రైల్వే గ్రూప్-డీ పరీక్షలో మాస్‌కాపీయింగ్
* ‘వాట్స్‌యాప్’ సాయంతో ప్రశ్నపత్రం లీక్
* బ్లూటూత్ ద్వారా సమాధానాల చేరవేత
* గుట్టురట్టు చేసిన ఎస్వోటీ పోలీసులు
* 20 మంది ముఠా సభ్యులు..10 మంది అభ్యర్థుల అరెస్టు
* పరారీలో కీలక సూత్రధారి
హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) గ్రూప్-డీ పరీక్షను హైటెక్ పద్ధతిలో మా స్ కాపీయింగ్ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీ సులు రట్టు చేశారు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్ ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 10 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు తేలింది.
‘తాయత్తు’లో సమాధానాలు..
ఆర్ఆర్సీ పరీక్ష మాస్‌కాపీయింగ్‌లో రైల్వే ఉద్యోగి మచ్చేందర్ కీలక సూత్రధారని పోలీసు లు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు సమాధానాలు చేరవేస్తానని ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశాడు. ఇందుకోసం 20 మంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేశాడు. మౌలాలి ఉప్పరిగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోని నీళ్లట్యాంక్ సమీపంలో ఒక తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీలు, సెల్ఫోన్లు, బ్లూటూత్‌ల ఆధారంగా పరీక్షహాల్లో ఉండే అభ్యర్థులకు సమాధానాలు చేరవేసేందుకు సిద్ధమయ్యాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠాలో కీలక సభ్యుడు వరుణ్ పరీక్ష హాల్లో అభ్యర్థిగా వెళ్లిపోయాడు. ఆదివారం నిర్వహించిన ఆర్ఆర్సీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని తన సెల్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్(మొబైల్ అప్లికేషన్) ద్వారా ముఠాకు చేరవేశాడు. ముఠాలోని మరో వ్యక్తి ఇలియాస్ జవాబులను నిపుణులైన గిరిధర్, వెంకటేశ్, అశోక్, శ్రీనివాస్(ముఠాసభ్యులే)తో తయారు చేయించాడు. తర్వాత ముఠా సభ్యులు జవాబులను తమ అభ్యర్థులకు హైటెక్ పద్ధతిలో చేరవేశారు. ఇందుకోసం మెడలో తా యత్తులా కనిపించే పరికరాన్ని(అందులో సిమ్‌కార్డు ఉంది) అభ్యర్థులకు ఇచ్చారు. దానితో పాటు జవాబులు వినిపించడానికి వైర్లెస్ ఇయర్‌ఫోన్ అందజేశారు.
ఈ ముఠాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ సిబ్బంది ఉప్పరిగూడ వద్ద ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా నగరంలోని దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాస్తున్న సరిత, పరమేశ్, శ్యాంలను అరెస్టు చేశారు. అలాగే, అర్చన కాంప్లెక్స్‌లోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇద్దరు, తిరుమలగిరిలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ఐదుగురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.
ముఠాసభ్యులు, అభ్యర్థుల నుం చి 13 సిమ్ కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 9 ఇయర్ ఫోన్స్, 27 సెల్ఫోన్లు, 17బైక్‌లు, 3 డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నా రు. నేరెడ్‌మెట్‌లోని డీఏవీ పాఠశాల, సమార్టిన్ పాఠశాల, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, విజయవాడలోని సెయింట్ రిటా హైస్కూల్, రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, గౌతం డిగ్రీ కాలేజీ, మియాపూర్‌లోని సెయింట్ రిటా హైస్కూల్లో మరికొందరు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడి ఉంటారని పోలీ సులు అనుమానిస్తున్నారు. కీలక సభ్యుడు మచ్చేందర్ పరారీలో ఉన్నట్లు అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు.
పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు
ఆర్ఆర్సీ గ్రూప్ డీ పరీక్షల్లో హైటెక్ మాస్‌కాపీయింగ్ జరగడంతో పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు ఆదివారాలు పరీక్షలు సాఫీగానే సాగాయి. చివరి ఆదివారం మాస్‌కాపీయింగ్ విషయం బయటపడింది. పోలీసుల నివేదిక ఆధారంగా మాస్‌కాపీయింగ్ జరిగిందా లేదా..? కేవలం పది మంది అభ్యర్థులకే వీరు సమాధానాలు చేరవేశారా లేక మరింత మంది ఈ తరహా కాపీయింగ్‌కు పాల్పడ్డారా? అనేది తెలియాలి. అప్పుడే పరీక్షలు మళ్లీ నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్పష్టత వస్తుంది’ అని అన్నారు.