27 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఉప్పల్ (కమలాపూర్): మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. రైలు మార్గం ద్వారా తరచూ మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో జేసీ శ్రీదేవసేన ఆదేశాల మేరకు ఉప్పల్ నుంచి రామగుండం వరకు అన్ని రైల్వే స్టేషన్లలో మంగళవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహించినట్లు హుజూరాబాద్ డీటీసీఎస్ రాజమౌళి తెలిపారు.
ఉప్పల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా నాగపూర్ ప్యాసింజర్ ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 65 సంచుల్లోని సుమారు 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. తమను గమనించిన అక్రమ వ్యాపారులు పరారయ్యారని, వారిపై 6ఏ కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక డీలర్ అరుణాదేవికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఎస్వో శ్రీనివాస్, భీమదేవరపల్లి డీటీసీఎస్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.