Upendra Chivukula
-
ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం
ఎడిసన్ : మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని న్యూజెర్సీ పట్టణంలోని సాయిదత్త పీఠంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధేయవాదం గురించి ప్రసంగించారు. ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారమని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రపంచంలోని చాలా మంది నాయకులు ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుత విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతిని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవం గా ప్రకటించటం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలను, ఆయన పాటించిన విలువలను జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యూజెర్సీ రాష్ట్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవంగా జరుపుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు, ధార్మిక సంస్థలకు అధికారిక ఉత్తర్వుల ప్రకటన జారీ చేశారు. కార్యక్రమంలో సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
అమెరికా ఎన్నికల్లో పది మంది ఎన్నారైలు!!
అమెరికాలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. అయినా, ఇప్పటికే పది మంది భారత సంతతి పౌరులు ఈ ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధం అయిపోతున్నారు. వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఏకైక భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మరోసారి కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగుతున్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి మళ్లీ పోటీ చేస్తానని కమలా హారిస్ చెబుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ పదవికి రిపబ్లికన్ నీల్ కష్కరీ రంగంలోకి దిగుతున్నారు. ఒకవేళ ఎన్నికైతే.. బాబీ జిందాల్, నిక్కీ హేలీల తర్వాత ఏకైక భారతీయ గవర్నర్ ఈయనే అవుతారు. అయితే.. ఈసారి అందరి కళ్లూ మాత్రం ఒబామా యంత్రాంగంలో వాణిజ్యశాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ రో ఖన్నా మీదే ఉన్నాయి. తన పార్టీకే చెందిన మైక్ హోండాకు ఆయన గట్టి సవాలు విసిరి.. 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు పోటీ పడుతున్నారు. ఒబామా ఎన్నికకు ఖన్నా భారీ మొత్తంలో విరాళాలు సేకరించడమే కాక, ప్రచారంలో కూడా గట్టిగా పాల్గొన్నారు. ఇదే స్థానంలో మరో భారతీయ అమెరికన్ కూడా పోటీలో ఉన్నారు. వనీలా మాథుర్ సింగ్ అనే మెడికల్ ప్రొఫెసర్ కూడా రంగంలో ఉన్నా, గెలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఒకే స్థానానికి ఇద్దరు ఎన్నారైలు పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి అవుతుంది. న్యూజెర్సీ అసెంబ్లీలో ఎన్నారై ప్రతినిధిగా ఉన్న చివుకుల ఉపేంద్ర ఈసారి న్యూజెర్సీ 12వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడనున్నట్లు చెప్పారు. ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మానన్ త్రివేదీ, ఇంకా పాల్ ర్యాన్, అమర్దీప్ కలేకా, స్వాతి దండేకర్, మంజు గోయల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. -
సినీ నటుడు శరత్ కుమార్ కు సత్కారం
రాజకీయ వేత్తగా మారిన దక్షిణాది నటుడు శరత్ కుమార్ ను న్యూజెర్సీ రాష్ట్ర శాసనసభ ఘనంగా సత్కరించింది. రాజకీయాల్లో ప్రవేశించి..తన నియోజకవర్గానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా సత్కరించినట్టు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చివుకులు ఉపేంద్ర తెలిపారు. సెంట్రల్ అసెంబ్లీ హాల్ జరిగిన ఓ కార్యక్రమంలో స్పీకర్ షీలా ఓలివర్ సంతకం చేసిన జ్ఞాపికను శరత్ కుమార్ కు ఉపేంద్ర అందచేశారు. తన నియోజకవర్గానికి విశేష సేవలు అందిస్తున్న శరత్ కుమార్... సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మూడవసారి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గతంలో శరత్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. న్యూజెర్సీ పర్యటనలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డగ్లస్ హెచ్ ఫిషర్, చివుకుల ఉపేంద్ర, జయంతి విలయానూర్, వ్యవసాయ శాఖ నిపుణుడు అల్ ఫ్రెడ్ ముర్రేలతో సమావేశమయ్యారు. న్యూజెర్సీలోని అధునిక వ్యవసాయ పద్దతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.