అక్రమ నిర్మాణాలెలా వెలిశాయి?
జీవో 111 పరిధిలో కట్టడాలపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ చెరువులకు పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111 అమల్లో ఉన్నప్పుడు అక్కడ అక్రమ నిర్మాణాలు ఎలా వెలిశాయని ఉమ్మడి హైకో ర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే హెచ్ఎండీఏ ఏంచేస్తోందని నిలదీసింది. 40కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు భారీ నిర్మాణాలు చేపట్టాయంటే ఇది హోల్‌సేల్ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది.
ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రం గనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. తమ ముందున్న వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కాలేజీల్లో కొందరి తరఫున తాను గతంలో న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదనలు వినిపించినందున, ఈ కేసును తాను విచారించడం భావ్యం కాదని ఏసీజే తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాస నానికి నివేదిస్తున్నట్టు చెప్పారు.
అసలా అనుమతులెవరిచ్చారు?
111 జీవో పరిధిలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, ప్రభుత్వం ఎటువంటి చర్య లూ తీసుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ క్వాలిటీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఇంజనీరింగ్ కాలేజీలు భారీ భవనాలు నిర్మించాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘అదెలా సాధ్యం? 111 జీవో అమల్లోనే ఉంది కదా. ఈ జీవో పరిధిలోని ప్రాంతంలో ఎటు వంటి నిర్మాణాలు చేపట్టరాదని ఇదే ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణాలు చేస్తుంటే హెచ్ఎండీఏ ఏం చేస్తోంది? అనుమతులెవరిచ్చారు’అంటూ ప్రశ్నించింది.
జీవో పరిధిపై ఓ కమిటీ వేశాం...
దీనికి హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు స్పందిస్తూ... 111 జీవో పరిధిలో 84 గ్రామాలున్నాయని, ఈ జీవో చట్టబద్ధత విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో జీవో 111 పరిధిపై శాస్త్రీయ సర్వే నిర్వహిం చేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుం టూ... 40కి పైగా కాలేజీలు నిర్మాణాలు చేశాయంటే, అది హోల్‌సేల్ ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించింది.