ట రూపాన్ని నిర్ధారించేందుకు అన్ని విద్యార్థి సంఘాలు వర్సిటీలో సమావేశమయ్యాయి. -
'రోహిత్ ఆత్మహత్య'పై మళ్లీ ప్రకంపనలు
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ అందించిన రిపోర్టుతో మళ్లీ వివాదం రేగింది. రోహిత్ దళితుడు, కాదని, అతని ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని తేల్చిన కమిటీపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్ వాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీతాజాగా తన రిపోర్టును మంత్రిత్వ శాఖకు అందజేసింది. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులుకారని, అది 'దురదృష్టకరమైన సంఘటన' అని తన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు కొన్ని సిఫారసులను కూడా చేసింది. వీటిని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ దళితుడు కాదని, ఓబీసీ అని తేల్చిన కమిటీ వాస్తవానికి తన రిపోర్టును ఆగస్టు 1న నివేదించాల్సి ఉంది. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దాన్ని బహిర్గతం చేయలేదని సమాచారం. కమిటీ రిపోర్టుపై అటు విద్యార్థులు, ప్రజాసంఘాలు, అధ్యాపక బృందం మండిపడుతోంది. ఉద్యమానికి సిద్ధమవుతోంది. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కమిటీ వాస్తవాలను తారుమారు చేసిందని ఆరోపిస్తు జాయింట్ యాక్షన్ కమిటీగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళను దిగనున్నాయి. అటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు వందమంది లెక్చరర్లు, నగరంలో నిర్వహించే 'మహా ధర్నా'కు మద్దతు నివ్వనున్నట్టు ప్రకటించారు. దాదాపు 33 ప్రజా సంఘాలు, ఇతర సంస్థలు వీరి పోరాటానికి అండగా నిలవనున్నాయి. అలాగే మిగిలిన రాష్ట్ర, కేంద్రీయ విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ముఖ్యంగా మనోవేదనకు గురైన విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న ఫిర్యాదుల కమిటీని మరింత పటిష్టం చేయాలని, తక్షణం సహాయం అందించేలా కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలని సిఫారసు చేసింది. విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేసినపుడు ఫిర్యాదు చేసే అవకాశంలేకపోవడం రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా కమిటీ పేర్కొంది. -
హెచ్ సీయూలో మరో వివాదం
హైదరాబాద్: పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో మరో వివాదం చోటుచేసుకుంది. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండడంతో హెచ్ సీయూలో ఇంటర్నెట్, వై ఫై నిలిపివేశారు. కంప్యూటర్, లైబ్రరీలకు తాళం వేశారు. దీని గురించి వర్సిటీ వర్గాలను విద్యార్థులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశానుసారం ఇంటర్నెట్ తొలగించామని సమాధానం వచ్చింది. ఆడిటోరియంకు సమీపంలో ఉన్న క్యాంపస్ నెట్ వర్క్ ఫెసిలిటీ(సీఎన్ఎఫ్) సెంటర్ ద్వారా విద్యార్థులు, సిబ్బందికి ఇంటర్నెట్, వై ఫైతో పాటు ఇతర ఐటీ సేవలు అందిస్తున్నారు. విద్యార్థుల హాస్టళ్లు, కామన్ ఏరియాలో ఇంటర్నెట్, వై ఫై నిలిపివేయాలని బుధవారం రాత్రి ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సీఎన్ఎఫ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. దీంతో గురువారం ఉదయం నుంచి క్యాంపస్ లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. తమ ఆందోళన ఉధృతం కాకుండా అడ్డుకునేందుకే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని గ్రహించిన ఉన్నతాధికారులు క్యాంపస్ లో అంతర్జాలం అందుబాటులో లేకుండా చేశారు. అయితే కుయుక్తులు పన్నినా తమ పోరాటం ఆగదని విద్యార్థులు అంటున్నారు. -
హెచ్‌సీయూలో ప్రొఫెసర్ల భేటీ
పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు సమావేశమయ్యారు. యూనివర్సిటీలోని డీఎస్ టీ ఆడిటోరియంలో దాదాపు 200 మంది అధ్యాపకులు భేటీ అయ్యారు. ఆందోళనలు కొనసాగితే.. విద్యార్థుల కెరీర్ కు నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లను పరిశీలించి.. వర్సిటీ లో ప్రశాంత వాతావరణం నెల కొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఆందోళనలు, ఉద్రిక్తతలు యూనివర్సిటీకి మాయని మచ్చగా మారనున్నాయని అభిప్రాయం వెలిబుచ్చారు. సమావేశం కొనసాగుతోంది. -
నేడు హైదరాబాద్ జేఎన్టీయూ బంద్
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా శుక్రవారం బంద్ పాటించాలని జేఎన్టీయూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. యూనివర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లోనూ తరగతులు బహిష్కరించాలని కోరాయి. బంద్‌లో భాగంగా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నాలో పాల్గొనాలని కోరాయి.