డిజిటల్ తెలంగాణకు గూగుల్ సాయం
రాష్ట్ర ప్రభుత్వం–గూగుల్ మధ్య ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ తెలంగాణకు గూగుల్ తనవంతు సాయం అందించనుంది. క్లౌడ్ టెక్నాలజీ వినియోగం, గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు, చిన్న, మధ్యతరహా వ్యాపారాల్లో ఆన్ లైన్ వినియోగంలో ప్రభుత్వానికి సహకారం అందించనుంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం–గూగుల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్, గూగుల్ ఇండియా డైరెక్టర్ చేతన కృష్ణ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
టీహబ్‌లో ప్రారంభించిన స్టార్టప్‌లకు క్లౌడ్ వినియోగంలో గూగుల్ సహకరించనుంది. రాష్ట్రంలో బీటెక్, ఎంసీఏ విద్యారు్థలకు ఆండ్రాయిడ్‌లో శిక్షణకు కోర్సులు ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ వెబ్సైట్లను మొబైల్ ఫ్రెండ్లీగా మార్చడానికి సహకరిస్తుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఆన్ లైన్ పాయాలను కల్పించడం, గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటల్ తెలంగాణ సాధనలో గూగుల్ ముఖ్య భాగస్వామి అని, భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాల్లో గూగుల్ సహకారం తీసుకుంటామన్నారు.