సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ మానవాళి బిక్కుబిక్కుమంటోంది. వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అది అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఒక ఊరటనిచ్చే కబురు చెప్పింది. హెచ్‌సీయూ అధ్యాపకురాలు సీమా మిశ్రా సాఫ్ట్‌వేర్ సాయంతో వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఎపిటోప్స్ రూపొందించారని తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
(చదవండి: కరోనాపై పోరు: ‘జాతి రక్షణకై ప్రతిజ్ఞ చేస్తున్నాం’)
‘బయో కెమిస్ట్రీ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్ సీమా మిశ్రా సాఫ్ట్‌వేర్ సాయంతో టీ-సెల్ ఎపిటోప్స్‌ను తయారు చేశారు. ఈ ఎపిటోప్స్ కోవిడ్-19 ప్రోటీన్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. సీమా మిశ్రా రూపొందించిన డిజైన్ల ద్వారా వైరస్‌కు చుట్టూ ఉండే ప్రోటీన్లపై వీటిని ప్రయోగించి నాశనం చేయొచ్చు. అవి కేవలం వైరస్ ప్రోటీన్లపైనే పనిచేస్తాయి, మనిషికి సంబంధించిన ప్రోటీన్లపై దుష్ర్పభావం చూపవు. అయితే, ప్రయోగదశలో ఎపిటోప్స్ పనితీరు ఆధారంగా కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ ఆధారపడి ఉంటుంది.
(చదవండి: రాష్ట్రాల వారిగా కరోనా కేసులు)
అన్నీ సక్రమంగా కుదిరితే టీ-సెల్ ఎపిటోప్స్ సాయంతో పదిరోజుల్లోనే వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. ఎపిటోప్స్ డిజైన్లకు సంబంధించిన ఆన్‌లైన్ అధ్యయనాన్ని కెమ్‌రిక్సివ్ అనే జర్నల్‌కు సీమా మిశ్రా పంపించారు. ఆమె కంప్యూటర్ ఆధారిత గణన పరిశోధనలతో సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్ వైపు అడుగులు పడినట్టే. అయితే, ఈ ప్రయోగాలకు డబ్బు, సమయం అవసరం’ అని హెచ్‌సీయూ పేర్కొంది. వ్యాక్సిన్ తయారీని అలా ఉంచితే.. సామాజిక దూరం పాటించడమే కోవిడ్ నియత్రణకు మన ముందున్న మేలైన మార్గం అని హెచ్‌సీయూ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment