యూపీసీపీఎంటీ ప్రశ్నపత్రాలు లీక్
ఘజియాబాద్: అత్యంత భద్రంగా ఉంచిన ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఆదివారం జరగాల్సిన ఉత్తరప్రదేశ్ కంబైన్డ్ ప్రీ-మెడికల్ టెస్ట్ (యూపీసీపీఎంటీ) వాయిదాపడింది. వీటిని నగరంలోని రెండు బ్యాంకుల్లోగల సెక్యూరిటీ లాకర్లో ఉంచారు. ఈ విషయమై ఘజియాబాద్ నగర మేజిస్ట్రేట్ అశుతోశ్ కుమార్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలను సీల్చేసి బాక్సుల్లో ఉంచారని, అయితే వాటి సీల్స్ తొలగిపోయి కనిపించాయని అన్నారు. దీంతో పరీక్షను వాయిదా వేయక తప్పలేదన్నారు. లక్నోలోని కింగ్ జార్జి వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు నగరంలోని 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
మొత్తం 9,760 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో నోడల్ అధికారి ఆర్కే దీక్షిత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన స్థానిక నవయుగ్ మార్కెట్ శాఖతోపాటు అలహాబాద్ బ్యాంకుల వద్దకు వెళ్లారు. లోపలికి వెళ్లిచూడడంతో బాక్సులకు వేసిన సీళ్లు తొలగిపోయి కనిపించాయి. దీంతో ఆయన విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.వి.ఎస్.రంగారావు దృష్టికి తీసుకుపోయారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.వి.ఎస్.రంగారావు ఈ విషయాన్ని వెంటనే లక్నోలోని కింగ్ జార్జి వైద్య విశ్వవిద్యాలయం అధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో సంబంధిత అధికారులు ఈ పరీక్షను వాయిదా వేశారు. జూలై 20వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తామని సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇదిలాఉండగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.